కమల్ రిటైర్.. నేను ఎంజిఆర్ టైప్ కాదు..

65 ఏళ్ల జీవితంలో 58 ఏళ్ళ నట జీవితం.. కళామతల్లికి అంకితమైన అభినయం.. కోట్లాది మంది అభిమానులు.. వేలల్లో సన్మానాలు.. వందల్లో అవార్డులు.. చెప్పలేని రికార్డులు.. మరెన్నో రివార్డులు.. ఇవన్నీ ఒక్క మనిషి సొంతం. అతడే లోకనాయకుడు కమల్ హాసన్. ఇకపై ఈయన్ని సినిమాల్లో చూడలేం. ఎందుకంటే ఈయన సినిమాలకు రిటైర్మెంట్ ఇచ్చేసాడు. ఈయన తీరు చూస్తుంటే ఇప్పుడు భారతీయుడు 2లో కూడా నటిస్తాడా లేదా అనేది అనుమానంగా మారింది. ఓ వైపు రాజకీయాల్లో ఉంటూనే.. మరోవైపు సినిమాలు చేయడం తనవల్ల కాదంటున్నాడు కమల్. ఎంజిఆర్ తరహాలో తాను చేయలేనంటున్నాడు ఈ హీరో. అందుకే సినిమాలకు పూర్తిగా దూరం అవుతున్నట్లు అనౌన్స్ చేసాడు. భారతీయుడు 2 పరిస్థితి ఏంటి అనేది మాత్రం ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వలేదు కమల్ హాసన్.
2.0 తర్వాత భారతీయుడు 2 తెరకెక్కించనున్నాడు శంకర్. ప్రస్తుత రాజకీయాలకు తగ్గట్లుగా శంకర్ ఈ సినిమా కథ సిద్ధం చేసాడు. మరి ఈ సినిమా తర్వాత రిటైర్మెంట్ ఇస్తాడా లేదంటే ఆ నిర్ణయం ఇప్పట్నుంచే అమలులో ఉంటుందా అనేది తెలియదు. శంకర్ సినిమా అంటే కచ్చితంగా రెండేళ్లు పడుతుంది కాబట్టే రెండేళ్ల తర్వాత సినిమాలకు రిటైర్మెంట్ ఇస్తాడని అనుకోవచ్చా..? అప్పుడెప్పుడో 1960లో బాల నటుడిగా ఇండస్ట్రీకి వచ్చాడు కమల్. 37 ఏళ్లుగా హీరోగా కొనసాగుతున్నాడు. ఈ మధ్యలో ప్రపంచంలో ఏ నటుడికి సాధ్యం కాని రీతిలో ఎన్నో సినిమాలకు.. ఎన్నో సంస్థల నుంచి 182 అవార్డులు అందుకున్నాడు లోకనాయకుడు. జాతీయ అవార్డులు, నంది అవార్డులు, రాష్ట్ర ప్రభుత్వ అవార్డులకు కూడా కొదవే లేదు. కరుణానిధి మరణం తర్వాత తమిళ రాజకీయాల్లో శూన్యత వచ్చేసింది. దాన్ని భర్తీ చేయడానికి తాను పూర్తిస్థాయిలో నడుం బిగించబోతున్నాడు కమల్ హాసన్.