English   

క‌ణం రివ్యూ

Kanam-Review
2018-04-27 06:48:08

సాయిప‌ల్ల‌వి సినిమా అంటే ఇప్పుడు ప్రేక్ష‌కుల్లో ఏదో తెలియ‌ని ఓ ఆస‌క్తి. క‌ణం సినిమాపై కూడా ఇదే ఆస‌క్తి ఉంది. అయితే సినిమా ఆల‌స్యం అవుతున్న కొద్దీ ఆ ఆస‌క్తి త‌గ్గింది. కానీ విడుద‌ల‌కు ముందు మ‌ళ్లీ అదే పెరిగింది. ఇప్పుడు సినిమా విడుద‌లైంది. మ‌రి క‌ణంతో మ‌రోసారి ప‌ల్ల‌వి త‌న మాయ కొన‌సాగించిందా..? ఫ‌స్ట్ టైమ్ సొంత ఇండ‌స్ట్రీకి వెళ్లింది.. అక్క‌డ హిట్ కొట్టిందా..? 

క‌థ‌: తుల‌సి(సాయిపల్ల‌వి).. కృష్ణ‌(నాగ‌శౌర్య‌) ప్రేమించుకుంటారు. ఓ స‌మ‌యంలో ఇద్ద‌రూ తొంద‌ర‌ప‌డ‌తారు. లైఫ్ లో సెటిల్ అవ్వ‌క‌ముందే వాళ్లు చేసిన ప‌నికి తుల‌సి గ‌ర్భ‌వ‌తి అవుతుంది. పెళ్లి కాకుండా త‌ల్లి కావ‌డం ఏంట‌ని.. ఇటు తుల‌సి, అటు కృష్ణ కుటుంబాలు క‌లిసి తుల‌సికి అబార్ష‌న్ చేయిస్తారు. ఇద్ద‌రి అంగీకారంతోనే ఐదేళ్ల త‌ర్వాత వాళ్ల పెళ్లి చేస్తారు. అంతా జ‌రిగింది మ‌రిచిపోతారు కానీ తుల‌సి మాత్రం ఆ పాప ఊహ‌ల్లోనే ఉంటుంది. ఆ స‌మ‌యంలో చ‌నిపోయిన దియా(వెరోనికా) ఆత్మ‌గా మారుతుంది. త‌న‌ను చంపిన వాళ్ల‌పై ప‌గ తీర్చుకోడానికి వ‌స్తుంది. త‌ర్వాత ఏమైంది అనేది అస‌లు క‌థ‌..!

క‌థ‌నం: క‌ణం అంటే ముందు ఎమోష‌న‌ల్ డ్రామా అని.. పోస్ట‌ర్ చూడ‌గానే నాన్న సినిమాలా మ‌రోసారి ఏఎల్ విజ‌య్ ఏడిపించ‌డం ఖాయం అని ఊహ‌కు వ‌చ్చేసారంతా. కానీ థియేట‌ర్ లోకి వెళ్లిన త‌ర్వాత ఆలోచ‌న‌ల‌ను పూర్తిగా మార్చేసాడు విజ‌య్. ఎమోష‌న‌ల్ డ్రామానే కానీ దానికి రివేంజ్ ను కూడా మిక్స్ చేసాడు ఈ ద‌ర్శ‌కుడు. చిన్న‌పిల్ల‌తో మ‌ర్డ‌ర్లు చేయించాడు. బ్రూణ‌హ‌త్య‌లు మ‌హాపాపం అని తెలుసు. అందుకే ఆత్మ‌తో ప్ర‌తీకారం తీర్చుకునేలా చేసాడు. చాలా మంది చేస్తోన్న తొంద‌ర‌పాటు ప‌నుల వ‌ల్ల లోకం కూడా చూడ‌కుండా ఎన్నో ల‌క్ష‌ల మంది ప్రాణాలు క‌డుపులోనే బ‌లైపోతున్నాయి. ఇదే కాన్సెప్ట్ ను తీసుకుని క‌ణం చేసాడు ఏఎల్ విజ‌య్. ఎక్క‌డా చిన్న టైమ్ వేస్ట్ కూడా చేయ‌కుండా నేరుగా క‌థ‌లోకి వెళ్లి పోయాడు ద‌ర్శ‌కుడు. కేవ‌లం గంట 40 నిమిషాల నిడివి ఉండ‌టంతో ఎక్క‌డా ల్యాగ్ అయిన ఫీలింగ్ రాదు. కానీ స్క్రీన్ ప్లే లోపం మాత్రం చాలా బాగా క‌నిపిస్తుంది. ఫ‌స్టాఫ్ వ‌ర‌కు స్లోగా సాగిన ఈ చిత్రం.. సెకండాఫ్ లో కాస్త ఆస‌క్తి పుట్టిస్తుంది. తండ్రి అయినా కూడా త‌న‌ను చంపిన పాపానికి అత‌న్ని కూడా చంపాల‌నుకునే ఆత్మ‌.. భ‌ర్త‌ను కూతురు నుంచి కాపాడుకోవాల‌నునే త‌ల్లి.. రెండు పాయింట్స్ సెకండాఫ్ లో ఆస‌క్తి పుట్టించాయి. చివ‌రికి చిన్న ట్విస్ట్ తో క‌థ‌కు సుఖాంతం ప‌లికాడు ద‌ర్శ‌కుడు. 

న‌టీన‌టులు: నాగ‌శౌర్య మ‌రోసారి మంచి న‌ట‌న క‌న‌బ‌ర్చాడు. ఛ‌లోలో చ‌లాకీ కుర్రాడిగా క‌నిపించిన ఈ హీరో.. క‌ణంలో బాధ్య‌త గ‌ల యువ‌కుడిగా.. భ‌ర్త‌గా మారాడు. ఇక సాయిప‌ల్లవి న‌ట‌న గురించి కొత్త‌గా చెప్పాల్సిన ప‌నేం లేదు. ఆమె ఎంత మంచి న‌టో ఇప్ప‌టికే అర్థ‌మైంది. మ‌రోసారి త‌న‌లోని న‌టిని బ‌య‌టికి తీసుకొచ్చింది ప‌ల్ల‌వి. ప్రియ‌ద‌ర్శి ఫ‌స్టాఫ్ లో ఏదో పిచ్చి కారెక్ట‌ర్ అనిపించినా.. సెకండాఫ్ లో కీల‌కంగా మారిపోయాడు. క్లైమాక్స్ ఆయ‌న చేతుల మీదుగానే సాగుతుంది. ఇక బేబీ వెరోనిక పాత్ర కీల‌కం. క‌డుపులోనే చ‌నిపోయిన పిండం.. ఆత్మ‌గా మారి అంద‌ర్నీ చంప‌డం అనేది అప్ప‌ట్లో దేవీపుత్రుడు కాలంలోనే చూసాం. కానీ ఇప్పుడు కాస్త అప్ డేట్ చేసాడు విజ‌య్. మిగిలిన వాళ్లంతా ఓకే. 

టెక్నిక‌ల్ టీం: క‌ణంకు బిగ్గెస్ట్ ప్ల‌స్ సంగీతం. శామ్ సిఎస్ అందించిన నేప‌థ్య సంగీతం అదిరిపోయింది. హార్ర‌ర్ థ్రిల్ల‌ర్ కు ఈ మాత్రం లేక‌పోతే క‌ష్ట‌మే. ఇక నీర‌వ్ షా సినిమాటోగ్ర‌ఫీ అదిరిపోయింది. బాలీవుడ్ నుంచి వ‌చ్చిన ఈ కెమెరామెన్ త‌న మాయాజాలం చూపించాడు. ఎడిటింగ్ బాగుంది. గంట‌న్న‌ర కంటే కాస్త ఎక్కువ‌గా ఉన్న ఈ చిత్రం ఎక్క‌డా పెద్ద‌గా బోర్ అనిపించ‌దు. కానీ రిపీటెడ్ సీన్లు వ‌స్తుంటాయి. క‌థ‌కుడిగా విజ‌య్ స‌క్సెస్ అయ్యాడు కానీ దాన్ని ఆస‌క్తిక‌రంగా మ‌ల‌చ‌డంలో కాస్త త‌డ‌బ‌డ్డాడేమో అనిపిస్తుంది. తాను తీసుకున్న కాన్సెప్ట్ ను అర్థ‌వంతంగా పూర్తి చేయ‌లేకపోయాడు ఈ ద‌ర్శ‌కుడు. కానీ క‌చ్చితంగా మంచి సినిమా అయితే ఇచ్చాడు.

చివ‌ర‌గాక‌ణం.. అప్ప‌ట్లో నాన్న‌.. ఇప్పుడు అమ్మ‌.. 

రేటింగ్: 2.5/5

More Related Stories