English   

క‌ర్త‌వ్యం రివ్యూ

Karthavyam-Review
2018-03-13 08:32:26

న‌య‌న‌తార సినిమా అంటే అది డ‌బ్బింగ్ అయినా ప‌ర్లేదు ఓ సారి చూద్దాం అనుకునే అభిమానులుంటారు. అలాంటి వాళ్ల కోస‌మే ఇప్పుడు క‌ర్త‌వ్యం సినిమాను తెలుగులోకి అనువ‌దించారు శ‌ర‌త్ మ‌రార్. మ‌రి ఈ చిత్రం నిజంగానే న‌య‌న‌తార ఫ్యాన్స్ కు ట్రీట్ ఇస్తుందా..? ఆ క‌ర్త‌వ్యం రేంజ్ లో ఈ క‌ర్త‌వ్యం మ‌న‌సుకు న‌చ్చుతుందా..? 

క‌థ‌: అన‌గ‌న‌గా వేనీడు అనే గ్రామం. అక్క‌డ తాగ‌డానికి కూడా నీళ్లు లేక జ‌నం అష్ట‌క‌ష్టాలు ప‌డుతుంటారు. ఆ ప్రాంతానికి క‌లెక్ట‌ర్ గా వెళ్తుంది మ‌ధువ‌ర్షిణి(న‌య‌న‌తార‌). త‌న ప‌ద‌వితో ప్ర‌జ‌ల‌కు మంచి చేయాల‌నుకునే ఆఫీస‌ర్ ఈమె. ఆ గ్రామంలో కూలి చేసుకుని బ‌తికే జంట బుల్ల‌బ్బాయి  (రామ్స్), సుమతి(సునుల‌క్ష్మి). వాళ్ల‌కు ఇద్ద‌రు పిల్ల‌లు. ఓ రోజు సుమ‌తి కూలి ప‌నిలో ఉన్న‌పుడు ఈమె కూతురు ధ‌న్షిక‌(మ‌హాల‌క్ష్మి) ఆడుతూ వెళ్లి ప‌క్క‌నే పొలంలో మూయ‌కుండా వ‌దిలేసిన బోరుబావిలో ప‌డుతుంది. అందులోంచి పాప‌ను ఎలా బ‌య‌టికి తీసారు..? ప‌్ర‌భుత్వం ఆ పాప‌కు ఎలా సాయం చేసింది..? అస‌లు మ‌ధువ‌ర్షిణి పాప విష‌యంలో ఎందుకు ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా వెళ్లాల్సి వ‌చ్చింది అనేది మిగిలిన క‌థ‌..!

క‌థ‌నం: ఓ సినిమా హిట్ అవ్వాలంటే ఆరు పాట‌లు.. నాలుగు కామెడీ సీన్లు.. మూడు ఫైట్లు మాత్ర‌మే ఉంటే స‌రిపోదు. మ‌న‌సుకు హ‌త్తుకునే క‌థ ఒక‌టి ఉంటే చాలు. అప్పుడు కూడా సినిమాలు విజ‌యం సాధిస్తాయి. ఇదే విష‌యాన్ని గ‌తేడాది త‌మిళ‌నాట నిరూపించింది అర‌మ్ సినిమా. అక్క‌డ ఈ చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. ఇందులో స్టార్ హీరోలెవ‌రూ లేరు. కానీ త‌మిళ‌నాట 40 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసింది ఈ చిత్రం. ఇప్పుడు ఇదే సినిమాను తెలుగులో క‌ర్త‌వ్యంగా విడుద‌ల చేసాడు శ‌ర‌త్ మరార్. ఇందులో న‌టులెవరో మ‌న‌కు తెలియ‌దు ఒక్క న‌య‌న‌తార త‌ప్ప‌. అయినా స‌రే క‌ర్త‌వ్యం మ‌న‌సుకు హ‌త్తుకుంటుంది. క‌న్నీరు పెట్టించే ఎమోష‌న్ ఈ క‌థ‌లో ఉంది. ఓ పేదోడికి క‌ష్టం వ‌స్తే ప్ర‌భుత్వం వాళ్ల‌పై ప్ర‌భుత్వం చూపించే అల‌స‌త్వాన్ని అంద‌రికీ అర్థ‌మ‌య్యేలా చూపించాడు ద‌ర్శ‌కుడు గోపీనైన‌ర్. క‌థ గొప్ప‌దేం కాక‌పోవ‌చ్చు కానీ ఆయ‌న చూపించిన క‌థ‌నం మాత్రం చాలా గొప్ప‌ది. ఆలోచించే విధంగా ఉంది. ప‌ట్టుస‌డ‌ల‌ని స్క్రీన్ ప్లే ప్రేక్ష‌కుల్ని మాయ చేస్తుంది. 

బోరుబావిలో ప‌డ్డ చిన్నారిని కాపాడ‌టం అనే చిన్న పాయింట్ ను తీసుకుని రెండు గంట‌ల సినిమా న‌డిపించాడు ద‌ర్శ‌కుడు. అది కూడా ఎక్క‌డ బోర్ కొట్ట‌కుండా న‌డిపించ‌డం అనేది క‌త్తిమీద సామే. దాన్ని విజ‌య‌వంతంగా పూర్తి చేయ‌డ‌మే కాదు క‌న్నీళ్లు కూడా పెట్టించాడు ద‌ర్శ‌కుడు. సినిమా మొద‌ట్లోనే ఇండియా రాకెట్ లాంఛ్ చేస్తుందంటూ చూపించి.. చివ‌రికి క‌థ‌తోనే దానికి లింక్ పెట్టిన విధానం అద్భుతం. క్లైమాక్స్ లో ఆ రాకెట్ పైకి వెళ్తుంటే.. ఇక్క‌డ బోరుబావిలో చిన్నారికి దాన్ని లింక్ చేయ‌డం అనేది ద‌ర్శ‌కుడి ప్ర‌తిభ‌కు తార్కాణం. ఒక్క‌సారి బోరుబావి లోకి పాప ప‌డిన త‌ర్వాత ప్రేక్ష‌కులు కూడా ఏం జ‌రుగుతుందా అని ఊపిరి బిగప‌ట్టుకుని కూర్చోవాల్సిందే. అంత‌గా ఎమోష‌న్స్ హైలైట్ చేసాడు ద‌ర్శ‌కుడు గోపీ. క్లైమాక్స్ వ‌ర‌కు క‌థ‌ను న‌డిపించి.. చివ‌ర్లో మ‌రింత హృద్యంగా క‌థ‌ను ముగించాడు. అప్ప‌టి వ‌ర‌కు యంత్రాంగం.. ప్రభుత్వం చేయ‌లేని ప‌నిని వాళ్ల‌కు వాళ్లే ఎలా చేసుకున్నారు అనేది ఈ చిత్రంలో హైలైట్. ఆ పాప‌ను ఎలా బ‌య‌టికి తీసారు అనేది చెప్పేస్తే బాగుండ‌దు కాబ‌ట్టి అది స‌స్పెన్స్. 

న‌టీన‌టులు:  ఫీమేల్ ఓరియెంటెడ్ పాత్ర‌ల‌కు న‌య‌న‌తార కేరాఫ్ అడ్ర‌స్ అయిపోయింది. ఇలాంటి పాత్ర‌లు ఆమెకు కొట్టిన‌పిండి. ఇప్పుడు క‌ర్త‌వ్యంలో కూడా క‌లెక్ట‌ర్ పాత్ర‌లో జీవించింది. క‌లెక్ట‌ర్ మ‌ధువ‌ర్షిణిగా న‌య‌న్ ను త‌ప్ప మ‌రొక‌ర్ని ఊహించుకోవ‌డం సాధ్యం కాదు. ఇక పాప తండ్రిగా రామ్స్.. త‌ల్లిగా సునుల‌క్ష్మి చాలా బాగా న‌టించారు. బోరుబావిలో ప‌డే అమ్మాయి ధ‌న్షిక‌గా మ‌హాల‌క్ష్మి అద్భుతంగా న‌టించింది. మిగిలిన వాళ్ల పాత్ర‌ల‌న్నీ క‌థానుగుణంగా వ‌చ్చి వెళ్తుంటాయంతే. 

టెక్నిక‌ల్ టీం: క‌ర్త‌వ్యం సినిమాకు ప్రాణం సంగీతం. జిబ్ర‌న్ కు నూటికి నూరు మార్కులు ప‌డ‌తాయి. పాట ఒక్క‌టే ఉన్నా.. బ్యాగ్రౌండ్ స్కోర్ మాత్రం అద్భుతం. త‌న సంగీతంతో మ‌న‌సుల‌ను బ‌రువెక్కించేసాడు జిబ్ర‌న్. ఇక సినిమాటోగ్ర‌ఫీ బాగుంది. ముఖ్యంగా బోరుబావి సీన్స్ న్యాచుర‌ల్ గా వ‌చ్చాయి. ఎడిటింగ్ ప‌ర్లేదు. మ‌ధ్య‌లో త‌మ్మారెడ్డి, సుద్దాల అశోక్ తేజ‌తో వ‌చ్చే డిస్క‌ష‌న్ ను తీసేసిన ప‌ర్లేదేమో. క‌థ‌కు అడ్డుప‌డే సీక్వెన్స్ అది. డ‌బ్బింగ్ పై ఇంకాస్త శ్ర‌ద్ధ చూపించి ఉంటే బాగుండేది. క‌థ‌కుడిగా, ద‌ర్శ‌కుడిగా గోపీనైన‌ర్ ఎక్కువ మార్కులు కొట్టేసాడు. ఈయ‌న చెప్పిన తీరు అంద‌రికీ న‌చ్చ‌క‌పోవ‌చ్చు కానీ మ్యాగ్జిమ‌మ్ ప్రేక్ష‌కుల‌కు ఈ క‌ర్త‌వ్యం చేరువ కావ‌డం ఖాయం. క‌థ‌ను క‌థ‌గా చూపిస్తూనే ప్ర‌భుత్వంలో ఉన్న లోటుపాట్ల‌ను కూడా ఎత్తి చూపించాడు ద‌ర్శ‌కుడు. 

చివ‌ర‌గా:  ఓ చిన్నారి జీవితం.. క‌లెక్ట‌ర్ క‌ర్త‌వ్యం.. ఆలోచింప‌జేసే మంచి సినిమా..

More Related Stories