English   

కవచం రివ్యూ

Kavacham
2018-12-07 10:33:00

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన సినిమా ‘కవచం’ కాజల్, మెహ్రీన్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా నేడు విడుదలైంది. శ్రీనివాస్ మామిళ్ల అనే కొత్త దర్శకుడ్ని ఈ చిత్రం ద్వారా ఇండస్ట్రీకి పరిచయం చేయగా వంశధార క్రియేషన్స్ బ్యానర్‌లో నవీన్ శొంఠినేని ఈ చిత్రానికి కోట్లు ఖర్చు చేశారు. టీజర్, ట్రైలర్ సినిమాపై ఆసక్తి కలిగించాయి. యాక్షన్ సినిమాలతో ఇంతకు ముందు ప్రేక్షకుల ముందుకొచ్చిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్, ఈసారి ఏదో కొత్త ప్రయత్నం చేశాడనే నమ్మకాన్ని కలిగించాయి. అయితే సినిమా ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుందా? లేదా? అనేది పూర్తి రివ్యూ చూసి తెలుసుకోవాల్సిందే. 

కధ :

విజయ్ (బెల్లంకొండ సాయి శ్రీనివాస్) విశాఖపట్టణం త్రీటౌన్ పోలీస్ స్టేషన్ లో సబ్ ఇన్ స్పెక్టర్. షాపింగ్ మాల్ లో పరిచయమైన సంయుక్త(కాజల్ అగర్వాల్)తో ప్రేమలో పడతాడు. ఆ అమ్మాయి కాఫీ షాపులో పని చేస్తుందని తెలుసుకుని రోజూ ఆ కాఫీ షాపుకు వెళతాడు. ఓ రోజు తన ప్రేమను సంయుక్తకు చెప్పడానికి విజయ్ కాఫీ షాపుకు వెళితే అక్కడ సంయుక్త కనిపించదు. ఆమెకు పెళ్లి కుదిరిందని, ఉద్యోగం మానేసిందని తెలుసుకుని బాధతో వెనుతిరుగుతాడు. తరవాత రోడ్డు మీద లావణ్య (మెహరీన్) అనే అమ్మాయిపై కొందరు ఆకతాయి రౌడీలు అఘాయిత్యం చేయబోతే విజయ్ కాపాడతాడు. విజయ్ కు తనను తాను సంయుక్త గా పరిచయం చేసుకుంటుంది లావణ్య. ఆమెను ప్రేమికుడు మోసం చేస్తే విజయ్ ధైర్యం చెబుతాడు. ఈలోపు విజయ్ అమ్మకు యాక్సిడెంట్ జరిగితే డబ్బు లేక టెన్షన్ పడుతుంటాడు. అప్పుడు లావణ్య ఓ ఐడియా చెబుతుంది. తన మావయ్యకు ఫోన్ చేసి తనను కిడ్నాప్ చేసినట్టు చెప్పి, రూ.50 లక్షలు డిమాండ్ చేయమంటుంది. విజయ్ అలాగే చేస్తాడు. లావణ్యను ఓ బస్ స్టాప్ లో వదిలేస్తాడు. తరవాత సంయుక్త కనిపించడం లేదని, విజయ్ అనే పోలీస్ ఆమెను కిడ్నాప్ చేసినట్టు మీడియాలో వార్తలు వస్తాయి. తను ప్రేమించిన సంయుక్తను విజయ్ కిడ్నాప్ చేయడం ఏమిటి ? సంయుక్త స్థానంలోకి లావణ్య ఎందుకొచ్చింది? అసలు, నిజమైన సంయుక్త ఎవరు? ఎవరు ఎవర్ని కిడ్నాప్ చేశారు ? చివరకు, కిడ్నాప్ కేసు నుంచి విజయ్ ఎలా తప్పించుకున్నాడు? దీని వెనుకు ఉన్నది ఎవరు? అనేది కథ!

కధనం : 

వెంకటేష్ మల్లీశ్వరి సినిమా చూశారా? ఓసారి ఆ సినిమా కథను గుర్తు చేసుకోండి. అనగనగా ఓ రాణి కానీ, ఆ రాజ్యానికి రాజు ఉండదు. ఆ రాజ్యానికి ఆ రాజ్య సంపదకు ఆమె వారసురాలు. దానిపై కన్నేసిన కొందరు బంధువులు రాబంధువుల్లా మారి ఆమెను చంపాలనుకుంటారు. అప్పుడు ఆ రాణికి ఓ సామాన్యుడు (వెంకటేష్) ఎలా అండగా నిలబడ్డాడు? అనేది సినిమా. త్రివిక్రమ్ ఆ కథను వినోదాత్మకంగా చెబితే కొత్త దర్శకుడు శ్రీనివాస్ మామిళ్ళ ఇంచుమించు అటువంటి కథను చిన్న చిన్న ట్విస్ట్ లతో అనుక్షణం ఉత్కంఠ భరితంగా చెప్పాలని ప్రయత్నించాడు. హీరోను పోలీస్ ని చేసి ఆస్తి కోసం సంయుక్తను సొంత మనుషులు చంపాలనుకుంటే పోలీస్ అయిన ప్రేమికుడు ఎలా కాపాడాడు? అనేది  కవచం కథ. కథలో మలుపులు బావున్నాయి. అయితే అన్ని మలుపులూ ప్రేక్షకులు ఊహించే విధంగా వున్నాయి. అందువల్ల, థియేటర్లలో ప్రేక్షకులకు ఆసక్తి కొంచెం సన్నగిల్లుతుంది. దీనికి తోడు దర్శకుడికి ఇదే తొలి సినిమా కావడం వలనో ఏమో కానీ ప్రతి సన్నివేశాన్ని ఆసక్తిగా మలచడంలో విఫలమయ్యాడు. దాంతో ఓ రొటీన్ సినిమాగా  కవచం మిగిలింది. క్లైమాక్స్‌లో హీరోయిన్‌‌ని, హీరో తల్లిని ఊరు చివర ఫ్యాక్టరీలో విలన్ బంధించడం హీరోకి ఫోన్ చేయడం హీరో వచ్చి విలన్‌ని చితక్కొట్టి వాళ్లను కాపాడటం.. చివర్లో పోలీసులు రావడం ఇదంతా కొత్త దర్శకుడు ఇంకా పాతకాలంలోనే ఉండిపోయాడనిపిస్తుంది. 

ఇక టెక్నికల్ గా చూస్తే ఎస్.ఎస్. తమన్ సంగీతం అందించిన బాణీల్లో ఒక్కటీ గుర్తు పెట్టుకునే విధంగా లేదు. నేపథ్య సంగీతంలో పలు పాత సినిమాల ఛాయలు కనిపించాయి. చోటా కె. నాయుడు సినిమాటోగ్రఫీ బావుంది. ఇక నిర్మాత ఖర్చుకు వెనుకాడలేదని ప్రతి ఫ్రేములో తెలుస్తుంది. ప్రతి బెల్లంకొండ సినిమాలో లాగానే హీరో ఇంట్రడక్షన్ సాంగ్ భారీగా చిత్రీకరించారు. హీరోయిన్లతో డ్యూయెట్లనూ విదేశాల్లో అందమైన లొకేషన్లలో తీశారు. పోలీస్ ఆఫీసర్‌గా శ్రీనివాస్‌ను స్టైలిష్‌గా చూపించారు. కాజల్‌ని మరింత అందంగా చూపించారు. సినిమా రన్ టైమ్ కూడా ఎక్కువగా ఉండటంతో చోటా కె ప్రసాద్ కత్తెరకు మరింత పని చెప్పాల్సింది. అబ్బూరి రవి డైలాగ్స్ అక్కడక్కడా పేలాయి. స్క్రీన్స్ ప్లే మాత్రం గజిబిజి గందరగోళంలా ఉంది. 

చివ‌ర‌గా : బెల్లంబాబుకి దేబ్బెసిన కవచం

రేటింగ్ : 2/5

More Related Stories