English   

 కీర్తిసురేష్ @ నెం.1 ఆఫ్ కోలీవుడ్..!

Keerthy-Suresh
2018-05-23 17:18:28

ఆమె పేరులోనే కీర్తి ఉంది. ఇక కెరీర్ లో మాత్రం ఎందుకు ఉండ‌దు. ఇప్పుడు ఇదే జ‌రుగుతుంది. కీర్తిసురేష్ ఇమేజ్ రోజురోజుకీ పెరిగిపోతుంది. ఈ భామ కోసం స్టార్ హీరోలంతా క్యూ క‌డుతున్నారు. అమ్మ‌డి అదృష్టం ఏంటో కానీ ఇప్పుడు చేస్తోన్న సినిమాల‌న్నింటిలోనూ స్టార్ హీరోల‌తోనే జోడీ క‌ట్టింది ముద్దుగుమ్మ‌. 2018 మొత్తాన్ని కీర్తిసురేష్ ద‌త్త‌త తీసుకుంది. ఈ ఏడాదిలో ఏ సినిమాలో చూసినా మ‌న‌కు కీర్తి బొమ్మే క‌నిపించ‌బోతుంది. సంక్రాంతి నుంచే అమ్మాయిగారి సంద‌డి మొద‌లైంది. ఏడాది  మొద‌ట్లో అజ్ఞాత‌వాసి.. గ్యాంగ్ సినిమాల‌తో వ‌చ్చింది కీర్తి. అయితే ఈ రెండూ ఫ్లాపులే.  కానీ అస‌లు అదృష్టం మాత్రం ఇప్పుడిప్పుడే మొద‌లైంది.
 
మ‌హాన‌టితో కీర్తిసురేష్ లోని అస‌లు న‌టి బ‌య‌టికి వ‌చ్చింది. ఈ సినిమా త‌ర్వాత అమ్మ‌డి ఇమేజ్ తో పాటు గౌర‌వం కూడా పెరిగింది. ఇప్పుడు ఈ భామ త‌మిళ‌నాట టాప్ హీరోయిన్. తెలుగులో సినిమాలేవీ చేయ‌క‌పోయినా మ‌హాన‌టితో మ‌రో రెండు మూడేళ్ల పాటు ఇక్క‌డ ఢోకా లేదు. త‌మిళ్లో మాత్రం ప్ర‌స్తుతం మూడు భారీ సినిమాల్లో న‌టిస్తుంది కీర్తి. విక్ర‌మ్-హ‌రి కాంబినేష‌న్ లో తెర‌కెక్కుతున్న‌ సామి 2.. లింగుస్వామి-విశాల్ పందెంకోడి 2.. విజ‌య్-మురుగ‌దాస్ సినిమాల్లో న‌టిస్తూ బిజీగా ఉంది కీర్తిసురేష్. విజ‌య్ తో గ‌తంలోనే భైర‌వా సినిమా చేసింది కీర్తి. ఈ చిత్రం ఫ్లాప్. అయినా కూడా మ‌రోసారి ఈ భామ‌తోనే జోడీ క‌డుతున్నాడు ఇళ‌య ద‌ళ‌ప‌తి. ఈ మూడు గానీ హిట్టైతే త‌మిళ ఇండ‌స్ట్రీ నెంబ‌ర్ వ‌న్ హీరోయిన్ గా కీర్తిసురేష్ చక్రం తిప్ప‌డం ఖాయం. 

More Related Stories