English   

కరోనా కంటే కూడా అదే డేంజర్ అంటున్న కొరటాల శివ..

koratala siva
2020-07-16 11:27:09

కొరటాల శివ అంటే కేవలం దర్శకుడు మాత్రమే కాదు సామాజిక బాధ్యత కలిగిన వ్యక్తి కూడా. ఈయన తన సినిమాలతోనే కాదు బయట కూడా అలాగే ఉంటాడు. సమాజం కోసం పిల్లలను కూడా వద్దనుకున్న మనిషి ఈయన. సినిమాల్లో మాత్రమే నీతులు చెప్పి బయట కొందరు విచ్చలవిడిగా ఉంటారు. కానీ కొరటాల అలా కాదు. ఎప్పటికప్పుడు తనకు తోచిన వరకు అందర్నీ ఎడ్యుకేట్ చేస్తూనే ఉంటాడు ఈ దర్శకుడు. తాజాగా కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో అందరికీ ఓ విజ్ఞప్తి చేసాడు ఈయన. ముఖ్యంగా కరోనా సోకిన వాళ్లకు కొరటాల శివ చేసిన విజ్ఞప్తి వైరల్ అవుతుంది. కరోనా పాజిటివ్‌గా తేలిన వాళ్లు దాన్ని దాచిపెట్టడం చేస్తున్నారు. అలా చేయడం మరింత దారుణం అంటున్నాడు ఈయన. కరోనా పాజిటివ్‌గా తేలినవారందరికీ తన హృదయపూర్వక అభ్యర్థన అంటూ మొదలు పెట్టాడు కొరటాల.

మనం అందరం బాధ్యతయుతంగా వ్యవహరిద్దామని చెప్పాడు. కరోనా సోకిన ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని సన్నిహితులకు, ఇటీవల కలిసిన వాళ్లకు తెలియజేయాలని కోరాడు కొరటాల. అలా చేస్తే కానీ వాళ్లు కూడా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవడానికి అవకాశం ఉంటుందడి అని చెప్పుకొచ్చాడు. మనం మరింత నాగరికంగా ఉండాల్సిన సమయం ఇది అని చెప్పాడు కొరటాల. కొంతమంది వైరస్‌ సోకిన వ్యక్తులు ఆ విషయాన్ని రహస్యంగా ఉంచుతున్నారు.. ఇది వైరస్‌ కన్నా ఎక్కువగా భయంకరమైన అనుభవాన్ని కలిగిస్తుందని తెలిపాడు కొరటాల శివ. ప్రస్తుతం ఈయన చిరంజీవి హీరోగా ఆచార్య సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంలో రామ్ చరణ్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు. మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్స్ నిరంజన్ రెడ్డితో కలిసి రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్ కంపెనీపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. 

More Related Stories