English   

బాలీవుడ్ లో రీమేక్ అవుతున్న సంక్రాంతి సినిమాలు..

 krack
2021-01-18 14:02:33

సౌత్ సినిమాలు బాలీవుడ్ లో రీమేక్ కావడం ఇప్పుడు కొత్త విషయం కాదు. కొన్నేళ్లుగా మన సినిమాలను వాళ్ళు రీమేక్ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు కూడా అక్కడ జెర్సీ సినిమాను రీమేక్ చేస్తున్నారు. ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు, అల్లు అరవింద్ అక్కడ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. షాహిద్ కపూర్ హీరోగా నటిస్తున్నాడు. ఒరిజినల్ తెరకెక్కించిన గౌతమ్ తిన్ననూరి అక్కడ కూడా దర్శకుడు. దాంతో పాటు మరో రెండు మూడు సినిమాలు కూడా బాలీవుడ్లో ఇప్పుడు రీమేక్ అవుతున్నాయి. అందులో ఆర్ఎక్స్ 100 కూడా ఉంది. ఇదిలా ఉంటే ఇప్పుడు సంక్రాంతి సినిమాలు రెండు బాలీవుడ్ లో రీమేక్ అవుతున్నాయి.

ఈ పండక్కి విడుదలై మంచి విజయం సాధించిన క్రాక్.. అలాగే విజయ్ హీరోగా నటించిన మాస్టర్ సినిమాలు రెండు హిందీలో రీమేక్ అవుతున్నాయి. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా వచ్చింది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ హీరోగా వచ్చిన క్రాక్ సినిమా సంచలన విజయం సాధించింది. 5 రోజుల్లోనే దాదాపు 17 కోట్ల షేర్ వసూలు చేసింది. ఇప్పటికి రోజుకు దాదాపు 2 కోట్ల షేర్ వసూలు చేస్తుంది క్రాక్. ఈ సినిమాతో మళ్లీ ట్రాక్ ఎక్కాడు రవితేజ. ఈ సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్నట్లు అఫీషియల్గా అనౌన్స్ చేశారు దర్శక నిర్మాతలు. బాలీవుడ్ లో ప్రముఖ నిర్మాణ సంస్థ లో క్రాక్ రీమేక్ రైట్స్ కోసం పోటీ పడుతున్నాయి. అక్కడ అక్షయ్ కుమార్ ఈ సినిమా రీమేక్ లో నటించబోతున్నాడనే ప్రచారం జరుగుతోంది. రవితేజ నటించిన విక్రమార్కుడు సినిమా బాలీవుడ్ రౌడీ రాథోడ్ పేరుతో రీమేక్ చేశాడు. మరికొన్ని సౌత్ సినిమాల రీమేక్ లో కూడా అక్షయ్ కుమార్ నటించాడు.

మరోవైపు మాస్టర్ సినిమా హిందీ రీమేక్ రైట్స్ 7 స్క్రీన్ స్టూడియోస్, ఎండేమోల్ షైన్ ఇండియా, మురాద్ కేతాని సొంతం చేసుకున్నారు. లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన మాస్టర్ సినిమా 3 రోజుల్లోనే 100 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. అక్కడ విజయ్ స్థానంలో అజయ్ దేవ్ గన్.  విజయ్ సేతుపతి పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటిస్తారని ప్రచారం జరుగుతుంది. ఏదేమైనా కూడా సంక్రాంతి సినిమాలు బాలీవుడ్ కు వెళ్తుండటం శుభ సూచకమే. 

More Related Stories