English   

నైజాంలో నిజంగానే థియేటర్ల సమస్య అంతగా ఉందా..

Krack
2021-01-16 17:21:29

తెలుగు ఇండస్ట్రీలో ఉన్న అగ్ర నిర్మాతల్లో దిల్ రాజు కూడా ఉంటాడు. ఏడాదికి కనీసం మూడు నాలుగు సినిమాలు విడుదల చేస్తూ ఈయన సంచలనం సృష్టిస్తున్నాడు. ప్రస్తుతం శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో ఆరు సినిమాలు నిర్మాణంలో ఉన్నాయి. దీన్నిబట్టి దిల్ రాజు ప్లానింగ్ ఎలా ఉంది అనేది అర్థం చేసుకోవచ్చు. కేవలం నిర్మాతగానే కాకుండా డిస్ట్రిబ్యూటర్ గా కూడా దిల్ రాజు సత్తా చూపిస్తున్నాడు. చాలా సినిమాలు ఆయన నైజంలో డిస్ట్రిబ్యూట్ చేస్తుంటాడు. ఒక్కమాటలో చెప్పాలంటే తెలంగాణలో ఈయనను కాదని మరొకరికి సినిమా ఇవ్వడానికి నిర్మాతలు ఆలోచిస్తారు అంటే రాజుగారి హవా నైజాంలో ఎలా ఉందో అర్థమైపోతుంది. అయితే ఇప్పుడు దిల్ రాజు పై కొందరు ఆరోపణలు చేస్తున్నారు. థియేటర్ల ఇవ్వకుండా మంచి సినిమాలను చంపేస్తున్నాడు అంటూ ఆయనతో పాటు సహ నిర్మాత శిరీష్ రెడ్డిపై కూడా కొందరు సంచలన ఆరోపణలు చేస్తున్నారు.

నైజాంలో ఇప్పుడిప్పుడే డిస్ట్రిబ్యూటర్ గా ఎదుగుతున్న శ్రీను ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి మరీ మరి దిల్ రాజుపై సంచలన కామెంట్స్ చేశాడు. కబాలి, గద్దలకొండ గణేష్, డిస్కో రాజా లాంటి సినిమాలు నైజాంలో డిస్ట్రిబ్యూట్ చేసిన శ్రీను.. ఇప్పుడు క్రాక్ సినిమాను కొన్నాడు. సినిమా బాగా ఆడుతున్నా కూడా తన థియేటర్లు తీసేసి డబ్బింగ్ సినిమా అయినా మాస్టర్ వేశారు అంటూ ఆయన ప్రెస్ మీట్ పెట్టాడు. నైజాంలో దిల్ రాజు కాకుండా మరొకరు సినిమా తీసుకుంటే వాళ్ల ముందు వంగి దండాలు పెట్టాలని.. కాల్ మొక్కుత బాంచన్ అంటూ వాళ్ల కాళ్ల దగ్గర పడాలని.. అప్పుడు మాత్రమే థియేటర్లు సరిగ్గా ఇస్తారు అంటూ సంచలన ఆరోపణలు చేశాడు. కోట్ల రూపాయలు పెట్టి తాము సినిమాలను కొన్నా కూడా సరైన థియేటర్లు లేక నష్టపోతున్నామని మీడియా ముందుకు వచ్చాడు డిస్ట్రిబ్యూటర్ శీను.

అద్భుతమైన రెవెన్యూ తీసుకొస్తున్న క్రాక్ సినిమాను తీసేసి మాస్టర్ లాంటి డబ్బింగ్ సినిమాలు చేయాల్సిన అవసరం ఏముంది అంటూ ఆయన ప్రశ్నిస్తున్నాడు. ఈ విషయంలో దిల్ రాజు కూడా కలగజేసుకొని అన్ని సెటిల్ అయిపోయాయి అంటూ చెప్పుకొచ్చాడు. అయినా కూడా తెలంగాణలో థియేటర్ల సమస్య చాలా ఉందని.. ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ చేయాలి అంటే థియేటర్ల కోసం దిల్ రాజు కాళ్లు పట్టుకోవాల్సి ఉంది అంటూ శ్రీను ఆరోపించాడు. అయితే ఈయన ఆరోపణల్లో నిజం లేదని కొందరు డిస్ట్రిబ్యూటర్లు కొట్టి పారేస్తున్నారు. మాస్టర్ సినిమా తెలుగులో విడుదల చేసిన మహేష్ కోనేరు ఈ డిస్ట్రిబ్యూటర్ మాటలను ఖండించాడు. అలాంటిదేం లేదని పండగ సీజన్లో థియేటర్ లో అందరూ పంచుకోవాల్సిన అవసరం ఉంటుంది అంటూ గుర్తు చేశాడు. మరి ఈ వివాదం ఇంకా ఎంత దూరం వెళుతుందో చూడాలి. 

More Related Stories