English   

గ్లామర్‌ వేరు.. ఎక్స్‌పోజింగ్‌ వేరు..! 

Lavanya-Tripathi-Interview
2017-04-17 05:19:46

సినిమా సినిమాకు వైవిధ్యమైన పాత్రలు ఎంచుకుంటూ ముందుకెళ్తుంది డెహ్రాడూన్‌ బ్యూటీ, సొట్టబుగ్గల సుందరి లావణ్యా త్రిపాఠి. తాజాగా ఆమె నటించిన 'మిస్టర్‌'లో చంద్రముఖిగా ఆకట్టుకుంది. వరుణ్‌తేజ్‌ కథానాయకుడిగా శ్రీనువైట్ల దర్శకత్వం వహించిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. సినిమా గురించి, ఇతర విశేషాల గురించి లావణ్య ఇలా చెప్పుకొచ్చింది. శ్రీను వైట్ల నాకు క్యారెక్టర్ల గురించి చెప్పారు. అందులో ఏది నచ్చితే అది ఎంచుకోమన్నారు. చంద్రముఖి పాత్ర నాకు బాగా నచ్చింది. జాతకాల పిచ్చితో తన తండ్రి 12 ఏళ్ల పాటు ఒకే గదిలో బంధించి ఉంచడం, బయటి ప్రపంచం ఏమీ తెలియని ఆ అమ్మాయి పాత్ర కొత్తగా అనిపించింది. చెయ్యడానికి సవాల్‌గా అనిపించింది. రాయల వంశీయుల పాత్ర కావడంతో ఆ పాత్రకు తగ్గట్టు చాలా విషయాలు తెలుసుకున్నా. అవన్నీ క్యారెక్టర్‌ పండటానికి ఉపయోగపడ్డాయి. కాస్ట్యూమ్స్‌ కూడా చాలా సంప్రదాయంగా రూప వైట్ల డిజైన్‌ చేశారు. నా పాత్రకు స్పందన బావుంది. 

మేలో రెండు సినిమాలు.. 

ప్రస్తుతం 'రాధా', నాగచైతన్య సినిమాలో నటిస్తున్నా. తమిళంలో 'మాయవన్‌' కూడా రిలీజ్‌కి సిద్ధంగా ఉంది. మే నెలలో రాధా, మాయవన్‌ విడుదలవుతాయి. ప్రజెంట్‌ నా దృష్టంతా తెలుగు పరిశ్రమ మీదే. ఒకేసారి రెండు పడవల మీద అడుగువేయడం నాకు ఇష్టంలేదు. హిందీ సినిమాల వైపు వెళ్లే ఆలోచన లేదు. ఇక్కడ హ్యాపీగా ఉన్నా. తెలుగులో కూడా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తున్నా. ఇప్పటి వరకు చేసిన చిత్రాలన్నీ రొటీన్‌గా భిన్నంగానే చేశా. ఇకపై కూడా అలాగే చేస్తా. 

ఆ ఇద్దరికీ కామన్‌ క్వాలిటీ.. 

సోగ్గాడే'లో నాగార్జునగారికి భార్యగా నటించాను. ఇప్పుడు నాగచైతన్య సరసన నటిస్తున్న. ఇద్దరిలో నటించే అవకాశం దక్కడం ఆనందంగా ఉంది. ఇద్దరి వర్కింగ్‌, యాక్టింగ్‌ స్టైల్‌ వేరుగా ఉంటుంది. ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం అన్నది వారిద్దరి మధ్య ఉన్న మంచి గుణం. 

ఇల్లు కొంటా.. 

త్వరలో హైదరాబాద్‌లో ఇల్లు కొనుక్కోవాలనుంది. ఇది నా ఐడియా కాదు. నా స్నేహితురాలు రాశీఖన్నా ఐడియా. తనే త్వరగా ఇల్లు కొనమని పట్టుబడుతోంది. అయితే నా ఇల్లు ఎలా ఉడాలనుకుంటున్నానో నాకో ఐడియా ఉంది. నా అభిరుచికి తగ్గ ఇంటి కోసం చూస్తున్నా. టైమ్‌ వచ్చినప్పుడు అదే జరుగుతుందని చూస్తున్నా. 
స్కిన్‌ షో అంటే గ్లామర్‌ కాదు 

నా దృష్టిలో బాడీ కనబడే దుస్తులు వేసుకుని యాక్ట్‌ చేస్తే దానిని గ్లామర్‌ క్యారెక్టర్‌ అనరు. గ్లామర్‌ వేరు. ఎక్స్‌పోజింగ్‌ వేరు. ఒకప్పుడు మా సీనియర్‌ హీరోయిన్లు ముఖంలో నటన, కళ్లతో అభినయాన్ని, భావోద్వేగాలను పలికించేవారు. అది అసలు గ్లామర్‌ అంటే. స్కిన్‌ షో చేస్తే అది గ్లామర్‌ కాదు. 

More Related Stories