English   

అజ్ఞాత‌వాసి రివ్యూ రేటింగ్

Agnyaathavaasi- review

అజ్ఞాత‌వాసి.. ఇప్పుడు ఎక్క‌డ విన్నా ఈ సినిమా పేరే. ప‌వ‌న్ అభిమానులు ఈ సినిమా ఫీవ‌ర్ లోనే ఉన్నారు. దానికితోడు త్రివిక్ర‌మ్.. ప‌వ‌న్ కాంబినేష‌న్ లో వ‌చ్చిన మూడో సినిమా కావ‌డంతో అంచ‌నాలు మ‌రీ తారాస్థాయికి వెళ్లిపోయాయి. మ‌రి ఈ చిత్రం నిజంగానే అంచ‌నాలు నిల‌బెట్టిందా..? 

క‌థ‌:  గోవింద భార్గ‌వ ఎకా విందా (బోమ‌న్ ఇరానీ) వేల కోట్ల‌కు వార‌సుడు. ఆయ‌న్ని ఆస్తి కోసం చంపేస్తారు. దాంతో ఆయ‌న్ని చంపిన వాళ్ల‌ను చంప‌డానికి ఆయ‌న వార‌సుడు అభిషిక్త్ భార్గవ్(ప‌వ‌న్ క‌ళ్యాణ్) రంగంలోకి దింపుతుంది వింధా రెండో భార్య‌(ఖుష్బూ). వ‌చ్చీ రాగానే త‌న కంపెనీలో తాను ఎంప్లాయ్ గా చేర‌తాడు. అప్ప‌ట్నుంచీ వ‌ర్మ‌, శ‌ర్మ‌(ముర‌ళీ శ‌ర్మ‌, రావుర‌మేష్) ల‌తో ఆడుకుంటాడు. ఆ త‌ర్వాత తండ్రిని చంపింది వాళ్లు కాద‌ని తెలుసుకుంటాడు. అస‌లు మ‌నిషి మ‌రొక‌రు అని తెలుస్తుంది. అత‌డే సీతారాం(ఆది పినిశెట్టి). అస‌లు ఎందుకు చంపారు..? అభి వ‌చ్చి ఎలా ప‌గ తీర్చుకున్నాడు అనేది అస‌లు క‌థ‌.

క‌థ‌నం:  అజ్ఞాత‌వాసి.. ఇప్పుడు ఈ పేరు ప‌వ‌న్ అభిమానుల‌కు తార‌క‌మంత్రం. ఆయ‌న 25వ సినిమా కావ‌డంతో అంచ‌నాలింకా పెరిగాయి. దానికి త‌గ్గ‌ట్లే అజ్ఞాత‌వాసి విడుద‌లైన తీరు కూడా ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ఓ యాక్సిడెంట్.. మ‌ర్డ‌ర్ తో సినిమాను మొద‌లుపెట్టి ఆస‌క్తి రేకెత్తించాడు త్రివిక్ర‌మ్. కానీ ఆ త‌ర్వాత అదే టెంపో కొన‌సాగించ‌లేకపోయాడు. ప‌వ‌న్ ఎంట్రీ కోసమే ఓ ఫైట్ పెట్టాడు. ఆ ఫైట్ ఎందుకు పెట్టాడో అడ‌గొద్దు.. ఎందుకంటే హీరో కోసం ఓ ఫైట్ కావాలి. ఆ త‌ర్వాత క‌థ‌లోకి వ‌చ్చిన త‌ర్వాత వేగం ఉండ‌దు. ఎందుకు వ‌స్తున్నాయో అర్థం కాని సీన్స్ అన్నీ ఇబ్బంది పెడుతుంటాయి. హీరోయిన్ల‌ను కేవ‌లం మ‌ధ్య‌లో పాట‌ల కోస‌మే తీసుకున్న‌ట్లు అనిపించింది. అను ఎమ్మాన్యువ‌ల్ తో వ‌చ్చే ల‌వ్ ట్రాక్.. కీర్తిసురేష్ ల‌వ్ ట్రాక్ రిపీటెడ్ మోడ్ లో అనిపిస్తుంటాయి. అవి మెప్పించ‌క‌పోగా ప్రేక్ష‌కుల స‌హ‌నానికి ప‌రీక్ష పెడ‌తాయి. ఇంట‌ర్వెల్ బ్లాక్ లో వ‌చ్చే సీన్ ఒక్క‌టే కాస్త ప‌ర్లేద‌నిపిస్తుంది. సెకండాఫ్ లో కూడా క‌థ నెమ్మ‌దిగానే సాగుతుంది. అస‌లు ఏం చేయాలో తెలియ‌ద‌న్న‌ట్లు ఆఫీస్ సీన్ లో సైకిల్ ఎక్కించి ప‌వ‌న్ చేసిన రౌడీఅల్లుడు స్పూఫ్ సీన్ న‌వ్వించ‌క‌పోగా చిరాకు తెప్పిస్తుంది. త్రివిక్ర‌మ్ గ‌త సినిమాల‌తో పోలిస్తే ఈ చిత్రంలో ఆ స్థాయిలో ఒళ్లు గ‌గ్గురుపొడిచే స‌న్నివేశాలు ఒక్క‌టి కూడా తార‌స‌ప‌డ‌వు. అత్తారింటికి దారేది లాంటి సింపుల్ క‌థ‌ను అంత అందంగా చూపించిన త్రివిక్ర‌మ్.. ఈసారి మాత్రం అదే మ్యాజిక్ చేయ‌లేక‌పోయాడు. అస‌లు ఈ చిత్రం తెర‌కెక్కించింది త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాసా అనే అనుమానం రాక మాన‌దు. అది ప‌వ‌న్ లోప‌మా.. లేదంటే త్రివిక్ర‌మ్ మెప్పించ‌లేక‌పోయాడా అనేది వాళ్లిద్ద‌రికే తెలియాలి. కానీ కాంబినేష‌న్ పై అంచ‌నాలు పెట్టుకుని వెళ్లిన అభిమానుల‌కు మాత్రం అజ్ఞాత‌వాసి కోలుకోలేని షాక్ ఇచ్చాడు.

నటీన‌టులు: ప‌వ‌న్ క‌ళ్యాణ్ బాగా చేసాడు అని చెప్ప‌డం బాగుండ‌దు. పాతిక సినిమాల త‌ర్వాత న‌టుడిగా ఆయ‌న నిరూపించుకోవాల్సిందేమీ లేదు. కాక‌పోతే ఈ చిత్రంలో చిన్న‌పిల్లాడిలా మాట్లాడే సీన్స్ మాత్రం మ‌రీ ఎక్కువైపోయి.. కాస్త అతి అనిపిస్తుంది. ఇక హీరోయిన్లు కేవ‌లం పాట‌ల కోస‌మే వ‌చ్చారు. మ‌రీ ముఖ్యంగా అను ఎమ్మాన్యువ‌ల్ అయితే కేవ‌లం అందాల ఆర‌బోత‌కే ప‌రిమిత‌మైంది. ఇక కీర్తిసురేష్ ఓకే. ముర‌ళిశ‌ర్మ‌, రావుర‌మేష్ న‌వ్వించారు. వాళ్లే ఈ సినిమాకు పెద్ద రిలీఫ్. బోమ‌న్ ఇరాని చిన్న పాత్రైనా త‌న వంతు పోషించాడు. ఖుష్బూ, ఆది బాగా చేసారు. వాళ్ల పాత్రల నిడివి చాలా చిన్న‌ది. మిగిలిన వాళ్లంతా ఓకే.

టెక్నిక‌ల్ టీం:  ఈ చిత్రానికి అతిపెద్ద మైన‌స్ మ్యూజిక్. ప్ర‌తీసారి త్రివిక్ర‌మ్ సినిమాకు ప్రాణంగా నిలిచే సంగీతం ఈ సారి మైన‌స్ అయింది. అనిరుధ్ మంచి సంగీత ద‌ర్శ‌కుడే కానీ ఈ చిత్రానికి మాత్రం అనుకున్న స్థాయిలో మ్యూజిక్ ఇవ్వ‌లేదు. ఆర్ఆర్ ఓకే. మ‌ణికంద‌న్ సినిమాటోగ్ర‌ఫీ బాగుంది. ఎడిటింగ్ చాలా వీక్ అనిపించింది. చాలా సీన్లు బోర్ కొట్టించాయి. ఇక త్రివిక్ర‌మ్ గురించి చెప్పుకోవాలి.. ఈ చిత్రం ఎందుకో పూర్తిగా మిస్ ఫైర్ అయిపోయింది. మ‌న‌కు త్రివిక్ర‌మ్ అంటే వెంట‌నే గుర్తొచ్చేది డైలాగ్స్.. అలాంటివి చాలా లిమిటెడ్ గా ఈ చిత్రంలో ఉన్నాయి. ర‌చ‌యిత‌గా అక్క‌డ‌క్క‌డ మెప్పించిన ఈయ‌న‌.. ఎందుకో కానీ ఈ సారి ద‌ర్శ‌కుడిగా మాత్రం పూర్తిగా విఫ‌లం అయ్యాడు. 

చివ‌ర‌గా: అజ్ఞాత‌వాసి.. నిజంగానే అజ్ఞాతంలోనే ఉన్నాడేమో..

రేటింగ్ : 2.5/5

More Related Stories