English   

కేరాఫ్ సూర్య‌ రివ్యూ రేటింగ్

Care-Of-Surya-Movie-Review-Rating

సుశీంద్ర‌న్.. ఈ పేరుకు ఓ గుర్తింపు ఉంది. ఇక సందీప్ కిష‌న్ కు కూడా తెలుగులో మంచి ఇమేజ్ ఉంది. అలాంటి ఇద్ద‌రి కాంబినేష‌న్ లో సినిమా వ‌స్తుందంటే ఆస‌క్తి కూడా బాగానే ఉంటుంది. మ‌రి వాటిని ఈ జోడీ అందుకుందా..? కేరాఫ్ సూర్య ఎలా ఉన్నాడు..?

క‌థ‌ : సూర్య‌(సందీప్ కిష‌న్) ఓ కేట‌రింగ్ సెక్ష‌న్ ప‌ని చేస్తుంటాడు. సూర్య‌కు ప్రాణ‌ స్నేహితుడు మ‌హేశ్(విక్రాంత్). సూర్య‌కు తెలియ‌కుండా మ‌హేశ్ అత‌డి చెల్లిని ప్రేమిస్తుంటాడు. అన్న‌య్యకు చెప్ప‌డానికి సూర్య చెల్లి నో చెబుతుంది. అదే టైమ్ లో మ‌హేశ్ ను చంప‌డానికి సుపారీ తీసుకుంటాడు కిరాయి గూండా సాంబ‌శివుడు(హ‌రీష్ ఉత్త‌మ‌న్). దానికి ముందే త‌న చెల్లిని త‌న‌కు ఇష్టం లేకుండా ప్రేమించాడ‌ని చెప్పి.. మ‌రో కేస్ లో మ‌హేశ్ ను పోలీసుల‌కి అప్ప‌గిస్తాడు సూర్య‌. అస‌లు మ‌హేశ్ కు, సాంబ‌శివుడికి మ‌ధ్య గొడ‌వ ఎందుకు జ‌రుగుతుంది..? అత‌డెందుకు మ‌హేశ్ ను చంపాల‌నుకుంటాడు..? త‌న స్నేహితున్ని సూర్య కాపాడుకున్నాడా అనేది అస‌లు క‌థ‌.

క‌థ‌నం : నా పేరు శివ ద‌ర్శ‌కుడి నుంచి వ‌స్తున్న సినిమా అంటే అంచ‌నాలు కూడా అలాగే ఉంటాయి. ఆ చిత్రంలో సింపుల్ క‌థ‌నే త‌న అద్భుత‌మైన స్క్రీన్ ప్లేతో ప‌రుగులు పెట్టించాడు సుశీంద్ర‌న్. ఆ త‌ర్వాత ప‌ల్నాడులోనూ ఇదే చేసాడు. కానీ త‌ర్వాతే గాడి త‌ప్పాడు ఈ ద‌ర్శ‌కుడు. ఒకే ర‌క‌మైన రొటీన్ స్క్రీన్ ప్లేతో బోర్ కొట్టించేసాడు. ఇప్పుడు కేరాఫ్ సూర్య కూడా ఇదే తంతే. విశాల్ తో ప‌ల్నాడు.. జ‌య‌సూర్య.. ఇప్పుడు విడుద‌లైన కేరాఫ్ సూర్య కూడా సేమ్ పాట్ర‌న్ లో సాగాయి. క‌థ కాస్త వేరైనా.. సీన్స్ మాత్రం అవే క‌నిపిస్తుంటాయి. మ‌రీ ముఖ్యంగా కేరాఫ్ సూర్య‌లో ఇంట‌ర్వెల్ త‌ర్వాత త‌న ఫ్రెండ్ ను చంప‌డానికి తిరిగే గ్యాంగ్ కోసం హీరో వెతికే ఎపిసోడ్ అంతా నా పేరు శివ‌లో ఓ రౌడీ సాయంతో కార్తి చేసే ఇన్వెస్టిగేష‌న్ లా ఉంటుంది. 15-20 నిమిషాలు మ‌నం చూస్తున్న‌ది నా పేరు శివ సినిమానేనా అనే అనుమానం వచ్చేంత‌గా సేమ్ సీన్స్ దించేసాడు సుశీంద్ర‌న్.

స‌త్య‌, ప్ర‌వీణ్ లాంటి క‌మెడియ‌న్ల‌తో మ‌నం చూస్తున్న‌ది తెలుగు సినిమా అని ఫీల్ వ‌చ్చేలా చేయాల‌నుకున్నాడు కానీ త‌మిళ వాస‌నలు బాగానే క‌నిపించాయి క‌థ‌లో. మెహ్రీన్ తో ప‌రిచ‌యం.. ఆమెతో హీరో ల‌వ్ సీన్స్ పెద్ద‌గా ఆక‌ట్టుకోవు. వాళ్ల మ‌ధ్య కెమిస్ట్రీ కూడా గొప్ప‌గా అనిపించ‌దు. కార్తి, కాజ‌ల్ మ‌ధ్య నా పేరు శివ‌లో అద్భుతమైన సీన్స్ రాసుకున్న సుశీంద్ర‌న్.. ఇందులో మాత్రం తేలిపోయాడు. అలాగే విల‌న్ బ్యాచ్ చేసే మ‌ర్డ‌ర్ ప్లాన్స్ కూడా ఆయ‌న గ‌త సినిమాల్లో క‌నిపించిన‌వే. చిన్న మెడిక‌ల్ సీట్ కోసం సాగే ఈ మిస్ట‌రీలో చివ‌రికి క‌థ ఇది తెలిసిన త‌ర్వాత పెద్ద‌గా కిక్కివ్వ‌దు. బ‌ల‌మైన స్క్రీన్ ప్లే రైట‌ర్ గా పేరున్న సుశీంద్ర‌న్ కేరాఫ్ సూర్య విష‌యంలో మాత్రం బాగానే త‌డ‌బ‌డ్డాడు.

న‌టీన‌టులు : స‌ందీప్ కిష‌న్, విక్రాంత్, మెహ్రీన్, తుల‌సి, హ‌రీష్ ఉత్త‌మ‌న్ త‌దిత‌రులు నిర్మాత‌: చ‌క్రి చిగురుపాటి క‌థ‌, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌కుడు: సుశీంద్ర‌న్ సూర్య‌గా సందీప్ కిష‌న్ బాగానే చేసాడు. కానీ ఇంకా అత‌డు పూర్తిస్థాయి న‌టుడిగా మారాల్సిన అవ‌స‌రం ఉందేమో..! హీరో స్నేహితుడిగా విక్రాంత్ ప‌ర్లేదు. స‌త్య త‌న పాత్ర వ‌ర‌కు మెప్పించాడు. మెహ్రీన్ పాత్ర చిన్న‌దే. పాట‌ల‌కు, కొన్ని సీన్ల‌కు మాత్ర‌మే ప‌రిమిత‌మైంది. ధ‌న్ రాజ్, ప్ర‌వీణ్ పాత్ర‌లు ఎందుకొస్తాయో అర్థం కాదు. తుల‌సి ఉన్నంత‌లో బెట‌ర్. కానీ త‌మిళ త‌ల్లి కావ‌డంతో అతి అనిపించింది. విల‌న్ గా హ‌రీష్ ఉత్త‌మ‌న్ బాగా చేసాడు.

టెక్నిక‌ల్ టీం : సినిమాటోగ్ర‌ఫీ పెద్ద‌గా వ‌ర్క‌వుట్ అవ్వ‌లేదు. అత‌డికి ప‌ని కూడా లేదేమో అనిపించింది. సేమ్ లొకేష‌న్స్ మ‌ళ్లీ మ‌ళ్లీ క‌నిపించ‌డంతో అత‌డి పనితీరు పెద్ద‌గా ఎలివేట్ కాలేదు. రెండు గంట‌ల సినిమానే అయినా కూడా కేరాఫ్ సూర్య అక్క‌డ‌క్క‌డా బోర్ కొట్టిస్తాడు. ఇక సంగీత ద‌ర్శ‌కుడు డి ఇమ్మాన్ ప‌ర్లేదు. ఆయ‌న నుంచి ఓ డ‌బ్బింగ్ సినిమాకు ఇంత‌కంటే ఆశించ‌డం అత్యాశే. ద‌ర్శ‌కుడు సుశీంద్ర‌న్ మాత్రం చాలా నిరాశ‌ప‌రిచాడు. ఆయ‌న గ‌త సినిమాల‌ను దృష్టిలో పెట్టుకుని వెళ్తే క‌చ్చితంగా నిరాశ‌ప‌డటం ఖాయం. ఫ‌స్టాఫ్ వ‌ర‌కు ఎలాగోలా ఎంట‌ర్ టైన్మెంట్ తో లాక్కొచ్చినా.. కీల‌క‌మైన సెకండాఫ్ లో క‌థ ప‌ట్టు జారిపోతుంది. అక్క‌డ‌క్క‌డా రొటీన్ సీన్స్ తో బోర్ కొట్టించేసాడు ద‌ర్శ‌కుడు. ఓవ‌రాల్ గా చివ‌రికి చిన్న‌ట్విస్ట్ తో క‌థకు స్వ‌స్తి చెప్పినా.. అది అంత అట్రాక్టివ్ గా అనిపించ‌దు.

చివ‌ర‌గా : సూర్య‌పై ఇంకాస్త కేర్ తీసుకోవాల్సింది సుశీంద్ర‌న్ గారూ..

రేటింగ్ 2/5

More Related Stories