English   

ఈ రాంబాబు కొత్త‌గా ఉన్నాడు.. 

E-RamBabu-Kottaga-Unnadu

ఉంగ‌రాల రాంబాబు సినిమాపై ఇన్ని రోజులు పెద్ద‌గా అంచ‌నాలు గానీ ఆస‌క్తి గానీ క‌నిపించ‌లేదు. కానీ ఇప్పుడు విడుద‌లైన ట్రైల‌ర్ చూస్తుంటే మాత్రం ఈ చిత్రంలో ఏదో ఉంద‌నే విష‌యం అర్థ‌మ‌వుతుంది. ఇది కేవ‌లం కామెడీ సినిమా మాత్రం కాదు. క్రాంతిమాధ‌వ్ ఈ సారి కూడా ఏదో మెసేజ్ తీసుకొస్తున్నాడు. అది రైతుల ప‌క్షాన ఉండొచ్చు.. వామ‌ప‌క్షాల ప‌క్షాన ఉండొచ్చు. సెప్టెంబ‌ర్ 15న ఉంగ‌రాల రాంబాబు విడుద‌ల కానుంది. ఈ చిత్రానికి సెన్సార్ రిపోర్ట్ కూడా పాజిటివ్ గానే వ‌చ్చింది. సునీల్ కు కూడా హీరో అయిన కొత్త‌లో హిట్లు బాగానే ప‌ల‌క‌రించినా.. ఇప్పుడు మాత్రం ఆయ‌న కెరీర్ చాలా ఒడిదుడుకుల్లో ఉంది. అస‌లు సునీల్ కు ఇప్పుడు అర్జంట్ గా ఓ హిట్ వ‌స్తే గానీ కెరీర్ నిల‌బ‌డ‌లేని స్టేజ్ లో ఉన్నాడు. ఉంగ‌రాల రాంబాబు ఈ ఆశ తీరుస్తుంద‌ని న‌మ్ముతున్నాడు భీమ‌వ‌రం బుల్లోడు.

కొత్త ట్రైల‌ర్ లో అద్భుత‌మైన డైలాగులు ఉన్నాయి. కాళ్లు ప‌ట్టుకోవ‌డం తెలుసు.. క‌త్తులు ప‌ట్టుకోవ‌డం తెలుసు.. రైతులం క‌దా అని ప్ర‌కాశ్ రాజ్ చెప్పిన డైలాగ్ అదిరిపోయింది. ఇక రెండో బిడ్డ పుట్ట‌బోతుంద‌ని క‌దా అని మొద‌టి బిడ్డ‌ను ఏ త‌ల్లి చంపుకోవాల‌నుకోదంటూ మ‌రో డైలాగ్ తో ఆలోచింప‌చేసాడు క్రాంతిమాధ‌వ్. ఇందులో డ‌బ్బుండి.. జాత‌కాలు న‌మ్మే వ్య‌క్తిగా న‌టిస్తున్నాడు సునీల్. సినిమాలో కంటెంట్ చాలా స్ట్రాంగ్ గా ఉంద‌ని చెబుతున్నాడు ద‌ర్శ‌కుడు క్రాంతి. ఇది క‌చ్చితంగా హిట్ సినిమా అంటున్నాడు. మ‌ళ్లీ మ‌ళ్లీ ఇది రాని రోజు త‌ర్వాత క్రాంతిమాధ‌వ్ చేసిన చిత్రమిది. ఈ సినిమాపైనే సునీల్ కెరీర్ ఆధార‌ప‌డి ఉంది. మొత్తానికి చూడాలి మ‌రి.. ఉంగ‌రాల రాంబాబు అయినా సునీల్ జాత‌కాన్ని మార్చేస్తాడో లేదో..?

More Related Stories