అట్టహాసంగా మొదలయిన కేన్స్ చిత్రోత్సవాలు

కేన్స్ చిత్రోత్సవాలు ఎంతో అట్టహాసంగా మొదలై సందడిగా సాగుతున్నాయి. 72వ కేన్స్ చిత్రోత్సవాల్లో తొలి రోజు ‘ది డెడ్ డోన్ట్ డై’ సినిమాని ప్రదర్శించారు. ఈ సినిమాని వీక్షించడానికి ఎంతోమంది సినీ ప్రముఖులు హాజరయ్యారు. పలువురు అందాల తారలు రెడ్ కార్పెట్‌పై నడిచి కనువిందు చేశారు. ఈసారి మన దేశం నుంచి పలువురు అందాల తారలు రెడ్ కార్పెట్‌పై నడవడానికి సిద్ధమవుతున్నా ఒక్క సినిమా కూడా ప్రదర్శనకు ఎంపిక కాలేదు. ఇక మన దేశానికి చెందిన ప్రముఖ సంగీత దర్శకుడు ఎ.ఆర్.రెహమాన్ ఫ్రెంచ్ రివేరా నదీ తీర అందాల్ని ఆస్వాదిస్తున్నారు. ఆయన దర్శకత్వం వహించిన వర్చువల్ రియాలిటీ చిత్రం ‘లే మస్క్’. ఈ సినిమా ప్రచార కార్యక్రమాల్లో భాగంగా తన భార్యతో కలిసి కేన్స్ ఫెస్టివల్లో పాల్గొన్నారు రెహమాన్. ఈ చిత్రోత్సవం ఈ నెల 25 వరకు కొనసాగుతుంది. ఈ వేడుకలో తొలిరోజు ప్రముఖ పాప్ గాయని సెలీనా గోమేజ్‌తో పాటు పలువురు హాలీవుడ్ అందాల భామలు రెడ్ కార్పెట్‌పై సందడి చేశారు. ఇక మన దేశం నుంచి తమిళ దర్శకుడు విఘ్నేశ్ కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. బాలీవుడ్ భామలు ప్రియాంక చోప్రా, దీపికా పదుకునే, ఐశ్వర్యారాయ్, సోనమ్ కపూర్, కంగనారనౌత్‌లు కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో సందడి చేయనున్నారు.