మళ్ళీ చిక్కుల్లో వర్మ...నేడు పోలీసుల ముందుకు

వివాదాస్పద అమ్మరాజ్యంలో కడపబిడ్డలు సినిమాకు సంబంధించి, బాలీవుడ్ డైరెక్టర్ వర్మపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇవాళ హాజరు కావాలని వర్మకు నోటీసు ఇచ్చారు. తన ఫోటోలు, వీడియోలు మార్ఫింగ్ చేసి వర్మ ఈ చిత్రంలో వాడారని ఫిర్యాదులో పాల్ పేర్కొన్నారు. సీఎం జగన్, విపక్షనేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ తోపాటు ప్రజాశాంతి పార్టీ నేత కేఏ పాల్ పాత్రలతో ఈ సినిమా నిర్మించారు వర్మ.
అయితే ఈ సినిమాలో కేఏ పాల్ పాత్రను వర్మ కమెడియన్‌గా చిత్రీకరించడంతో.. వివాదం మరింత ముదిరింది. తన పాత్రను వ్యంగ్యంగా చిత్రీకరించడంతో పాటు ఇమేజ్ను డ్యామేజ్ చేస్తున్నాడని.. గతంలో కేఏపాల్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సినిమాలో కేఏపాల్ రాష్ట్రపతి, జాతీయనేతలు, ఇతర ప్రజాప్రతినిధులతో ఉన్న ఫోటోలను వాడుకోవడంపైనా.. కేఏ పాల్ అభ్యంతరం వ్యక్తం చేశారు. వాటిని తీసేయాలని సూచించారు. అయినా వర్మ వినకపోవడంతో పాల్ లీగల్‌గా ప్రొసీడ్ అవుతుండటంతో వారి కుటుంబసభ్యుల ఫోటోలను వాడుకునేందుకు అనుమతించాలని వర్మ పాల్‌ను అభ్యర్థించారు. అయితే ససేమిరా అన్న పాల్ తన పాత్రలు, కుటుంబసభ్యులకు సంబంధించిన చిత్రాలేవీ సినిమాలో ఉండకూడదని స్పష్టం చేశారు.
సినిమా చిత్రీకరణ పూర్తి కావడంతో, పాల్, అతని కుటుంబసభ్యులున్న చోట, వారి ముఖాలను మార్ఫింగ్ చేసి.. వర్మ పని కానిచ్చినట్లు సమాచారం. దీంతో కేఏ పాల్ తన అనుమతి లేకుండా తన ఫోటోలు, కుటుంబసభ్యుల ఫోటోలను.. చిత్రంలో వాడుకున్నారని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ ముఖాలను మార్ఫింగ్ చేసి, చిత్రంలో ప్రదర్శించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
దీంతో కేసు నమోదు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు.. ఉదయం విచారణకుహాజరు కావాలని వర్మకు నోటీసిచ్చారు.