English   

బాలీవుడ్ కు వెళుతున్న బన్నీ.. దర్శకుడు ఎవరో తెలుసా..

allu
2019-08-24 07:30:28

మన తెలుగు హీరోల చూపులు ఇప్పుడు హిందీ ఇండస్ట్రీ వైపు పడుతున్నాయి. ఇన్నాళ్ళు ఎవరికివారే యమునాతీరే అన్నట్లు ఉన్న మన హీరోలు బాహుబలి తర్వాత బాలీవుడ్ మార్కెట్ పై బాగానే కన్నేశారు. కాస్త ఫోకస్ చేస్తే హిందీలో కూడా మనం జెండా పాతేయొచ్చని ఇప్పుడిప్పుడే మన స్టార్ హీరోలు అర్థం చేసుకుంటున్నారు. అందుకే ఉత్తరాది ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని కథలు ఎంపిక చేసుకుంటున్నారు మన హీరోలు. ఇప్పటికే సాహో హిందీలో కూడా భారీ స్థాయిలో విడుదల కానుంది. మరోవైపు చిరంజీవి సైరా కూడా అక్టోబర్ 2న హిందీలో విడుదల కానుంది. ఇక ఇప్పుడు అల్లు అర్జున్ కూడా బాలీవుడ్ సినిమా చేయబోతున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే ఈ కుటుంబం నుంచి రామ్ చరణ్ జంజీర్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. కానీ అది డిజాస్టర్ కావడంతో రామ్ చరణ్ మళ్లీ ఉత్తరాది ప్రేక్షకులను పలకరించలేదు. ఇక ఇప్పుడు అల్లు అర్జున్ తన తొలి హిందీ సినిమా కోసం తెర వెనుక ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మధ్యే దర్శకుడు నిఖిల్ అద్వానీ ఇచ్చిన పార్టీకి హాజరయ్యాడు అల్లు అర్జున్. అందులో తన హిందీ సినిమా గురించి కూడా చర్చించుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మధ్య విడుదలై సంచలన విజయం సాధించిన బాట్ల హౌస్ దర్శకుడు ఈయన. దీనికి ముందు కూడా నిఖిల్ తెరకెక్కించిన సినిమాలు మంచి విజయం సాధించాయి. అన్నీ కుదిరితే ఈయన దర్శకత్వంలోనే అల్లు అర్జున్ హిందీ సినిమా చేస్తాడని వార్తలు వినిపిస్తున్నాయి. దానికితోడు తన మార్కెట్ పెంచుకోవాలని ఉందని.. కథ కుదిరితే హిందీలో కూడా సినిమా చేస్తానని ఈ మధ్య అనౌన్స్ చేశాడు అల్లు అర్జున్. ఇదే సమయంలో నిఖిల్ అద్వానీతో పార్టీ అనుమానాలకు బలాన్నిస్తుంది. ప్రస్తుతం త్రివిక్రమ్ అల వైకుంఠపురములో.. సుకుమార్.. వేణు శ్రీరామ్ ఐకాన్ సినిమాలతో బిజీగా ఉన్నాడు అల్లు అర్జున్. ఇవి పూర్తయిన తర్వాత బాలీవుడ్ సినిమాపై దృష్టి పెట్టనున్నాడు.

More Related Stories