బాహుబలి కంటే ఎక్కువగా కష్టపడ్డా... రానా కామెంట్స్

సినిమా వాసనలున్న ఫ్యామిలీ నుండి వచ్చినా రానా తనదైన మార్క్ వేసుకున్నాడు. చేసింది చాలా తక్కువ సినిమాలే అయినా ఎప్పుడూ విభిన్నమైన కథలతో ప్రేక్షకులను పలకరించే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ఆయన ప్రభు సోలమన్ దర్శకత్వంలో హాథీ మేరే సాథీ అనే సినిమా చేస్తున్నాడు. తెలుగులో ‘అరణ్య’, తమిళ్లో కదన్ పేరుతో రిలీజ్ కానుంది. అరణ్య సినిమాలో రానా బందేవ్ అనే పాత్రలో కనిపించనున్నాడు. ఏనుగులకి శిక్షణ ఇచ్చే వాడి పాత్రలో ఆయన కనిపించనున్నాడు. ఈ సినిమా 2020 ఏప్రిల్ 2న విడుదల కావలసి ఉన్నా, ఈ లాక్డౌన్ వలన వాయిదా పడింది. మూడు భాషల్లో విడుదలవుతుండగా సినిమాలోని రెండు ఆసక్తికర పాత్రల్ని శ్రియా పిల్‌గా వోంకర్, జోయా హుస్సేన్ చేస్తున్నారు.
అయితే ఈ సినిమా నుండి రానా ఫస్ట్ లుక్ బయటకు వచ్చిన నాటి నుండి రానా గురించి చర్చ మొదలయింది. ఆ పాత్ర కోసం ఆయన చాలా కఠినమైన ఆహార నియమాల్ని పాటించడమే కాకుండా, కఠోర శ్రమతో 30 కిలోల బరువు తగ్గారని అంటున్నారు. అస్సాంలోని కజిరంగా ప్రాంతంలో ఉన్న ఏనుగుల ఆవాసాన్ని మనుషులు అక్రమంగా కబ్జా చేసిన ఘటనను ఆధారంగా చేసుకొని ఈ చిత్రాన్ని దర్శకుడు ప్రభు సాల్మన్ రూపొందించారు. ఈ సినిమాకి సంబంధించిన ఆసక్తికర అంశాలని రానా బయటపెట్టారు. అడవులలో ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డామని ఇప్పటి వరకు చేసిన సినిమాల కన్నా ఈ మూవీ కోసం చాలా కష్టపడ్డానని రానా చెప్పుకొచ్చారు. నా భుజాలపై ఏనుగు తొండాన్ని మోయాల్సి వచ్చేదని బాహుబలిలో పడిన కష్టం కంటే అరణ్యలో నటించడం చాలా కష్టంగా అనిపించిందని రానా చెప్పుకొచ్చాడు.