English   

నిర్మాతలకు శుభవార్త చెప్పిన జాతీయ సెన్సార్ బోర్డ్..

censor
2020-05-14 20:06:44

క‌రోనా ప్రభావం సినిమాలపై ఎంత దారుణంగా పడిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిర్మాతలను చూస్తుంటేనే అర్థమైపోతుంది. ఇక సినిమా కార్మికుల బతుకులు విఛ్ఛిన్నం అవుతున్నాయి. అంతగా అల్లాడిపోతున్నారు ఈ మ‌హ‌మ్మారి ప్రభావంతో. ఇదిలా ఉంటే ఇప్పుడు అన్ని ఇండస్ట్రీలలో పదుల సంఖ్యలో సినిమాలు కరోనా కారణంగా ఆగిపోయాయి. లాక్ డౌన్ ఎప్పుడెప్పుడు తీసేస్తారా అని కళ్ళలో ఒత్తులేసుకుని చూస్తున్నారు నిర్మాతలు. ఒకవేళ లాక్ డౌన్ ఎత్తేసినా కూడా విడుదలకు నోచుకోకుండా ఉండిపోయిన సినిమాలకు సెన్సార్ కూడా పూర్తి చేయాలి. అవన్నీ క్యూ కడితే ఒక్కో సినిమాకు ఎంత టైమ్ పడుతుందో కూడా తెలియదు. అలాంటి నిర్మాతలకు ఇప్పుడు జాతీయ‌ సెన్సార్ బోర్డ్ గుడ్ న్యూస్ చెప్పింది.

ఇకపై సినిమాలను ఆన్‌లైన్‌లోనే సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్తి చేసి ఓటీటీ విడుద‌ల చేసేందుకు అవ‌కాశం క‌ల్పించ‌నున్న‌ట్టు వాళ్లు తెలిపారు. దాంతో నిర్మాతలు ఎగిరి గంతేస్తున్నారు. ఇదివ‌ర‌కు సెన్సార్ జ‌రి‌గిన‌ప్పుడు నిర్మాత సెన్సార్ బోర్డు ముందు హాజ‌రు కావాల్సి ఉండేది. వాళ్లు తీసిన సినిమాను దగ్గరుండి చూసి అందులో అభ్యంతరకర సన్నివేశాలు ఉంటే తొలగించమని చెప్పేవాళ్లు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని కొన్ని మార్పులు చేస్తున్నారు సెన్సార్ బోర్డ్ సభ్యులు. నిర్మాత సౌల‌భ్యాన్ని బ‌ట్టి.. సినిమా ఎక్క‌డ ప్ర‌ద‌ర్శించినా స‌రే సెన్సార్ బోర్డు వ‌చ్చి సినిమా చూసి వెళ్తుంది. సినిమా చూసిన త‌ర్వాత సెన్సార్ బోర్డ్ ఈ మెయిల్ ద్వారా సెన్సార్ స‌ర్టిఫికెట్ జారీ చేస్తుంది. హార్డ్ డిస్క్‌.. క్యూబ్ రూపంలో సినిమా పంపినా కూడా సెన్సార్ బోర్డు చూసి స‌ర్టిఫికేట్ ఇస్తుంది. హైద‌రాబాద్‌లో కూడా ఇకపై వచ్చే సినిమాలన్నీ ఇలాగే సెన్సార్ చేయాలని చూస్తున్నారు. దాంతో నిర్మాతలకు సగానికి సగం భారం తగ్గిపోయినట్లే.

 

More Related Stories