చాణక్య సినిమా ప్రివ్యూ.. గోపీచంద్ కెరీర్ కు కీలకం..

గోపీచంద్ టైమ్ ఈ మధ్య అసలు బాలేదు. లౌక్యం తర్వాత ఇప్పటి వరకు ఈయన సినిమా ఒక్కటి కూడా ఆడలేదు. వచ్చిన సినిమా వచ్చినట్లే చాప చుట్టేస్తుంటే పాపం గోపీచంద్ కు ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు. 25వ సినిమా పంతం సైతం ఫ్లాప్ అయింది. టాక్ బాగానే వచ్చినా కూడా ఈ చిత్రం నిలబడేలేకపోయింది. ఇక ఇప్పుడు మరోసారి కొత్తగా ప్రయత్నిస్తున్నాడు ఈయన. పూర్తిగా జోనర్ మార్చి చాణక్య అంటూ స్పై థ్రిల్లర్ చేస్తున్నాడు గోపీచంద్. ఈ సినిమా మరికొన్ని గంటల్లో విడుదల కానుంది. తిరు ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. తమిళంలో వేటాడు వెంటాడు, ఇంద్రుడు లాంటి సస్పెన్స్ థ్రిల్లర్స్ చేసిన తిరుతో ఇప్పుడు చాణక్య సినిమా చేసాడు గోపీచంద్. ఈ స్పై థ్రిల్లర్ కోసం ఇండో పాకిస్థాన్ బోర్డర్ లోనే ఎక్కువ రోజులు షూటింగ్ చేసాడు గోపీ. ఆ మధ్య ఈయనకు యాక్సిడెంట్ కూడా అయింది. అందుకే ఆగస్ట్ లో రావాల్సిన సినిమా దసరాకు వస్తుంది. సెన్సార్ టాక్ కూడా బాగానే రావడంతో సినిమాపై నమ్మకంగా కనిపిస్తున్నాడు గోపీచంద్. ఇండో పాక్ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తుందని నమ్మకంగా చెబుతున్నాడు ఈ యాక్షన్ హీరో. మరి చూడాలిక.. ఏం జరగబోతుందో..?