చాణక్య టీజర్ విడుదల.. గోపీచంద్ సాహసం అదిరింది..

గోపీచంద్ టైమ్ ఈ మధ్య అసలు బాలేదు. లౌక్యం తర్వాత ఇప్పటి వరకు ఈయన సినిమా ఒక్కటి కూడా ఆడలేదు. వచ్చిన సినిమా వచ్చినట్లే చాప చుట్టేస్తుంటే పాపం గోపీచంద్ కు ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు. 25వ సినిమా పంతం సైతం ఫ్లాప్ అయింది. టాక్ బాగానే వచ్చినా కూడా ఈ చిత్రం నిలబడేలేకపోయింది. ఇక ఇప్పుడు మరోసారి కొత్తగా ప్రయత్నిస్తున్నాడు ఈయన. పూర్తిగా జోనర్ మార్చి చాణక్య అనే స్పై థ్రిల్లర్ చేస్తున్నాడు గోపీచంద్. తాజాగా ఈ చిత్ర టీజర్ విడుదలైంది. తమిళ దర్శకుడు తిరు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. తమిళంలో వేటాడు వెంటాడు, ఇంద్రుడు లాంటి సస్పెన్స్ థ్రిల్లర్స్ చేసిన తిరుతో ఇప్పుడు చాణక్య సినిమా చేస్తున్నాడు గోపీచంద్.
ఈ స్పై థ్రిల్లర్ కోసం ఇండో పాకిస్థాన్ బోర్డర్ లోనే ఎక్కువ రోజులు షూటింగ్ చేసాడు గోపీ. ఈ విజువల్స్ ఇప్పుడు టీజర్ లో బాగా హైలైట్ అయ్యాయి. ఇండియన్ రా ఏజెంట్ పాకిస్తాన్ వెళ్లి అక్కడ ఏం చేసాడు అనేది అసలు కథ. లడక్ లో షూట్ చేస్తున్నపుడే భారీ యాక్సిడెంట్ అయింది. చాలా రోజుల రెస్ట్ తర్వాత ఇప్పుడు మళ్లీ షూటింగ్ మొదలు పెట్టాడు అందుకే విడుదల కూడా ఆలస్యమైంది. మొన్నటి వరకు గచ్చిబౌలిలో మహేశ్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమా కోసం వేసిన సెట్ లో ఇప్పుడు షూటింగ్ చేసాడు గోపీచంద్. ఏం చేసినా సరే.. ఇప్పుడు ఈయనకు ఓ హిట్ అయితే కావాలి. అందుకే ఇప్పుడు తిరుతో చేస్తున్న సినిమా తనకు విజయం తీసుకొస్తుందని గట్టిగానే నమ్ముతున్నాడు గోపీచంద్. ఈ సినిమా దసరాకు విడుదల కానుంది. మరి చూడాలిక.. చాణక్య సినిమాతో గోపీ ఎలాంటి మాయ చేస్తాడో..?