జూనియర్ ఎన్టీఆర్ కోసం తెలుగుదేశం ట్రై చేస్తుందా..

అవునా.. అలా జరుగుతుందా.. అసలు తనకు రాజకీయాలంటే ఇప్పట్లో ఇష్టం లేదని.. తన దృష్టంతా ఇప్పుడు సినిమాలపైనే ఉందని చెప్పాడు కదా ఎన్టీఆర్ అనుకుంటున్నారా..? అవును.. ఇప్పటికీ ఈయన ఫోకస్ అంతా సినిమాలపైనే ఉంది. అయితే కార్యకర్తల దృష్టి మాత్రం ఎన్టీఆర్ పై పడింది. ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. ఏపీ తెలంగాణలో ఒకప్పుడు వెలిగిపోయిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఉనికి చాటుకోవడానికి కూడా వణికిపోతుంది. మొన్నటికి మొన్న ఎన్నికల్లో వైసీపీ చేతిలో దారుణంగా ఓడిపోయింది తెలుగుదేశం పార్టీ. ప్రస్తుతం తన అస్తిత్వం కూడా పోగొట్టుకొని దారుణాతి దారుణమైన పరిస్థితుల్లో పడిపోయింది తెలుగుదేశం. చంద్రబాబు నాయుడు ఎంత ప్రయత్నిస్తున్నా కూడా ఆ పార్టీని ఇంకెంతకాలం నెట్టుకొస్తాడు అంటూ రాజకీయ వర్గాల్లో వేడివేడి చర్చ నడుస్తోంది. ఇలాంటి సమయంలో తెలుగుదేశం గట్టెక్కాలంటే కచ్చితంగా ఒక బలమైన నాయకుడు కావాల్సిందే. అది జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు కాకూడదు అని అంతా ప్రశ్నిస్తున్నారు. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కూడా జూనియర్ ఎన్టీఆర్ తో మరోసారి చర్చించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
హరికృష్ణ సంవత్సరీకం కోసం జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి వచ్చాడు చంద్రబాబు. అక్కడే కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ తో చాలా సేపు ముచ్చటించిన విజువల్స్ మీడియా కంట పడ్డాయి. ఇందులో రాజకీయ పరమైన చర్చలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. మరోవైపు రాజకీయ ప్రముఖులు కూడా తెలుగుదేశం ప్రస్తుతం ఉన్న పరిస్థితి నుంచి మెరుగైన స్థితికి రావాలంటే కచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ పగ్గాలు అందుకోవాల్సిందే అంటున్నారు. ఎవరు ఎంతగా ప్రయత్నిస్తున్నా జూనియర్ ఎన్టీఆర్ మాత్రం రాజకీయాలంటే ఆసక్తి లేదు అంటున్నాడు. ప్రస్తుతం తన ఫోకస్ మొత్తం సినిమాల్లో నటించడమే అని చెబుతున్నాడు నందమూరి వారసుడు. భవిష్యత్తులో ఎప్పుడైనా తన తాత పార్టీ కోసం అవసరం పడితే వస్తానేమో అంటున్నాడు కానీ ప్రస్తుతానికి మాత్రం ఆయన రాజకీయాల వైపు అడుగులు వేయడం అనేది కలలో మాట. చంద్రబాబు నాయుడుతో పాటు ఇంకా ఎంత మంది ప్రయత్నించినా ఎన్టీఆర్ మనసు మారదు అనేది కొందరు చెబుతున్న మాట. మరి ఇలాంటి పరిస్థితుల్లో తెలుగుదేశం వైపు జూనియర్ ఎన్టీఆర్ వస్తాడా రాడా అనేది చూడాలి.