నడిరోడ్డుపై వాళ్లను ఉరితీయాలి.. షాద్‌నగర్ ఘటనపై చిరంజీవి ఆక్రోషం..

ఇప్పుడు ఎక్కడ విన్నా కూడా షాద్‌నగర్ ఘటన గురించే మాట్లాడుకుంటున్నారు. ఇంత దారుణమైన ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే కేసును ఛేదించారు పోలీసులు. దీనిపై అంతా మాట్లాడుకుంటున్నారు. మనసు కలిచివేసిన ఈ ఘటన గురించి ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి మాట్లాడారు. ఇద్దరు చెల్లెల్లు.. ఇద్దరు కూతుళ్లు ఉన్న ఇంటి నుంచి బాధ్యతతో తన ఆవేదన తెలియచేసాడు అన్నయ్య. ఈ ఘటన గురించి చిరంజీవి మాట్లాడుతూ.. గత రెండు మూడు రోజులుగా ఆడపిల్లలపై అత్యాచారాలు.. జరుగుతున్న హత్యల గురించే వింటుంటే గుండె తరుక్కుపోతుంది. నిజంగా ఈ దేశంలో ఆడపిల్లలకు ఇంకా భద్రత లేదనే భావన కలుగుతుంది. ఇలాంటి మగమృగాల మధ్య మనం తిరుగుతున్నది అనిపిస్తుంది.
మనసు కలిచివేసిన ఈ సంఘటన గురించి ఓ అన్నగా.. తండ్రిగా స్పందిస్తున్నాను. ఇలాంటి వాళ్లకు శిక్షలు కఠినంగా ఉండాలి. వాళ్లను నడిరోడ్డు మీద ఉరితీసినా తప్పు లేదు. ఇలాంటి తప్పు చేసిన వాడెవడైనా సరే చంపేయాల్సిందే. త్వరగా నేరస్థులను పట్టుకోవడం మంచిదే.. కానీ త్వరితగతిన శిక్ష పడటం కూడా అనివార్యం. దయచేసి ఆడపిల్లలందరికీ నేను చేస్తున్న రిక్వెస్ట్ ఒక్కటే.. మీ ఫోన్స్‌లో 100 స్టోర్ చేసుకోండి.. అలాగే హాక్ ఐ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఒక్క బజర్ నొక్కితే షీ టీమ్స్ వస్తాయి. పోలీసు వారి సేవలు.. వారి టెక్నాలజీలు వాడుకోండి అని తెలిపారు. ఆడవాళ్లను గౌరవించడం ప్రతీ ఒక్కరి బాధ్యత అని గుర్తు పెట్టుకోండి అంటూ ఆవేదనతో ముగించాడు మెగాస్టార్.