కరోనా కోసం సెలబ్రిటీల సేఫ్ హ్యాండ్స్ ఛాలెంజ్

కరోనా రాకుండా తీసుకునే జాగ్రత్తల్లో భాగంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ సేఫ్ హ్యాండ్స్ ఛాలెంజ్‌ను ప్రమోట్ చేస్తోంది. ఎప్పటికప్పుడు చేతులను శుభ్రంగా కడుక్కోవడం ద్వారా కరోనాకు దూరంగా ఉండొచ్చని ప్రచారం చేస్తోంది. WHO సేఫ్ హ్యాండ్స్ ఛాలెంజ్‌ను స్వీకరించిన బాలీవుడ్ భామ దీపిక పదుకొనే చేతులు శుభ్రం చేసుకుంటూ ట్విట్టర్లో వీడియో షేర్ చేశారు. ముఖానికి N 95 మాస్క్ ధరించిన దీపిక... సానిటైజర్తో చేతులను శుభ్రంగా కడుక్కుంటూ వీడియోను పోస్ట్ చేశారు. పరిశుభ్రంగా ఉండటం ద్వారా వైరస్ల బారిన పడకుండా ఉండొచ్చంటూ మెసేజ్ ఇచ్చారు.
సేఫ్ హ్యాండ్స్ ఛాలెంజ్‌ను స్వీకరించాలంటూ ప్రముఖ టెన్నిస్ ప్లేయర్ రోజర్ ఫెదరర్, క్రిస్టియానో రొనాల్డో, విరాట్ కొహ్లీను నామినేట్ చేశారు దీపిక. అటు సచిన్ టెండూల్కర్ కూడా సేఫ్ హ్యాండ్స్ ఛాలెంజ్‌లో పాల్గొన్నారు. కరోనాను కట్టడి చేయాలంటే చేతులను శుభ్రంగా ఉంచుకోవాలంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో పోస్ట్ చేశారు. 20 నుంచి 30 సెకన్ల పాటు చేతులను శుభ్రం చేసుకోవడం ద్వారా వైరస్ రాకుండా జాగ్రత్త పడవచ్చంటూ హ్యాండ్ వాష్ చేసుకుని చూపించారు సచిన్ టెండూల్కర్.