కదిలించిన మల్లేశం....లక్ష రూపాయలు విరాళం ప్రకటించిన దర్శకేంద్రుడు

వెండితెరమీద పద్మశ్రీ అవార్డు గ్రహీత, చేనేత కార్మికుల కోసం ఆసుయంత్రాన్ని కనుగొన్న చింతకింది మల్లేశం జీవితకథగా మల్లేశం సినిమా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మల్లేశం పాత్రలో పెళ్లి చూపులు ఫేమ్ ప్రియదర్శి నటించారు. సురేశ్ ప్రొడక్షన్ రిలీజ్ చేసిన ఈ సినిమాలో ప్రియదర్శి జోడిగా అనన్య నటించింది. మల్లేశం తల్లి పాత్రలో ఝాన్సీ నటించారు. రాజ్ ఆర్ సినిమాకు దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి పేరు తెచ్చుకుంటోంది. ఈ నేపధ్యంలో దర్శకేంద్రుడు కే.రాఘవేంద్రరావు మల్లేశం చిత్ర బృందాన్ని అభినందించారు. ఈ సినిమా బృందం నిన్న ఆయన్ని కలిసింది. ఈ సందర్భంగా మల్లేశం సినిమా గురించి ఆయన ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. రాఘవేంద్ర రావు మల్లేశం టీంతో దిగిన ఫోటోను ఫేస్బుక్లో పోస్ట్ చేస్తూ..’మల్లేశం సినిమా చూశాను. ఒక ప్రయోజనం ఉన్న సినిమా. చేనేత కార్మికురాలిగా తన తల్లి పడుతున్న ఆవేదనను చూసి, పెద్దగా చదువుకోకపోయినా ఆసు యంత్రాన్ని కనుక్కొని, ఆ కార్మికుల కష్టాలను కొంత మేర తగ్గించి, తన ప్రయత్నానికి గుర్తింపుగా పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్న చింతకింది మల్లేశం అభినందనీయుడు. ఆ కృషిలో భాగంగా, నావంతు సాయంగా నాలుగు ఆసు యంత్రాల కొనుగోలు నిమిత్తం లక్షరూపాయల విరాళాన్ని ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. ప్రియదర్శి, అనన్య, ఝాన్సీ ఇతర నటీనటులందరూ వారి వారి పాత్రలకు న్యాయం చేశారు. దర్శకుడు రాజ్‌కు అభినందనలు. మంచి ప్రయత్నం చేసిన మల్లేశం టీమ్ సభ్యులందరికీ శుభాకాంక్షలు.’ అని పేర్కొన్నారు