పవన్ కళ్యాణ్ కూడా చిరంజీవి దారిలోనే వెళ్తున్నాడా..

పరిస్థితులు చూస్తుంటే ఇప్పుడు ఇదే అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ కూడా అచ్చంగా అన్నయ్య చిరంజీవి దారిలోనే వెళ్తున్నారని అర్థమైపోతుంది. ఈయన ప్రస్తుతం మూడు సినిమాలు చేస్తున్నాడు. అందులో పింక్ సినిమా రీమేక్ మే 15న విడుదల కానుంది. ఈ సినిమాతో పాటు క్రిష్ దర్శకత్వంలో ఒక పీరియాడికల్ సినిమా చేస్తున్నాడు పవర్ స్టార్. ఇక్కడే ఆసక్తికరమైన విషయాలు బయటకు వస్తున్నాయి.
ఈ సినిమాలో ఆయన పాలమూరు పండుగ సాయన్న అనే పాత్రలో నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈయన గురించి ఎవరికీ పెద్దగా ఐడియా లేదు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఆయన పాత్ర ఎంచుకోవడానికి చాలా కారణాలు కనిపిస్తున్నాయి. తెలంగాణలో బాగా పేరు మోసిన ఒక రాబిన్హుడ్ తరహా బందిపోటు పాలమూరు పండుగ సాయన్న. చరిత్ర పుటలలో వెతికితే తప్ప ఆయన గురించి ప్రజలకు పెద్దగా తెలియదు. 1840 నుంచి 1885 మధ్య కాలంలో సాయన్న ఉన్నాడు. మహబూబ్ నగర్ జిల్లా నవాబ్ పేట ప్రాంతంలో పండగ సాయన్న ఉన్నాడు. అక్కడ ఆయన గురించి ఎవరిని అడిగినా కూడా కథలు కథలుగా చెబుతారు.
అప్పట్లో నైజాం దొరల పాలన సాగుతున్న సమయంలో పాలకులకు ఎదురుతిరిగి నిలబడిన పోరాట వీరుడు పాలమూరు పండుగ సాయన్న. దాంతో పాటు బ్రిటిష్ వాళ్లకు కూడా ఎదురు తిరిగాడు. దాదాపుగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఉన్న ప్రాంతంలోని పండుగ సాయన్న కూడా బతికాడు. ఈయన కూడా ఇంచుమించు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథ మాదిరే ఉంటుంది. ఈయన్ని పట్టుకోవడానికి కూడా అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు చాలా డబ్బు ఖర్చు చేశారు. చివరికి నమ్మినవారు ద్రోహం చేసి ఈయన్ను బ్రిటిష్ వాళ్లకు పట్టించారు. అలాంటి వీరుడి కథ ఇప్పుడు తెలుగు తెరపై చూపించడానికి క్రిష్ ప్రయత్నిస్తున్నాడు.
ఈ కథలో కూడా ఉయ్యాలవాడ కథలో ఉన్నట్లు చాలా వీరత్వం ఉంటుంది. అయితే ఇప్పటికే సైరా సినిమా చూసిన నేపథ్యంలో మరోసారి అలాంటి కథతోనే పవన్ కళ్యాణ్ వస్తుండటంతో ప్రేక్షకులు చూస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఈ సినిమాని దాదాపు 100 కోట్లతో నిర్మిస్తున్నాడు AM రత్నం.