కరోనా కోసం గొంతు కలిపిన మంచు మనోజ్
.jpg)
దేశంలో కరోనా వైరస్ ఉదృతి తగ్గకపోవడంతో కేంద్రం మళ్ళీ లాక్ డౌన్ పొడిగించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే తెలుగుతో పాటు చాలా భాషల్లో ఉన్న నటీనటులు తమ వంతు విరాళంతో పాటు ప్రజల్లో అవగాహన పెంచేలా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తాజాగా హీరో మంచు మనోజ్ కరోనా మీద పోరు చేస్తున్న వైద్య సిబ్బంది, పోలీసులు, రైతులు, పారిశుద్ధ్య కార్మికులు అవిశ్రాంతంగా ప్రజల కోసం పాటు పడుతున్న తీరును ప్రశంసిస్తూ.. పౌరులుగా మన బాధ్యతను గుర్తు చేస్తూ.. మనం బాగుంటామనే ఆశను ప్రకటిస్తూ 'అంతా బాగుంటంరా' అంటూ ఒక పాట పాడారు. పాట చివరలో ఆయనతో పాటు మంచు లక్ష్మి కూతురు నిర్వాణ కూడా గొంతు కలపడం విశేషం.
ఇక ఈ పాటను తెలంగాణ ఐటీ మినిస్టర్ కేటీఆర్ తన ట్విట్టర్ ద్వారా రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా "ఈ చీకటి ఇలాగే ఉండిపోదని, మళ్ళా వెలుగు వస్తుందని చెబుతూనే ఇది గొప్ప ఆత్మ స్థైర్యం ఇచ్చే గీతం" అంటూ ఆయన ప్రశంసించారు. ‘ గుండె సెదిరిపోకురా.. గూడు వదల మాకురా’ అంటూ సాగే ఈ పాట 6 నిమిషాల 11 సెకన్ల నిడివితో ఉంది. అచ్చు రాజమని సంగీత అందించిన ఈ పాటకు రాములో రాములా ఫేం కాశర్ల శ్యాం లిరిక్స్ రాశారు. అయితే మంచు మనోజ్ హీరోగా ‘ అహం బ్రహ్మాస్మి’ అనే పాన్ ఇండియా సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను ఆయన కొద్దిరోజుల క్రితమే విడుదల చేశారు. అయితే ఈ సినిమా పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న కొద్దిరోజులకే లాక్డౌన్ కారణంగా షూటింగ్‌కు విరామం ఏర్పడింది.