ఆ కేసు...రజనీకాంత్ కూడా విచారణకు రావాల్సిందే

తమిళనాడు తూత్తుకుడి కాల్పుల ఘటనలో సూపర్ రజనీకాంత్ ను కూడా విచారించాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. స్టెరిలైట్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న స్థానికులపై కాల్పులు జరపడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. దీనిపై విచారణ జరుపుతున్న రిటైర్డ్ జడ్జి కమిటీ ముందు హాజరైన సీమాన్ నిరసనలో సంఘ విద్రోహులు ఉన్నారని రజనీ చేసిన వ్యాఖ్యల్ని ప్రస్తావించారు. సంఘ విద్రోహుల గురించి రజనీకి ఉన్న సమాచారమేంటో పిలిచి విచారించాలని సీమాన్ డిమాండ్ చేశారు. తమిళనాడు తూత్తుకుడి స్టెరిలైట్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో సంఘ విద్రోహులు చొరబడ్డారని రజనీకాంత్ గతంలో చేసిన ప్రకటన గురించి విచారణ జరగాలనే డిమాండ్ వినిపిస్తోంది.
తూత్తుకుడి కాల్పులపై రిటైర్డ్ జడ్జి అరుణ జగదీశన్ ఏకసభ్య కమిటీ ముందు ఆయన విచారణకు హాజరయ్యారు. తూత్తుకుడి ఘటనలో నాన్ తమిళర్ కట్చి కార్యకర్తలపైనే ఎక్కువ కేసులు నమోదయ్యాయని, అందుకే తనను విచారణకు పిలిచారని సీమాన్ చెప్పారు. అప్పట్లో తూత్తుకుడి ఘటనపై గతంలో స్పందించిన రజనీకాంత్.. ఉద్యమంలో సంఘ విద్రోహులు చొరబడ్డారని కామెంట్ చేశారు. పోరాటంలో సంఘ విద్రోహులు చొరబడినట్టు రజనీకాంత్ ఎలా తెలుసనేది తేలాలంటున్నారు సీమాన్. ఈ వ్యవహారంలో ఇప్పటివరకు 14 విడతలుగా జరిపిన విచారణలో దాదాపు 377 మందిని కమిటీ విచారించింది.