రజనీ..కమల్..ఖైదీ.. భలే కాంబినేషన్

సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీ కాంత్ రీసెంట్ గా వచ్చిన దర్బార్ మూవీతో.. 70 ఏళ్ల వయసులోనూ తన స్టామినా ఏంటో నిరూపించుకున్నాడు. ఈ మూవీతో బాక్సాఫీసు దగ్గర రజనీ మేనియా ఏంటో మళ్లీ నిరూపించుకున్నాడు. ప్రస్తుతం శివ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు తలైవా. ఇకపోతే.. యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ కూడా 65 ఏళ్లలోనూ అరుదైన చిత్రాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. కమల్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ఇండియన్-2లో నటిస్తున్నాడు.
ఇలా వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ ఇద్దరు స్టార్స్ ఇప్పుడు ఒక కొత్త ప్రాజెక్ట్ కోసం కలవబోతున్నారని వినిపిస్తోంది. అయితే వీళ్లు చేసేది హీరోగా, మల్టీ స్టారర్ ఫిల్మ్ అనుకునేరు.. కానే కాదు. వివరాల్లోకి వెళితే.. కమల్ నిర్మాతగా.. రజనీ హీరోగా త్వరలోనే ఓ సినిమా తెరకెక్కనుందని సమాచారం. కమల్ హాసన్ కు రాజ్ కమల్ ఇంటర్నేషనల్ అనే సొంత బ్యానర్ ఉన్నసంగతి తెలిసిందే. ఈ బ్యానర్లోనే రజనీ సినిమా రూపొందనుందని కోలీవుడ్ వర్గాలంటున్నాయి.
ఇక ఈ సినిమాకు.. రీసెంట్ గా ఎవరు ఊహించని విధంగా బ్లాక్ బస్టర్ అందుకున్న కార్తీ 'ఖైదీ' చిత్ర దర్శకుడు లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తున్నట్టు టాక్. కమల్ బ్యానర్లో రజనీ హీరోగా రానున్న సినిమాకు లోకేష్ కనకరాజ్ డైరెక్ట్ చేయబోతుండడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.. ప్రస్తుతం లోకేష్.. విజయ్ తో మాస్టర్ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా తర్వాతే రజనీ మూవీ ఉండనుందని సమాచారం. ఏదేమైనా కమల్, రజనీ కలిసి పని చేస్తున్నారని తెలియడంతో.. ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.