మాట నిలుపుకున్న రామ్ చరణ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చిరు వీరాభిమాని కుటుంబానికి ఇచ్చిన మాట నిలుపుకున్నారు. మృతి చెందిన చిరు అభిమాని కుటుంబానికి పది లక్షల ఆర్ధిక సాయం అందించారు. నెల క్రితం హైదరాబాద్ సిటీ చిరంజీవి యూత్ ఫ్యాన్స్ అధ్యక్షుడు నూర్ మహమ్మద్ గుండెపోటుతో చనిపోయారు. మరణ వార్త తెలిసిన వెంటనే మెగాస్టార్ చిరంజీవి సికింద్రాబాద్ లోని నూర్ ఇంటికి స్వయంగా వెళ్లారు. నూర్ మహమ్మద్ భౌతికకాయానికి నివాళి అర్పించారు. ఆయన కుటుంబసభ్యులను ఓదార్చారు. ఆ సమయంలో విదేశాల్లో ఉన్న రామ్ చరణ్ హైదరాబాద్ రాగానే నూర్ మహమ్మద్ కుటుంబాన్ని కలుస్తానని చెప్పారు. వారికి అండగా ఉంటానని 10లక్షలు ఆర్థిక సాయం చేస్తానని చరణ్ కుటుంబ సభ్యులకి హామీ ఇచ్చారు. ఇవాళ ఉదయం నూర్ మహమ్మద్ కుటుంబసభ్యులను తన ఇంటికి పిలిపించుకున్న చరణ్ 10 లక్షల చెక్కు వారికిచ్చారు. వారితో మాట్లాడి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఇక మెగా ఫ్యాన్ గా నూర్ మహమ్మద్ చేసిన సేవలు ఎనలేనివని చరణ్ అన్నారు. నూర్ మహమ్మద్ కుటుంబసభ్యులతో దాదాపు 45 నిముషాలు గడిపారు. నూర్ మహ్మద్ ని తిరిగి తీసుకు రాలేను, కానీ మీ ఇంటికి పెద్ద కొడుకులా అండగా ఉంటానని చెప్పారు. నూర్ మహ్మద్ కుమారుడికి మంచి ఉద్యోగం కూడా ఇప్పిస్తానని, అలాగే అమ్మాయిల పెళ్లిళ్లకు సాయం చేస్తానని ఆ కుటుంబానికి భరోసా ఇచ్చారు. చరణ్ చేసిన సాయం మరువలేనిదని, ఎన్నటికీ రుణపడి ఉంటామని నూర్ మహ్మద్ కుటుంబసభ్యులు చెప్పారు.