వెంకీ తరుణ్ సినిమా అప్పుడే మొదలయ్యేది

కుర్ర దర్శకుడు తరుణ్ భాస్కర్ తో విక్టరీ వెంకటేశ్ ఓ సినిమా చేస్తున్నట్లు ఆ మధ్య వార్తలొచ్చాయి. వెంకీ హార్స్ జాకీగా ఈ సినిమాలో నటిస్తాడని కూడా ప్రచారం జరిగింది. అయితే త్వరలోనే వీరిద్దరి కాంబినేషన్లో మూవీ తెరకెక్కనుందని సమాచారం. 'పెళ్లి చూపులు' చిత్రంతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న తరుణ్ భాస్కర్ ఆ తర్వాత వచ్చిన 'ఈ నగరానికి ఏమైంది' సినిమా కూడా దగ్గుబాటి కాంపౌండ్ నుండే వచ్చింది. అప్పటి నుంచి తరుణ్ నుంచి మరో సినిమా రాలేదు. ఈలోగా నటుడిగా బిజీ అయినా, దర్శకుడిగా ఖాళీగానే ఉన్నాడు. అయితే వెంకటేశ్ తో ఒక సినిమా అనుకోవడంతో ఆ సిన్మా మీదనే ఉన్నాడు తరుణ్. కానీ వెంకీ బిజీ షెడ్యూల్ వల్ల ఈ సినిమా పట్టాలెక్కలేదు. ఇదే సమయంలో వెంకీ 'అసురన్' రీమేక్ కూడా తెరకెక్కించేందుకు ప్లాన్ చేశాడు.
ఈ దశలో తరుణ్ భాస్కర్ సినిమా ఉంటుందా, లేదా? అనే అనుమానాలు మొదలయ్యాయి. అయితే అసురన్ సినిమా అంత గొప్పగా ఆకట్టుకోడానికి ధనుష్ పెర్ఫార్మెన్స్ పండటానికి ప్రధాన కారణం వెట్రి మారన్ డైరెక్షన్. అందుకే అలాంటి విజన్ ఉన్న దర్శకుడినే రీమేక్ కోసం ఎంచుకోవాలని, లేకుంటే ప్రయత్నం బెడిసికొట్టే ప్రమాదముందని వెంకీ, సురేష్ బాబులు భావిస్తున్నారు. అందుకే ఉన్న దర్శకుల్లో ఎవరు డైరెక్ట్ చేయగలరనే విషయాన్ని కన్ఫాం చేసుకోవడానికి వారిద్దరూ రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారట. ఇది లేటయ్యే అవకాశం ఉండడంతో ఇప్పుడు వెంకటేశ్ నుంచి తరుణ్‌కి పిలుపొచ్చిందట. జనవరిలో షూటింగ్ కి వెళ్లేట్టు ప్లాన్ చేయమని చెప్పినట్టు సమాచారం.