మాస్టర్ సినిమాకు అడ్డంకులు.. అర్థం చేసుకోండి అంటున్న సెల్వమణి..

తమిళ హీరో విజయ్ ఎప్పటికప్పుడు వివాదాలు చుట్టుముడుతూనే ఉంటాయి. ఈయన సినిమాలు చేసినా చేయకపోయినా ఎప్పుడూ వార్తల్లోనే ఉంటాడు. ఈ మధ్యనే ఆయన ఇంటిపై ఐటీ రైట్ జరగడంతో మరోసారి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయిపోయాడు విజయ్. ఇదిలా ఉంటే విజయ్ నటిస్తున్న 'మాస్టర్' సినిమా షూటింగ్ లొకేషన్ లో భాజపా వర్గాలు ఆందోళన చేపట్టాయి. ఇక్కడ చిత్రీకరణ నిర్వహించరాదని పలువురు కార్యకర్తలు నిరసన తెలిపారు. నిజానికి ఈ సినిమా షూటింగ్ కోసం రోజుకు లక్ష రూపాయలకు పైగా ఖర్చు పెడుతున్నారు నిర్మాతలు. వందల మంది ఈ సినిమా కోసం రోజు కష్టపడుతున్నారు. అయితే ఐటి అధికారులు చేసిన దాడులతో ఈ సినిమా రెండు రోజుల షూటింగ్ ఆగిపోయింది. ఉన్నట్లుండి షూటింగ్ నిలిచిపోవడంతో నిర్మాతకు పెద్ద మొత్తంలో నష్టం వచ్చింది. ఇప్పుడు తిరిగి షూటింగ్ మొదలైన తర్వాత బీజేపీ వర్గాలు వచ్చి షూటింగ్ ను అడ్డుకోవడంతో నిర్మాతలకు మరింత కష్టాలు తప్పడం లేదు. దీనికి సంబంధించి తమిళ సినీ దర్శకుల సంఘం అధ్యక్షుడు ఆర్కే సెల్వమణి మీడియా ముందుకు వచ్చాడు. విజయ్ లాంటి పెద్ద హీరో సినిమాను అడ్డుకోవడం వల్ల నిర్మాతలు నష్టపోతారు.. ఆయన సినిమా షూటింగ్ నైవేలిలోని హోటల్, లాడ్జీలకు ఆదాయం తెచ్చిపెడుతుంది.
షూటింగ్ ఎక్కడ జరిగింది వల్ల స్థానికంగా కూడా కొంత మందికి ఉపాధి దక్కుతోంది. అక్కడ పది రోజులు చిత్రీకరణ జరిగినా ఆ ప్రాంతానికి కోట్లలో ఆదాయం వచ్చే అవకాశముంది. కానీ కొందరు రాజకీయ నాయకులు తమ స్వార్థం కోసం ఈ సినిమా షూటింగ్ ను కావాలని అడ్డుకుంటున్నారు.. అది మంచి పద్ధతి కాదు అంటున్నాడు సెల్వమణి. వాళ్ల రాజకీయ స్వార్థానికి అందరి ఆదాయానికి గండి పడుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. ఆందోళనలు చేయడం వల్ల వచ్చే ఉపాధి కూడా పోతుంది.. ఆ ప్రాంతానికి ఆదాయం లేకుండా పోతుంది.. అడ్డంకులు లేకుండా ఉంటే చిత్రీకరణ సజావుగా సాగేది. అందరికీ లబ్ధి చేకూరేది అంటున్నాడు సెల్వమణి. దర్బార్ సినిమా సమయంలో కూడా దర్శకుడు మురుగదాస్ ఇంటిని ముట్టడించడం మంచి పద్ధతి కాదు. లాభ నష్టాలతో కళాకారులకు ఎలాంటి సంబంధం ఉండదు. ఏదేమైనా జరుగుతున్న సంఘటనలపై తమిళనాడు ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలి అంటున్నాడు సెల్వమణి.