వినాయక్ సినిమా ఆరోజునే ఓపెనింగ్

ఎంతో మంది హీరోలకు సూపర్ హిట్ చిత్రాలను అందించిన దర్శకుడు వీవీ వినాయక్ నటుడి అవతారం ఎత్తనున్నారని కొద్ది రోజుల క్రితం ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని నిర్మాత దిల్ రాజు కూడా ధ్రువీకరించారు. హీరో అని చెప్పలేదు కానీ యాక్టర్ గా తమ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ మీద లాంచ్ చేస్తున్నామని దిల్ రాజు ప్రకటించారు. అయితే వినాయక్ సినిమాకు ముహూర్తం ఫిక్స్ అయిందని అంటున్నారు. అక్టోబర్ 9న వీవీ వినాయక్ పుట్టినరోజు, అదే రోజున ఇండస్ట్రీ పెద్దల సమక్షంలో గ్రాండ్ గా లాంచ్ చేయనున్నట్లు చెబుతున్నారు.
ఇండస్ట్రీలోని కొందరు ప్రముఖులు లాంచ్ కి హాజరై వినాయక్ కి తమ శుభాకాంక్షలు తెలియచేయనున్నారని అంటున్నారు. గతంలో శంకర్ దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసి శరభ అనే సినిమాను డైరెక్ట్ చేసిన నర్సింహరావు ఈ సినిమాకు దర్శకుడు. ఫీల్ గుడ్ ఎమోషనల్ మూవీ గా తెరకెక్కనున్న ఈ సినిమాలో వినాయక్ ఒక మిడిల్ ఏజెడ్ క్యారెక్టర్ లో కనిపించనున్నాడని అంటున్నారు. 1980 నేపథ్యంలో కథ సాగుతుందనీ, వినాయక్ వయసుకు తగ్గట్టు పాత్ర ఉంటుందని సమాచారం. ఈ పాత్ర కోసం ఆయన బరువు కూడా తగ్గుతున్నారు. ఇక ఈ ఓపెనింగ్ గురించి అధికారిక ప్రకటన్ వెలువడాల్సి ఉంది.