English   

ర‌ంగుల రాట్నం రివ్యూ రేటింగ్

Rangula- Raatnam- Review
2018-01-14 20:40:55

ఇండ‌స్ట్రీకి వ‌ర‌స విజ‌యాల‌తో దూసుకొచ్చిన హీరో రాజ్ త‌రుణ్. కానీ ఆ త‌ర్వాత అదే టెంపో కంటిన్యూ చేయ‌లేక‌పోయాడు. ఇలాంటి టైమ్ లో నాగార్జున ఈ కుర్రాడితో రంగుల రాట్నం సినిమా నిర్మించాడు. బ‌య‌టి హీరోలతో అరుదుగా సినిమాలు నిర్మించే నాగ్.. ఈ చిత్రాన్ని నిర్మించాడంటే ఏదో విష‌యం ఉండే ఉంటుంద‌నుకున్నారు ప్రేక్ష‌కులు. మ‌రి నిజంగానే రంగుల రాట్నంలో అంత విష‌యం ఉందా..? 

క‌థ‌: విష్ణు (రాజ్ తరుణ్) ఓ కంపెనీలో ఉద్యోగం చేసుకుంటూ.. తల్లి(సితార) తో కలిసి ఆనందంగా ఉంటాడు. త‌న‌కు అమ్మే(సితార‌) లోకం. విష్ణుకు ఎలాగైనా త్వ‌ర‌గా పెళ్లి చేయాల‌ని వాళ్ల అమ్మ ప్ర‌య‌త్నిస్తుంటుంది. అలాంటి స‌మ‌యంలో విష్ణు జీవితంలోకి కీర్తి(చిత్రాశుక్లా) వ‌స్తుంది. చూడ‌గానే ప్రేమ‌లో ప‌డిపోతాడు. అన్నీ కుదిరి పెళ్లికి కూడా ఓకే అనుకునే లోపు విష్ణు వాళ్ల అమ్మ చ‌నిపోతుంది. అదే స‌మ‌యంలో ప్రేమించిన కీర్తి కూడా త‌న‌ను వ‌దిలేసి వెళ్లిపోతుంది. అస‌లు అమ్మ చ‌నిపోయిన త‌ర్వాత ఏమైంది.. ఎందుకు అంత‌గా ప్రేమించిన కీర్తి విడిపోతుంది..? అనేది మిగిలిన క‌థ‌.. 

క‌థ‌నం: త‌ల్లీ కొడుకుల మ‌ధ్య సాగే సెంటిమెంట్ తో ఈ క‌థ అల్లుకుంది శ్రీ‌రంజ‌ని. త‌న మెయిన్ ప్లాట్ కూడా త‌ల్లి కొడుకుల మ‌ధ్య ప్రేమే.. ఆ త‌ర్వాతే అమ్మాయి ప్రేమ‌. ఇత‌రులు మ‌న మీద చూపించే అతిప్రేమ‌లో కూడా జాగ్ర‌త్తే ఉంటుంద‌ని ఈ చిత్రంలో చూపించింది ద‌ర్శ‌కురాలు. అమ్మ చెబితే ఓకే కానీ అమ్మాయి చెబితే మాత్రం ఆ ప్రేమ టార్చ‌ర్ లా మారుతుందని ఈ చిత్రంలో డైలాగ్ ఉంటుంది. క‌థ‌ను ఎలాంటి మ‌లుపులు లేకుండా సింపుల్ గా మొద‌లుపెట్టింది ద‌ర్శ‌కురాలు. ఆ త‌ర్వాత కూడా కామెడీపైనే ఎక్కువ‌గా ఫోక‌స్ చేసింది. అయితే అందులో చాలా వ‌ర‌కు పెద్ద‌గా వ‌ర్క‌వుట్ కాలేదు. కామెడీ సంగ‌తి ప‌క్క‌న‌బెడితే అమ్మ‌తో సెంటిమెంట్ సీన్స్ బాగానే వ‌ర్క‌వుట్ అయ్యాయి. రాజ్ త‌రుణ్, సితార మ‌ధ్య సీన్స్ బాగానే కుదిరాయి. ఇక హీరో అమ్మాయిని చూడ‌టం.. ప్రేమ‌లో ప‌డ‌టం.. ఆమె ఈవెంట్ మేనేజ‌ర్ గా ప‌ని చేస్తుంద‌ని తెలుసుకుని ఆమె కోసం ఏవేవో పార్టీలు పెట్ట‌డం.. అందులో త‌న ప్రేమ కోసం పాకులాడ‌టం.. ఇలాంటి సీన్స్ చాలా సినిమాల్లో ఇప్ప‌టికే చూసాం. రంగుల రాట్నంలో కొత్త‌గా ఇవేం క‌నిపించ‌వు. దానికితోడు క‌థ కూడా చాలా నెమ్మ‌దిగా సాగుతుంది. 

ఇంట‌ర్వెల్ కు ట్విస్ట్ ఉండాలి కాబ‌ట్టి అమ్మ కారెక్ట‌ర్ కు తెర దించేసారు. ఆ ఒక్క సీన్ మాత్రం సినిమాలో చాలా బాగా పండింది. అమ్మ చ‌నిపోయిన సీన్ లో రాజ్ త‌రుణ్ బాగా న‌టించాడు. మంచి సెంటిమెంట‌ల్ సీన్ తో ఇంట‌ర్వెల్ ప‌డినా.. సెకండాఫ్ లో మాత్రం క‌థ మ‌ళ్లీ పాత ట్రాక్ లోనే వెళ్తుంది. ప్రేమ‌ను ఒప్పుకున్న హీరోయిన్.. త‌ను ప్రేమించిన వాళ్లు ఎక్క‌డ దూర‌మైపోతారో అనే భ‌యంతో హీరోను దూరం పెట్ట‌డం అనేది అంత సాటిస్ ఫైయింగ్ గా అనిపించ‌దు. త‌ర్వాత మ‌ళ్లీ ఈజీగా క‌లిసిపోవ‌డం.. ఇలా క‌న్ఫ్యూజింగ్ గా సాగుతుంది క‌థ‌. ఇక హీరోయిన్ ప్రేమ ఒప్పుకున్న త‌ర్వాత వ‌చ్చే ఆమె అతిప్రేమ సీన్స్ అన్నీ న‌వ్వు తెప్పిస్తాయి. చివ‌రికి హీరోయిన్ చూపించే ప్రేమ‌.. అమ్మ ప్రేమ‌తో స‌మానం అని చిన్న మాంటేజ్ షాట్స్ వేసి ప్రేక్ష‌కుల‌కు జ‌డ్జిమెంట్ వ‌దిలేసింది ద‌ర్శ‌కురాలు. 

న‌టీన‌టులు: రాజ్ త‌రుణ్ అన‌గానే మ‌న‌కు ఓవ‌ర్ యాక్ష‌న్ గుర్తొస్తుంది. అవ‌స‌రం ఉన్నా లేక‌పోయినా హైప‌ర్ గా మారిపోతుంటాడు ఈ కుర్ర హీరో. కానీ ఈ సినిమాలో మాత్రం చాలా సెటిల్డ్ గా క‌నిపించాడు. ఇక చిత్రాశుక్లా సినిమా అంతా ఒక‌టే ఎక్స్ ప్రెష‌న్ క్యారీ చేసింది. హీరో త‌ల్లిగా సితార చాలా బాగా న‌టించింది. ఆమె ఉన్న సీన్స్ బాగానే వ‌ర్క‌వుట్ అయ్యాయి. హీరో ఫ్రెండ్ గా ప్రియ‌ద‌ర్శి చాలా వ‌ర‌కు న‌వ్వించాడు. ఆయ‌న సీన్స్ బాగున్నాయి. మిగిలిన వాళ్లంతా ఇలా వ‌చ్చి అలా వెళ్ళిపోయే బ్యాచ్.

టెక్నిక‌ల్ టీం: శ్రీ‌చ‌ర‌ణ్ పాకాల సంగీతం ప‌ర్లేదు. ఆర్ఆర్ కూడా బాగానే ఇచ్చాడు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింట్ బాగానే అనిపించింది. కానీ కొన్ని సీన్స్ చాలా స్లోగా వెళ్తున్న ఫీలింగ్ క‌లుగుతుంది. విజ‌య్ సినిమాటోగ్ర‌ఫీ ఓకే. ఆయ‌న‌కు ఉన్న బ‌డ్జెట్ లో చాలా చ‌క్క‌టి ఔట్ పుట్ ఇచ్చాడు. ద‌ర్శ‌కురాలు శ్రీ‌రంజ‌ని క‌థ విష‌యంలో అప్ డేట్ కాలేదు. చాలా సార్లు చెప్పిన క‌థ‌నే మ‌ళ్లీ ఎంచుకుంది. దానికి తోడు గురువు సెల్వ రాఘ‌వ‌న్ స్టైల్ ఎక్కువ‌గా క‌నిపించింది ఈ చిత్రంలో. మొత్తంగా రంగుల రాట్నం ఈమెకు డ్రీమ్ డెబ్యూ అయితే కాదు.

చివ‌ర‌గా: రంగులరాట్నం.. సీరియ‌ల్ కు ఎక్కువ‌.. సినిమాకు త‌క్కువ‌.. 

రేటింగ్ :2.5/5

More Related Stories