English   

జై సింహా రివ్యూ రేటింగ్

Jai -Simha -Review- Rating

గ‌తేడాది శాత‌క‌ర్ణితో హిట్ కొట్టిన బాల‌య్య‌.. ఈ సారి జై సింహా అంటూ వ‌చ్చాడు. పైగా టైటిల్ లో అచ్చొచ్చిన సింహం ఉంది. మ‌రి నిజంగానే ఈ సారి కూడా సింహం గ‌ర్జించిందా.. బాక్సాఫీస్ ను మెప్పించిందా..? 

క‌థ‌: న‌ర‌సింహా(బాల‌య్య‌) ఓ మెకానిక్. ఎక్క‌డ ఏ గొడ‌వ జ‌రిగినా బ‌ళ్ళ‌తో పాటు మ‌నుషులను కూడా రిపేర్ చేస్తుంటాడు. అలాంటి వాడు ఓ చిన్న గొడ‌వ‌తో ప్రేమించిన అమ్మాయి గౌరి(న‌య‌న‌తార‌)కు దూర‌మ‌వుతాడు. త‌న కొడుకుతో క‌లిసి త‌మిళ‌నాడులోని కుంభ‌కోణం వెళ్లిపోతాడు. అక్క‌డ ఆల‌య ధ‌ర్మ‌క‌ర్త ముర‌ళీకృష్ణ‌(ముర‌ళీమోహ‌న్) ఇంట్లోనే ఉంటాడు. అనుకోకుండా ఒక‌రోజు ధ‌ర్మ‌క‌ర్త కూతురు (న‌టాషా) ఓ యాక్సిడెంట్ చేసి కుంభ‌కోణంలోని దాదా క‌నియ‌ప్ప‌న్(కాల‌కేయ ప్ర‌భాక‌ర్) త‌మ్మున్ని యాక్సిడెంట్ చేస్తుంది. ఆ నేరం త‌న‌మీద వేసుకుంటాడు న‌ర‌సింహా. ఆ త‌ర్వాత అత‌డు చ‌నిపోతాడు. దాంతో న‌ర‌సింహాపై ప‌గ పెంచుకుంటాడు క‌నియ‌ప్ప‌న్. అదే టైమ్ లో త‌న కొడుకు చావుకు కార‌ణ‌మైన న‌ర‌సింహాను చంపాల‌ని ప‌గతో ర‌గిలిపోతుంటాడు మ‌రో విల‌న్(అశుతోష్ రాణా). వీళ్ళంద‌రి మ‌ధ్య‌లోకి గౌరి(న‌య‌న‌తార‌) వ‌స్తుంది. అస‌లు గౌరీకి న‌ర‌సింహాకు సంబంధం ఏంటి.. ఎందుకు అంద‌రికి న‌ర‌సింహా టార్గెట్ అవుతాడు అనేది క‌థ‌. 

క‌థ‌నం: కేఎస్ ర‌వికుమార్ సినిమా అంటే ప‌క్కా మాస్ సినిమా.. అందులో కొత్త‌ద‌నం కోసం ఏ కోశానా కూడా వెత‌క్కూడ‌దు అని అర్థం. ఇక బాల‌య్య కూడా అంతే. ఈ ఇద్ద‌రూ క‌లిస్తే వ‌చ్చే సినిమా కూడా రొటీన్ గానే ఉంటుంది. కానీ మాస్ కు న‌చ్చేలా ఉంటుంది. ఆ మాస్ ప‌వ‌ర్ నే ఈ సారి కూడా సినిమాలో చూపించాడు కేఎస్ ర‌వికుమార్. ఆయ‌న‌కు తోడుగా నిలిచాడు బాల‌య్య‌. ఈయ‌న ఇమేజ్ వాడుకుంటూ జై సింహాను ఫ్యాన్స్ కు ఫీస్ట్ ఇచ్చేలా.. సాదార‌ణ ప్రేక్ష‌కుల‌ను మెప్పించేలా చేసాడు ర‌వికుమార్. తెలిసిన క‌థ‌కు రేసీ స్క్రీన్ ప్లే జోడించి మెప్పించాడు ఈ ద‌ర్శ‌కుడు. మ‌ధ్య‌లో కామెడీ ద‌గ్గ‌ర మాత్రం త‌న అర‌వ ఫార్ములా చూపించాడు కానీ మిగిలిన అన్ని చోట్లా మాస్ తోనే నెట్టుకొచ్చాడు. రొటీన్ అని తెలిసినా కూడా ప్రేక్ష‌కుల‌కు బోర్ కొట్ట‌లేదంటే సినిమాకు అదే బ‌లం. ఫ‌స్టాఫ్ లో బ్రాహ్మ‌ణుల గురించి చెప్పే సీన్.. ఇంట‌ర్వెల్ ముందు సీన్.. ఇవ‌న్నీ బాల‌య్య ఇమేజ్ తో బాగా పేలాయి. 

ఇక జై సింహాకు బాగా అడ్డు అనిపించేది కామెడీ. బ్ర‌హ్మాంనందంతో చేయించిన కామెడీ అర‌వ వాస‌న‌లు కొట్టింది. సినిమాకు ఇదే పెద్ద బ్రేక్. సెకండాఫ్ లోనూ టెంపో ఎక్క‌డా త‌గ్గ‌లేదు. అయితే న‌య‌న‌తార‌, బాల‌య్య మ‌ధ్య ల‌వ్ సీన్స్ మాత్రం ఆక‌ట్టుకోలేదు. అందుకే ఫ‌న్నీగా సీన్స్ రాసుకున్నాడు. విల‌న్ కొడుక్కి ఎంపి కాకుండా హీరో అడ్డుప‌డ‌టం.. ఆ త‌ర్వాత అత‌డు ఉరేసుకోవ‌డం.. దాంతో హీరోపై విల‌న్ ప‌గ పెంచుకోవ‌డం.. ఇవ‌న్నీ చాలా సినిమాల్లో చూసిన సీన్లే.. కానీ వాటిని కూడా మాస్ కు రీచ్ అయ్యేలా తెర‌కెక్కించాడు కేయ‌స్ ర‌వికుమార్. క్లైమాక్స్ లో ఎమోష‌న్ కూడా బాగానే పండించాడు. అయితే మ‌రీ త్యాగాలు చేయ‌డం మాత్రం కాస్త ఓవ‌ర్ అనిపిస్తుంది. 

న‌టీన‌టులు: బాల‌య్య మ‌రోసారి బాగా చేసాడు. ఈయ‌న‌కు ఇలాంటి పాత్ర‌లు కొట్టిన పిండి. స‌మ‌ర‌సింహారెడ్డి నుంచి ఇలాంటి ఫ్లాష్ బ్యాక్ ఉన్న పాత్ర‌లు చేస్తున్నాడు బాల‌య్య‌. మ‌రోసారి అదే అజ్ఞాత‌వాసిగా న‌టించాడు. న‌య‌న‌తార ఉన్నంత‌లో బాగానే చేసింది. హ‌రిప్రియ ఓకే. న‌టాషా దోషీ పాత్ర కేవ‌లం అందాల‌కే ప‌రిమిత‌మైంది. ప్ర‌కాశ్ రాజ్ మ‌రోసారి త‌న‌కు అల‌వాటైన తండ్రి పాత్ర‌లో మెప్పించాడు. విల‌న్ గా అశుతోష్ రాణా ఓకే.. కాల‌కేయ ప్ర‌భాకర్ కూడా బాగానే చేసాడు. బ్ర‌హ్మానందం పెద్ద‌గా ఆక‌ట్టుకోలేదు.

టెక్నిక‌ల్ టీం: సంగీతం ఈ చిత్రానికి మైన‌స్ గా మారింది. శాత‌క‌ర్ణికి బాగానే మ్యూజిక్ ఇచ్చిన ఈయ‌న జై సింహాకు మాత్రం ఊహించినంత ఇవ్వ‌లేదు. అయితే జ‌జ్జ‌న‌క పాట మాత్రం ఫ్యాన్స్ కు పిచ్చెక్కించ‌డం ఖాయం. సినిమాటోగ్ర‌ఫీ ప‌ర్లేదు. 90ల్లో సినిమా చూసిన‌ట్లుగా అనిపించింది. ఇక ఎడిటింగ్ వీక్. క‌థ విష‌యంలో కేఎస్ ర‌వికుమార్ ఇంకాస్త జాగ్ర‌త్త తీసుకుని ఉంటే బాగుండేది. క‌థ‌నం వేగంగా ఉండ‌టం ఈ చిత్రానికి బ‌లం. తెలిసిన క‌థ‌నే రేసీ స్క్రీన్ ప్లే తో ప‌రుగులు పెట్టించాడు ర‌వికుమార్. ఓవ‌రాల్ గా మాస్ కు ఈ చిత్రం పండ‌గ‌. 

చివ‌ర‌గా: ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్.. ప్రేక్ష‌కుల‌కు మినీమీల్స్.. 

రేటింగ్ : 2.5/5

More Related Stories