English   

ప‌ద్మావ‌త్ ఇప్పుడొచ్చినా ఏం లాభం..?

padmavat-release

అన్నీ అనుకున్న‌ట్లు జ‌రుగుంటే ఈ పాటికి ప‌ద్మావ‌తి సినిమా వ‌చ్చి ఈ పాటికి 40 రోజులు అయ్యుండేది. కానీ తొక్కేసారు. ఇప్పుడు వ‌స్తుంది ప‌ద్మావ‌తి. ఎన్నో ఆటంకాల అనంతరం అన్ని అడ్డంకులు తొల‌గించుకుని వ‌స్తుంది ఈ చిత్రం. ఓ సినిమాపై ఇంత‌గా ప‌గ ప‌డ‌తారా..? అస‌లు మ‌నిషి ప‌గ ఇంత ప్ర‌మాద‌క‌రంగా ఉంటుందా అనిపించింది కొన్ని రోజులుగా ప‌ద్మావతి సినిమాపై జ‌రిగిన దాడి చూస్తుంటే. ఈ చిత్రం జ‌న‌వ‌రి 25న విడుద‌ల కానుంది. పద్మావతి విడుదలకు సెన్సార్‌ బోర్డు ఓకె చెప్పిన కొన్ని గంటల వ్యవధిలోనే రాజ్‌పుత్‌ కర్ణిసేన మరోసారి బెదిరింపులకు దిగింది. మీరు ఒక్క‌సారి సినిమా విడుద‌ల చేయండి.. ఆ థియేట‌ర్స్ ను త‌గ‌ల‌బెట్ట‌క‌పోతే అప్పుడు అడ‌గండి అంటున్నారు క‌ర్ణిసేన‌. ఈ సినిమాపై ఎందుకు అంత‌గా ప‌గ పెంచుకున్నారో తెలియ‌దు కానీ కోర్ట్ చెప్పినా కూడా వాళ్లు విన‌డం లేదు. విడుదల అనంతరం జరిగే ఆందోళనలకి పూర్తిగా ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించింది క‌ర్ణిసేన‌. ఈ చిత్రాల‌ను 5 మార్పుల‌తో రిలీజ్ చేసుకొమ్మ‌ని చెప్పింది కోర్ట్. 

దేశ ప్రయోజనాలకు ఇది వ్యతిరేకంగా ఉంది. దేశంలో అల్లర్లు సృష్టించేందుకు ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ సినిమా విడుదల వల్ల జరిగే ఆస్తి, ప్రాణ నష్టానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. సినిమా విడుదలైన ప్రతీ థియేటర్‌ను తగులబెడతాం. దేశంలోని హిందువుల మధ్య చిచ్చు పెట్టాలని దావూద్‌ ఇబ్రహీం సెన్సార్‌ బోర్డుపై ఒత్తిడి తీసుకొచ్చాడు.. అందుకే సినిమా విడుదలకు సెన్సార్‌ అంగీకరించింది. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ప‌ద్మావ‌తి సినిమాను విడుద‌ల కానివ్వ‌మంటూ హెచ్చ‌రిస్తున్నాడు కర్ణిసేన అధ్యక్షుడు సుఖ్‌దేవ్‌ సింగ్‌. 

రాజ్యంలో మంత్రి కొడితే వెళ్లి రాజుకు చెప్తారు.. కానీ రాజే కొడితే ఎవ‌రికి చెప్తారు..? ఇప్పుడు ప‌ద్మావ‌తి ప‌రిస్థితి ఇలాగే త‌యారైంది. ఈ చిత్రానికి ఎదుర‌వుతున్న ఇబ్బందులు చూస్తుంటే.. నిజంగా మ‌నం ఉన్న‌ది స్వ‌తంత్ర్య భార‌త‌దేశంలోనేనా..? మ‌న‌కు నిజంగానే భావస్వాతంత్ర్య హ‌క్కు ఉందా అనే అనుమానం వ‌స్తుంది. ఓ ద‌ర్శ‌కుడు ఏళ్ల‌కేళ్లు క‌ష్ట‌ప‌డి చేసిన సినిమాను అడ్డంగా ఆపేసారు. సెన్సార్ చేసినా ఇష్ట‌మొచ్చిన‌ట్లు క‌ట్లు చెప్పి.. స‌గం సినిమాను కోసేసారు. డిసెంబ‌ర్ 1 నుంచి సినిమా వాయిదా ప‌డిపోయింది. ఈ చిత్రాన్ని ఆపాలంటూ స్వ‌యంగా కొన్ని రాష్ట్రాల ముఖ్య‌మంత్రులే అడ్డు ప‌డుతుండ‌టం దారుణం.

రాణి పద్మిని దేవి జీవిత చరిత్ర ఆధారంగా తెర‌కెక్కిన ఈ చిత్రంపై రాజ్ పుత్ కర్ణి సేన నుంచి బెదిరింపులు కూడా వస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా విడుదలైతే ఉత్తర ప్రదేశ్ లో శాంతి భద్రతల  విఘాతం కలుగుతుందని సాక్షాత్తూ ఆ రాష్ట్ర హోం శాఖ కార్యదర్శి.. కేంద్రానికి లేఖ రాశారు. ఆ చిత్రంలో రాణి పద్మిని దేవిని కించపరిచేలా ఉన్న సన్నివేశాలు తొలగించేవరకు విడుదల ఆపాలని రాజస్థాన్ సీఎం వసుంధర రాజే.. కేంద్ర‌ సమాచార ప్రసారాల శాఖ మంత్రి స్మృతి ఇరానీకి లేఖ రాశారు. ఈమెతో పాటు ఇప్పుడు పంజాబ్ సిఎం అమిరీంద‌ర్ సింగ్.. మ‌ధ్య‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి శివ‌రాజ్ సింగ్ చౌహాన్.. జ‌మ్మూకాశ్మీర్, ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రులు కూడా త‌మ రాష్ట్రంలో ప‌ద్మావ‌తి విడుద‌ల ఆపేస్తున్న‌ట్లు ప్ర‌క‌ట‌న‌లు చేసి పారేసారు. మ‌రి ఇలాంటి ప‌రిస్థితుల్లో జ‌న‌వ‌రి 25న వ‌చ్చే ప‌ద్మావ‌త్ ఎంత‌వ‌ర‌కు స‌క్సెస్ కానుందో చూడాలిక‌..! 

More Related Stories