English   

పోసాని అంత కోప‌మేంట‌య్యా నీకు..?

Posani-Krishna-Murali-Fires-On-Nara-Lokesh

పోసాని కృష్ణ‌ముర‌ళి అంటేనే కోపానికి ప్ర‌తీక‌. ఈయ‌న ఎప్పుడు ఎలా ఉంటాడో ఎవ‌రికీ తెలియ‌దు. శాంతంగా క‌నిపించ‌డం చాలా అరుదు. ఏదో ఓ ఇష్యూపై సీరియ‌స్ గా స్పందిస్తూనే ఉంటాడు ఈయ‌న‌. ఇప్పుడు నంది అవార్డ్ సంపాదించిన త‌ర్వాత కూడా ఈ అవార్డులపై నోరు విప్పాడు పోసాని. గ‌తం వారం రోజులుగా రోజుకో ర‌చ్చ నంది అవార్డుల‌పై న‌డుస్తూనే ఉంది. ఇప్ప‌టికీ అస‌హ‌నం వ్య‌క్తం చేస్తూనే ఉన్నారు కొంద‌రు. ఇప్పుడు పోసాని వంతు. ఈయ‌న కూడా త‌న మ‌న‌సులో మాట‌ను బ‌య‌ట‌పెట్టాడు. కాక‌పోతే అంద‌రిలా శాంతంగా కాకుండా కాస్త కోపంగా నోరు విప్పాడు పోసాని కృష్ణ‌ముర‌ళి. ఈయ‌న తీరుకు అక్క‌డున్న వాళ్లే కాదు.. ఇండ‌స్ట్రీ పెద్ద‌ల‌కు కూడా చెమ‌ట‌లు ప‌ట్టాయి.

నంది అవార్డులు ప్ర‌క‌టించిన వారం త‌ర్వాత నారా లోకేష్ చేసిన వ్యాఖ్య‌లు తీవ్ర దుమారాన్ని రేపాయి. నంది అవార్డుల వివాదం మరింత పెద్దది అయితే అవార్డులను రద్దు చేస్తాం.. ఆంధ్ర ప్రదేశ్ లో ఆధార్, ఓటర్ కార్డులు లేనివారు నంది అవార్డులను విమర్శిస్తున్నారు.. అస‌లు అవార్డులే ఇవ్వ‌ని వాళ్ల‌ను ఎవ‌రూ ఏం అన‌ట్లేదు.. మమ్మ‌ల్ని ఎందుకు అంటున్నారు అంటూ ఏపీ మంత్రి నారా లోకేశ్‌ చేసిన వ్యాఖ్యలపై నటుడు, రచయిత, దర్శకుడు పోసాని కృష్ణమురళి తీవ్రంగా మండి ప‌డ్డారు. నారా లోకేష్ వ్యాఖ్యల వల్ల త‌మ‌ను తెలుగు రోహింగ్యాలను చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ట్యాక్స్ ఇక్కడ కడితే అక్కడ పనికిరారా.. విమర్శించకూడదా.. అడిగే హ‌క్కు లేదా.. ఆంధ్ర‌ప్రదేశ్ అంటే ఏదైనా ప‌క్క దేశంలో ఉందా..? ఎక్క‌డో ట్రంప్ త‌ప్పు చేస్తే ఇక్క‌డ కూర్చుని మ‌నం మాట్లాడ‌తాం.. మ‌రి ప‌క్క రాష్ట్రంలో త‌ప్పు జ‌రిగితే అడిగే హ‌క్కు లేదా.. అంటూ విరుచుకుప‌డ్డాడు పోసాని. నారా లోకేశ్ అస‌లు నువ్వు చదువుకున్నావా.. బుద్ది, జ్ఞానం, సంస్కారంతో మాట్లాడుతున్నావా.. అంటూ ప్ర‌శ్నించారు. మీరు ఇక్కడ ట్యాక్స్ కట్టట్లేదా..? ప్రభుత్వం వచ్చాక కూడా ఇక్కడ ఇళ్లు కట్టుకున్నారు కదా..? మరి మీరు అక్కడ రాజకీయం ఎలా చేస్తారంటూ ప్రశ్నించారు పోసాని. నాయ‌నా.. నీ లాంటి నాయకులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉండి ఉండుంటే మేం నాశనం అయ్యేవాళ్లమంటూ లోకేష్ తీరును త‌ప్పు ప‌ట్టాడు పోసాని.

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ను చూసి ఎలా మాట్లాడాలో నేర్చుకోవాల‌ని.. ఇక్క‌డున్న వాళ్ల‌ను ఆంధ్రా వెళ్లిపొమ్మంటే మ‌రో దారే లేకుండా అంతా చ‌చ్చిన‌ట్లు ఆంధ్రాకి వెళ్లిపోవాల్సిందే అని అన్నాడు పోసాని. కానీ కేసీఆర్ అలా అన‌లేద‌ని.. త‌మ యుద్ధం అంతా తెలంగాణ‌ను దోచుకునే రాజ‌కీయ నాయ‌కుల‌తోనే కానీ ప్ర‌జ‌ల‌తో కాద‌న్నాడు కేసీఆర్. ఆయ‌న తీరు చూసి చాలా అద్భుతంగా అనిపించింద‌ని.. అలాంటి నాయ‌కుడు మ‌న ద‌గ్గ‌ర ఉండ‌టం అదృష్టం అని.. ఆయ‌న ద‌గ్గ‌రికి వెళ్లి రాజ‌కీయాలు ఎలా చేయాలో.. ఎలా మాట్లాడాలో నేర్చుకో లోకేశ్ అంటూ మండి ప‌డ్డాడు. అంతే కాదు.. కేసీఆర్ కాళ్లు క‌డిగి ఆ నీళ్లు నెత్తిన చ‌ల్లుకోండి అన్నాడు పోసాని.

నంది అవార్డులు ర‌ద్దు చేస్తాం అన్న‌దానిపై కూడా విరుచుకుప‌డ్డాడు పోసాని. నంది అవార్డులు నీ అబ్బ సొమ్మా.. గత ప్రభుత్వాలను చంద్రబాబు విమర్శించలేదా..? ఇప్పుడు మీరు త‌ప్పు చేసినపుడు మాత్రం నోరు మూసుకుని కూర్చోవాలా.. ఏ అప్పుడు చంద్రబాబును ఎవరైనా నాన్‌ లోకల్‌ అన్నారా..? ఒక్క నంది అవార్డుల విష‌యంలోనే మీరు మ‌మ్మ‌ల్ని నాన్ లోక‌ల్ అంటే.. రేపు ఏదైనా పెద్ద ఇష్యూ వ‌స్తే క‌చ్చితంగా తరిమేస్తారు క‌దా.. తెలుగుదేశానికి ఓటేసిన వాళ్లు మాత్రం ఆంధ్రాలో ఉండండంటూ తీర్మాణం తెస్తావా అంటూ రెచ్చిపోయాడు పోసాని. ఏ.. మీ ఆస్తులు తెలంగాణ‌లో లేవా..? అక్క‌డ కూర్చుని ఇక్క‌డ మీరు ఆస్తులు పెంచుకోలేదా అంటూ ప్ర‌శ్నించాడు పోసాని.

విమర్శించే వాళ్లు నాన్ లోకల్ అయితే జ్యూరీలో ఉన్న సభ్యుల మాట ఏంటి.. వారికి కూడా హైదరాబాద్ లోనే ఆధార్ కార్డులు ఉన్నాయి కదా.. వారు కూడా ఇక్కడే ట్యాక్స్ లు కడుతున్నారు కదా మరి వారిని జ్యూరీలోకి ఎలా తీసుకున్నారు..? రాద్ధంతం చేస్తే నందులు తీసేస్తాం అంటున్నారు. మరి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో ఎంత రాద్ధంతం జరిగింది మరి వారిని ఎందుకు తీసేయలేదు..? గ‌తంలో భారతరత్న.. పద్మ అవార్డుల విషయంలో కూడా చాలా సార్లు విమర్శలు వచ్చాయి అవి తీసేశారా..? అని సూటిగా ప్రశ్నలు సంధించారు ఈ ద‌ర్శ‌క నిర్మాత‌. ఇంత ర‌చ్చ జ‌రిగిన త‌ర్వాత తాను క‌మ్మ‌వాడిగా ఉన్నందుకు టెంప‌ర్ చిత్రానికి నంది అవార్డ్ వ‌చ్చినా తాను తిర‌స్క‌రిస్తున్నానంటూ ప్ర‌సంగాన్ని ముగించాడు పోసాని కృష్ణ‌ముర‌ళి.

More Related Stories