English   

యుద్ధం శ‌ర‌ణం రివ్యూ రేటింగ్

yuddham-sharanam-Movie-Review-Rating

వ‌ర‌స విజ‌యాల‌తో జోరు మీదున్న నాగ‌చైత‌న్య చాలా రోజుల త‌ర్వాత ప‌క్కా మాస్ సినిమాతో వ‌చ్చాడు. అదే యుద్ధం శ‌ర‌ణం. కొత్త ద‌ర్శ‌కుడితో చేసిన ఈ చిత్రంపై అంచ‌నాలు బాగానే ఉన్నాయి. దానికి కార‌ణం టీజ‌ర్.. ట్రైల‌ర్స్.. ఇప్పుడు యుద్ధం శ‌ర‌ణం విడుద‌లైంది. మ‌రి ఈ చిత్రం ఎలా ఉంది..?  చైతూ అంచ‌నాలు నిల‌బెట్టిందా..?

క‌థ ‌: ముర‌ళి(రావుర‌మేష్), సీత‌(రేవ‌తి) ల‌ది ఓ అంద‌మైన కుటుంబం. వాళ్ల అబ్బాయి అర్జున్ (నాగచైతన్య) చదువు పూర్తైనా కూడా జాబ్ చేయ‌డం ఇష్టం లేక‌.. డ్రోన్ టెక్నాల‌జీతో శిక్ష‌ణ తీసుకుంటూ ఉంటాడు. కొత్త కెమెరా ప‌రిజ్ఞానం ప‌రిశోధిస్తుంటాడు. అలాంటి టైమ్ లో అర్జున్ జీవితంలోకి అంజలి(లావ‌ణ్య త్రిపాఠి) వ‌స్తుంది. ఆమెతో ప‌రిచ‌యం అర్జున్ ను ప్రేమ‌లో ప‌డేస్తుంది. వారి ప్రేమను కుటుంబం కూడా అంగీకరిస్తుంది. ఇలా అన్ని రకాలుగా ఆనందంగా సాగిపోతున్న అర్జున్ జీవితంలో ఉన్నట్లుండి అలజడి రేగుతుంది. అతడి తల్లిదండ్రులు కనిపించకుండా పోతారు. తర్వాత వాళ్లు చనిపోయారని తెలుస్తుంది. ఇంతకీ వాళ్లిద్దరూ ఎలా చనిపోయారు..? ఎందుకు చంపేస్తారు..? అస‌లు వాళ్ల జీవితాల్లోకి క్రిమిన‌ల్ నాయ‌క్ (శ్రీ‌కాంత్) ఎలా వ‌చ్చాడు..? అనేది మిగిలిన క‌థ‌..

క‌థ‌నం : ఇప్ప‌టికే తెలుగు ఇండ‌స్ట్రీలో ఎన్నో రివేంజ్ డ్రామాలు వ‌చ్చాయి. అందులో యుద్ధం శ‌ర‌ణం కూడా ఒక‌టి. ఒక్క కొత్త అంశం కూడా లేకుండా వ‌చ్చిన రొటీన్ క‌మ‌ర్షియ‌ల్ సినిమా ఇది. కాక‌పోతే అక్క‌డ‌క్క‌డా కొన్ని ఆస‌క్తిక‌ర‌మైన స‌న్నివేశాలు రాసుకున్నాడు ద‌ర్శ‌కుడు. ముఖ్యంగా ఫ‌స్టాఫ్ లో కుటుంబంతో ఉన్న స‌న్నివేశాల‌న్నీ బాగానే వ‌చ్చాయి. కానీ ఎంగేజింగ్ గా మాత్రం అనిపించ‌వు. అన్నీ ఎక్క‌డో చూసిన‌ట్లే రొటీన్ గా ఉంటాయి. లావ‌ణ్య త్రిపాఠితో నాగ‌చైత‌న్య ప్రేమ స‌న్నివేశాలు కూడా రొటీన్ గానే అనిపిస్తాయి. ఇంట‌ర్వెల్ కు ముందు క‌థ‌లో కాస్త వేగం పెంచినా కూడా అప్ప‌టికే క‌థ ఏంటో పూర్తిగా ఓ క్లారిటీ వ‌చ్చేస్తుంది. రావుర‌మేష్, రేవ‌తి క‌నిపించ‌కుండా పోయిన సీన్స్.. ఆ త‌ర్వాత వాళ్ల కోసం నాగ‌చైత‌న్య వెతికే స‌న్నివేశాలు.. ఇవ‌న్నీ ఆస‌క్తిక‌రంగానే అనిపించినా కూడా అద్భుతంగా మాత్రం అనిపించ‌వు.

ఎమోష‌న్స్ స‌రిగ్గా క‌నెక్ట్ అవ్వ‌లేదు. ఇక సెకండాఫ్ లో కూడా రొటీన్ గానే క‌థ సాగుతుంది. ఏకంగా మినిస్ట‌ర్ ల‌నే భ‌య‌ప‌డేంత స్థాయి ఉన్న విల‌న్ గా శ్రీ‌కాంత్ ను చూపించాడు కానీ అత‌న్ని స‌రిగ్గా ఎలివేట్ చేయ‌డంలో మాత్రం పూర్తిగా విఫ‌ల‌మ‌య్యాడు ద‌ర్శ‌కుడు. ఫ‌స్టాఫ్ లో డ్రోన్ తో ప్ర‌గ్నెంట్ లేడీకి మెడిసిన్స్ పంపించే సీన్ ఒక్క‌టే ద‌ర్శ‌కుడు అద్భుతంగా రాసుకున్నాడు. అది కూడా అలా ఉంటుంద‌ని తెలిసినా.. సీన్ అందంగా రాసుకున్నాడు. త‌న‌ను.. త‌న కుటుంబాన్ని ర‌క్షించుకునే క్ర‌మంలో చైతూ చేసే ప‌నుల‌న్నీరొటీన్ గానే.. ఎన్నో సినిమాల్లో చూసిన అనుభూతినే క‌లిగిస్తుంది. ఓవ‌రాల్ గా తాను బ‌త‌క‌డానికి యుద్ధమే శ‌ర‌ణం అనే టైటిల్ జ‌స్టిఫికేష‌న్ ఇచ్చినా.. అనుకున్న స్థాయిలో ఇవ్వ‌డంలో విఫ‌లం అయ్యాడు ద‌ర్శ‌కుడు.

న‌టీన‌టులు : నాగ‌చైత‌న్య‌, లావ‌ణ్య త్రిపాఠి, రావు ర‌మేష్, శ్రీ‌కాంత్, రేవ‌తి.. నిర్మాత‌: ర‌జినీ కొర్ర‌పాటి క‌థ‌, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌కుడు: కృష్ణ ఆర్వీ మ‌రిముత్తు నాగ‌చైత‌న్య డ్రోన్ స్పెష‌లిస్ట్ గా.. ప‌గ తీర్చుకునే తెలివైన అబ్బాయిగా రెండు వేరియేష‌న్స్ ఉన్న పాత్ర‌లో బాగా న‌టించాడు. గ‌త సినిమాల‌తో పోలిస్తే చైతూ న‌టుడిగా కూడా ఇంకా మెప్పించాడు. కానీ క‌థే అత‌డికి స‌హ‌కారం అందించ‌లేదు. ఇక లావ‌ణ్య త్రిపాఠి అందాల ఆర‌బోత‌కు బాగానే సెట్ట‌యింది. రేవతి త‌ను ఉన్నంత‌లో అద్భుతంగా న‌టించింది. ఇక రావుర‌మేష్ గురించి కొత్త‌గా చెప్పాల్సిందేమీ లేదు. సినిమాలో వీళ్లిద్ద‌రి పాత్ర‌లే బాగా హైలైట్ అయ్యాయి. మిగిలిన వాళ్లంతా ఇలా వ‌చ్చి అలా వెళ్ళే పాత్ర‌లే.

టెక్నిక‌ల్ టీం : వివేక్ సాగ‌ర్ మ్యూజిక్ బాగుంది. పాట‌లు విన‌డానికి అంతగా అనిపించ‌క‌పోయినా.. బ్యాగ్రౌండ్ స్కోర్ మాత్రం చాలా బాగా ఇచ్చాడు. బ‌ల‌హీన‌మైన క‌థ‌.. క‌థ‌నానికి వివేక్ సాగ‌ర్ సంగీతం బ‌లంగా నిలిచింది. సినిమాటోగ్ర‌ఫీ ఏదో తేడాగా అనిపించింది. ప్ర‌తీ సీన్ ను మ‌రీ క్లోజ్ షాట్ లో చిత్రీకరించ‌డంతో స్క్రీన్ షేక్ అవుతున్న ఫీలింగ్ క‌లుగుతుంది. ఇక ద‌ర్శ‌కుడిగా కృష్ణ ఆక‌ట్టుకోలేదు. ఈయ‌న రాసుకున్న క‌థ రొటీన్ అయినా.. ఇదే క‌థ‌తో గ‌తంలో చాలా మంది ద‌ర్శ‌కులు స‌క్సెస్ అయ్యారు. కానీ అనుభవ‌లేమి కార‌ణ‌మేమో కానీ అక్క‌డ‌క్క‌డా మంచి సీన్స్ రాసుకున్నా.. చాలా చోట్ల క‌థ ముందుకు సాగ‌లేక బోర్ కొట్టించేసాడు.

చివ‌ర‌గా : ఇది యుద్ధం శ‌ర‌ణం కాదు.. యుద్ధం మ‌ర‌ణం..

రేటింగ్ 2/5

More Related Stories