English   

Lockdown Flashback Stories: అలా చేసుంటే శోభన్ బాబు మరో 20 ఏళ్లు బతికుండేవాడా..?

babu
2020-05-13 06:44:51

చరిత్రలో కొన్ని తెలియని విషయాలు ఉంటాయి. అవి తెలిసినపుడు చాలా ఆసక్తికరంగా అనిపిస్తుంటాయి. నిన్నటి తరం ప్రేక్షకులకు శోభన్ బాబు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆంధ్రుల అందాల నటుడు ఈయన. ఇప్పటికీ ఆడాళ్లకు ఆయనంటే ప్రాణం.. ఆయన సినిమా వచ్చిందంటే టీవీల ముందు కూర్చుంటారు. అలాంటి శోభన్ బాబు ఉన్నట్లుండి సినిమాలకు దూరం కావడం.. ఆ తర్వాత అనుకోకుండా చనిపోవడం అందరికీ షాకే. ఆయన సినిమాలకు ఎందుకు దూరమయ్యాడు..? అలాంటి నిర్ణయం తీసుకున్న తర్వాత ఆయన మనసులో జరిగిన సంఘర్షణ ఏంటి అనేది అతికొద్ది మంది సన్నిహితులతో మాత్రమే పంచుకున్నారు శోభన్ బాబు. అప్పటి వరకు రోజూ షూటింగ్స్ తో బిజీగా ఉన్న శోభన్ బాబు.. ఒకరోజు సడన్ గా ఇండస్ట్రీ నుంచి మాయమైపోయాడు. సరదాగా ఇండస్ట్రీ మొత్తం కలిసి పని చేసుకుంటున్న సమయంలో 60 ఏళ్లు వచ్చాయి.. తనకు విశ్రాంతి కావాలి.. ప్రేక్షకుల మనసులో ఎప్పుడూ శోభన్ బాబు అంటే అందగాడిగానే ఉండాలని రిటైర్మెంట్ తీసుకున్నాడు నట భూషణుడు. ఇదే ఆయన ప్రాణం పోవడానికి కూడా కారణమైందని కొందరు సినిమా విశ్లేషకులు కూడా చెప్తున్నారు. సినిమాల్లో ఉన్నపుడు రోజూ పనీ.. అందరితో సరదాగా ముచ్చట్లు..

ఆరోగ్యకరంగా సాగే పోటీ అన్నీ ఉన్నాయి. అయితే ఒక్కసారిగా ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోయి ఎవరికీ కనిపించకుండా మద్రాసులోనే ఉండిపోయాడు శోభన్ బాబు. దాంతో ఆయనకు పొద్దు కూడా పోయేది కాదని ఆయన్ని దగ్గర్నుంచి చూసిన వాళ్లలో కొందరు చెప్తున్న మాట. పొద్దున్నే లేచి పేపర్ చదవడం.. ఆయన బిల్డింగులు, ఆస్తులు చూసుకుని రావడంతోనే సరిపోయేదని.. కనీసం మనసులో విషయాలు పంచుకోడానికి కూడా తోడు లేకుండా పోయింది. ఆ బాధ ఆయనలోనే ఉండిపోయింది కూడా. కొడుకు ఉన్నా తన పెళ్లి.. పిల్లలు.. సంసారం ఉంది. ఇక ముగ్గురు కూతుళ్లకు పెళ్లిళ్లు చేసి పంపించేసాడు. దాంతో ఒంటరి అయిపోయాడు శోభన్ బాబు. అదే ఆయన్ని కుంగదీసిందనే వాళ్లు కూడా లేకపోలేదు. ఒక్కసారిగా ఇండస్ట్రీ నుంచి దూరమైపోవడంతో చాలాసార్లు శోభన్ బాబు బాధ పడ్డాడని.. సినిమాలు మానేసి తప్పు చేసానని కొందరితో చెప్పినట్లు కూడా సన్నిహితులు చెప్తుంటారు. కానీ ఏం చేస్తాం.. అప్పటికే తొందరపడి ఓ మాట చెప్పేసాడు.. తను సినిమాల్లో నటించనని మాటిచ్చేసాడు. దాంతో ఇచ్చిన మాట వెనక్కి తీసుకోలేక ఒంటరి అయిపోయాడు ఈయన. ఒకవేళ సినిమాల్లో నటించి ఉంటే మరో 20 ఏళ్లు శోభన్ బాబు బతికేవాడని చెప్తుంటారు ఆయన సన్నిహితులు. ఎందుకంటే ఆయన తీసుకునే జాగ్రత్తలు అలా ఉండేవి.. 50 ఏళ్లుగా క్రమం తప్పకుండా రోజూ వ్యాయామం చేయడం కూడా ఈయనకు అలవాటు. అలాంటి శోభన్ బాబు 2008 మార్చ్ లో సడన్ గా హార్ట్ ఎటాక్ తో చనిపోయాడు. అదే ఆయన కానీ సినిమాల్లో ఉండుంటే అందరితో సరదాగా ఉంటూ మరో 20 ఏళ్లు కచ్చితంగా బతికుండేవారని.. ఆయనకు ఎలాంటి అనారోగ్యం కూడా లేదని చెప్తుంటారు ఆయన సన్నిహితులు. వజ్రోత్సవాలప్పుడు కూడా రావాలనే అనుకున్నా.. మొహం ముడతలు పడిపోవడం.. ముసలితనం కనిపించడంతో సిగ్గుతో రాలేకపోయాడు ఈయన. ఏదేమైనా కూడా సినిమాలు చేయకుండా ఉండి శోభన్ బాబు తప్పు చేసాడని ఇప్పటికీ ఆయన అభిమానులు బాధ పడుతుంటారు.

 

More Related Stories