English   

Lockdown Flashback Stories: సావిత్రిని చివరి రోజుల్లో అంతా కలిసి చంపేసారా..?

savithri
2020-05-12 19:29:26

మహానటి సావిత్రి గురించి చెప్పడానికి మాటలు సరిపోవు.. గ్రంథాలు కావాలి. కేవలం 45 ఏళ్ల జీవితంలోనే 100 ఏళ్ళకు సరిపడా కష్టాలు చూసింది ఈమె. పగవాడికి కూడా సావిత్రి పడిన కష్టాలు రాకూడదని చెప్తారు ఆమెను దగ్గర్నుంచి చూసిన వాళ్లు. అప్పట్లో సీత ఎలాంటి కష్టాలు పడిందో తెలియదు కానీ సావిత్రి కంటే తక్కువ కష్టాలే పడుంటుందని ఆమె గురించి తెలిసిన వాళ్లు చెప్పే మాట. అన్ని కష్టాలను తన జీవితంలో చూసింది ఈమె. వేలాది మందికి సాయం చేసిన చేతులు చివరికి ఏం లేకుండా చనిపోవడం నిజంగానే విషాదం. అయితే సావిత్రి చనిపోలేదు.. చంపేసారంటారు కొందరు సీనియర్ జర్నలిస్టులు. అందులో ముఖ్యంగా ఆమెను దగ్గర్నుంచి చూసిన వ్యక్తి.. సావిత్రితో మంచి సాన్నిహిత్యం ఉన్న జర్నలిస్ట్ ఇమంది రామారావు. మద్రాసులో ఆమె 500 రూపాయలకు అద్దె ఉంటున్న రోజుల్లో కూడా సావిత్రిని చూసాడు రామారావు. ఆయన చెప్పిన మాటలు వింటే సావిత్రిని ఎంత దారుణంగా మోసం చేసారో.. ఎంతమంది కలిసి చిత్రవధ చేసి చంపేసారో అర్థమవుతుంది.

వింటుంటేనే కన్నీళ్ళు వచ్చేంత విషాద గాధ సావిత్రి జీవితం. కూతురు విజయ చాముండేశ్వరి పెళ్లికి ముందు వరకు కూడా రాజభోగాలు అనుభవించింది సావిత్రి. కూతురుకు కూడా వందల కోట్ల ఆస్తులు ఇచ్చింది ఆ రోజుల్లోనే. అయితే ఒక్కసారి పెళ్లైన తర్వాత తన ఇంట్లో అడుగు పెట్టొద్దని.. నీ కూతురు కాపురం బాగుండాలంటే మీరు మా గడప తొక్కొద్దని అల్లుడు చెప్పడం.. ఆత్మాభిమానం ఎక్కువున్న సావిత్రి చచ్చిపోయే వరకు కూడా కూతురు మొహం చూడకపోవడం కన్నీరు పెట్టించే విషయం. అమ్మ చివరి రోజుల్లో చావు బతుకుల్లో ఉంటే కూడా చాముండేశ్వరి ఒక్కరోజు కూడా ఆమెను చూడ్డానికి రాలేదని బల్లగుద్ది చప్పాడు ఇమంది రామారావు. ఈ విషయం తానెక్కడ చెప్పమన్నా కూడా చెప్తానని ఆయన సీరియస్ అయ్యాడు. సావిత్రిని చివరి రోజుల్లో ఎవరూ పట్టించుకోలేదనే దానికి తానే సాక్ష్యం అన్నాడు ఈయన. అప్పుడప్పుడూ తమబోటి వాళ్లు అమ్మ ఉన్న ఇంటికి వెళ్లి అలా కాసేపు ఉండి వచ్చేవాళ్లమని.. అప్పట్లో ఓ ముస్లిం అభిమాని మాత్రం ఆమె కోమాలో ఉన్నపుడు కొన్ని నెలల పాటు సేవలు చేసాడని గుర్తు చేసుకున్నాడు ఈ సీనియర్ జర్నలిస్ట్. అంతే కానీ సొంత వాళ్లు మాత్రం ఎవరూ రాలేదని.. జెమినీ గణేషన్, విజయ చాముండేశ్వరి అసలే రాలేదని చెప్పాడాయన. బతికున్నపుడు పట్టించుకుంటే సావిత్రికి దిక్కులేని చావు ఎందుకొచ్చేదని ఆయన కన్నీరు పెట్టుకున్నాడు. ఈ రోజు ఏదో అంతా సావిత్రి మహానటి.. అమ్మ.. దేవత అంటున్నారే కానీ ఆ రోజు ఆమె కష్టాల్లో ఉన్నపుడు ఒక్కరు కూడా ఎందుకు రాలేదని రామారావు ప్రశ్నించాడు. నాగేశ్వరరావు, ఎన్టీఆర్ కూడా రాలేదని.. అంతా చనిపోయిన తర్వాత వచ్చినవాళ్లే అని చెప్పాడాయన. ఒకవిధంగా చెప్పాలంటే సావిత్రి చచ్చిపోలేదని.. అంతా కలిసి చంపేసారని సంచలన వ్యాఖ్యలు చేసాడు జర్నలిస్ట్ ఇమంది రామారావు. ఆస్తులు అన్నీ తీసుకుని ఆమెను నడిరోడ్డు పాలు చేసారని చెప్పాడాయన. చివరికి చనిపోయిన తర్వాత అంతా వచ్చి ఆమె దేవత, మహానటి, అమ్మ అని చిలక పలుకులు పలికారంటూ అసలు నిజాలు చెప్పాడు ఈ జర్నలిస్ట్.

More Related Stories