English   

ల‌వ‌ర్ రివ్యూ

Lover-Review
2018-07-20 16:03:36

ల‌వ‌ర్.. కొన్ని రోజులుగా తెలుగులో బాగా వినిపిస్తున్న పేరు ఇది. రాజ్ త‌రుణ్ హీరో అని కాదు.. ఇప్పుడు ఈ కుర్ర హీరో ఉన్న ప‌రిస్థితుల్లో కూడా దిల్ రాజు లాంటి నిర్మాత ఈయ‌న‌తో సినిమా చేయ‌డం.. అందుకే ల‌వ‌ర్ పై ఆస‌క్తి.. మ‌రి ఆ న‌మ్మ‌కాన్ని ద‌ర్శ‌కుడు నిల‌బెట్టుకున్నాడా..?

క‌థ‌:  రాజ్(రాజ్ త‌రుణ్) అనంత‌పురంలో ఉంటాడు. సిటీలోనే పేరు మోసిన బైక్ డిజైన‌ర్. కావాల్సిన‌ట్లు బైక్ లు సిద్ధం చేస్తుంటాడు. అత‌డి అన్న జ‌గ్గూభాయ్(రాజీవ్ క‌న‌కాల‌) సుపారీ కిల్ల‌ర్. ఓ రోజు జ‌గ్గూభాయ్ పై అటాక్ చేయ‌డానికి వ‌చ్చిన వ్య‌క్తులు రాజ్ భుజానికి బుల్లెట్ దించేస్తారు. హాస్పిట‌ల్ కు వెళ్లి ట్రీట్మెంట్ తీసుకుంటున్న రాజ్ కు అక్క‌డ న‌ర్స్ చ‌రిత‌(రిద్ధ‌కుమార్) తో ప‌రిచ‌యం అవుతుంది. చూడ‌గానే ప్రేమ‌లో ప‌డ‌తాడు రాజ్. కానీ చ‌రిత అనుకోకుండా ఓ మెడిక‌ల్ స్కామ్ లో ఇరుక్కుంటుంది. ఆ త‌ర్వాత ఆమెను రాజ్ ఎలా కాపాడాడు.. ప్రేమ‌ను ఎలా ద‌క్కించుకు న్నాడు అనేది మిగిలిన క‌థ‌.. 

క‌థ‌నం: దిల్ రాజు వ‌రస విజ‌యాల‌తో దూసుకుపోతున్నాడు. వ‌ర‌స‌గా ఆరు హిట్ల‌తో జోరు మీదున్న ఈ నిర్మాత‌.. ఇప్పుడు వ‌ర‌స ప్లాపుల్లో ఉన్న రాజ్ త‌రుణ్ తో ల‌వ‌ర్ అంటూ సినిమా నిర్మించాడు. దీనికి దిల్ రాజు వెన్నంటే ఉన్నా కూడా హ‌ర్షిత్ రెడ్డి నిర్మాణ విలువ‌లు చూసుకున్నాడు. ఆ లోటు మ‌న‌కు సినిమాలో స్ప‌ష్టంగా క‌నిపిస్తుంది. దిల్ రాజు హ్యాండ్ ఉన్నా లేన‌ట్లే ఉంది ఈ చిత్రంలో. పూర్తిగా అన్న కొడుకుకు వ‌దిలేయ‌డంతో ల‌వ‌ర్ కాస్తా ఎటూ కాకుండా పోయిన‌ట్లు అనిపిస్తుంది. ఫ‌స్టాఫ్ లో క‌థేమీ లేకుండానే సోసోగా న‌డిపించేసాడు ద‌ర్శ‌కుడు అనీష్. హీరోయిన్ ను తొలిచూపులోనే చూడ‌టం.. ఆమె ప్రేమించ‌డం.. ప్రేమ కోసం పాకులాడ‌టం.. అంత‌లోనే హీరోయిన్ ఓ స‌మ‌స్య‌లో ఇరుక్కుపోవ‌డం.. ఆమెను కాపాడ‌టం ఇవ‌న్నీ చాలా సినిమాల్లో చూసాం.. ల‌వ‌ర్ లో కూడా కొత్త‌గా ఏం క‌నిపించ‌లేదు. అస‌లు క‌థ‌లోకి వెళ్ల‌కుండా చాలా సేపు టైమ్ పాస్ చేయించాడు ద‌ర్శ‌కుడు. సెకండ్ హాఫ్ లో క‌థ‌లోకి వెళ్లిన త‌ర్వాత కూడా స్క్రీన్ ప్లే లోపాల‌తో చాలా నెమ్మ‌దిగా సాగిన ఫీలింగ్ వ‌స్తుంది. కేర‌ళ ఎపిసోడ్స్ బాగున్నా.. కొత్త‌గా అయితే లేవు. క్లైమాక్స్ లో కార్ హ్యాకింగ్ కాన్సెప్ట్ తో వీడియో గేమ్ ని త‌ల‌పించాడు ద‌ర్శ‌కుడు. ఓవ‌రాల్ గా ల‌వ‌ర్ అంచ‌నాలు అయితే అందుకోలేదు. 

న‌టీన‌టులు: రాజ్ త‌రుణ్ ఎప్ప‌ట్లాగే న‌టించాడు. ఎన‌ర్జిటిక్ గా అనిపించానా.. ఎందుకో ఈయ‌న భాష మాత్రం అర్థం కాదు. ఈసారి సీమ యాస‌లో మాట్లాడేస‌రికి అది ఇంకాస్త క‌న్ఫ్యూజ‌న్ క్రియేట్ చేసింది. రిద్ధికుమార్ చూడ్డానికి బాగుంది.. న‌ట‌న కూడా ప‌ర్లేదు. రాజీవ్ క‌న‌కాల హీరో త‌ర్వాత హీరో కారెక్ట‌ర్ చేసాడు. సుబ్బ‌రాజ్.. అజ‌య్.. స‌చిన్ ఖేడ్ క‌ర్ లాంటి వాళ్ల‌ను వేస్ట్ చేసాడు ద‌ర్శ‌కుడు. చిన్న పాత్ర‌ల‌కే ప‌రిమితం చేసాడు. 

టెక్నిక‌ల్ టీం:  ఐదుగురు సంగీత ద‌ర్శ‌కులు ఈ సినిమాకు ప‌ని చేసారు. పాట‌లు బాగానే ఉన్నాయి. ముఖ్యంగా నాలో చిలిపిక‌ల సాంగ్ అయితే చాలా బాగుంది. ఇక సినిమాటోగ్ర‌ఫీ విష‌యంలో స‌మీర్ రెడ్డికి పేరు పెట్టాల్సిన ప‌నిలేదు. కేర‌ళ అందాల‌ను బాగా చూపించాడు డిఓపి. ప్ర‌వీణ్ పూడి ఎడిటింగ్ ప‌ర్లేదు. ద‌ర్శ‌కుడిగా అనీష్ కృష్ణ రెండో సినిమాతో ఆక‌ట్టుకోలేక‌పోయాడు. పాత క‌థ తీసుకోవ‌డం ల‌వ‌ర్ కు మైన‌స్ గా మారింది. అయితే అక్క‌డ‌క్క‌డా ఆక‌ట్టు కునే స‌న్నివేశాలు ఉన్నా అది సినిమాను మాత్రం నిల‌బెట్ట‌డం క‌ష్టం.

చివ‌ర‌గా: ప్రేమికుడు.. నిల‌బ‌డ‌టం క‌ష్ట‌మే గురూ...!

రేటింగ్: 2.5/5.

More Related Stories