English   

వెంటిలేటర్ పై ప్రముఖ హీరో

Madala-Ranga-Rao
2018-05-21 11:32:28

నిన్నటి తరం నటుడు, నిర్మాత మాదాల రంగారావు వెంటిలేటర్ పై ఉన్నారు. ఒకప్పుడు విప్లవ చిత్రాల కథానాయకుడుగా స్టార్డమ్ సంపాదించున్నారాయన. కమ్యూనిస్ట్ పార్టీ అనుబంధ ప్రజాసంఘమైన ప్రజానాట్యమండలిలో కీలక సభ్యుడుగా ఉండేవారు. అభ్యుదయ చిత్రాల దర్శక నిర్మాతలు టి. కృష్ణ, పోకూరి బాబూరావు మాదాల రంగారావుకు క్లాస్ మేట్స్.. ఈ ముగ్గురూ కలిసే సినిమా రంగంలోకి వచ్చారు. ముందుగా మాదాల రంగారావు ఛైర్మన్ చలమయ్య అనే సినిమాలో కీలక పాత్ర పోషించారు. ఆ సినిమాలో నటనకు పెద్దగా గుర్తింపు రాలేదు. పైగా ప్రజానాట్యమండలి సభ్యుడు కావడంతో కళ సమాజానికి ఉపయోగపడాలనే నిర్ణయంతో సొంతంగా నవతరం పిక్చర్స్ బ్యానర్ ను స్థాపించారు. ఈ బ్యాన్ పై వచ్చిన మొదటి సినిమా యువతరం కదిలింది సెన్షేషనల్ హిట్ అయింది. తన బ్యానర్ లో వచ్చే చిత్రాలకు కథ, స్క్రీన్ ప్లే ఆయనే అందించేవారు. 

మాదాల రంగారావు సినిమాలన్నీ విప్లవాత్మకంగానే ఉండేవి. యువతరం కదిలింది, మరో కురుక్షేత్రం, మరో ప్రపంచం, మహా ప్రస్థానం, నవోదయం, విప్లవ శంఖం, బలిపీఠంపై భారతనారి, తొలిపొద్దు, ఎర్రసూర్యుడు, ఎర్రమల్లెలు, ఎర్రమట్టి, ఎర్ర పావురాలు, ప్రజాశక్తి, స్వరాజ్యం వంటి సినిమాలు చేశారాయన. మాదాల రంగారావు సినిమాలు సెన్సార్ నిర్బంధాలకు విపరీతంగా గురయ్యేవి. ఒకరకంగా చెప్పాలంటే మాదల రంగారావు సినిమాల్లాగా భారతదేశంలో మరెవరి సినిమాలూ ఇంతలా సెన్సార్ నిర్బంధాలకు గురికాలేదు. అయినా సెన్సార్ తోనూ పోరాడి విజయం సాధించేవారు. విప్లవ శంఖం సినిమాను సెన్సార్ బోర్డ్ సర్టిఫికెట్ ఇవ్వడానికి నిరాకరిస్తే.. ఆయన సెన్సార్ ఆఫీస్ ముందు ధర్నాకు దిగారు. దీంతో అప్పటి తమిళ స్టార్స్ అయినా ఎమ్జీఆర్, శివాజీ గణేశన్ వంటివారు కూడా మాదాల రంగారావుకు మద్ధతుగా వచ్చారు. ఈ వార్త అప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 

More Related Stories