English   

అస్తమించిన ‘రెడ్ స్టార్’ ..ప్రత్యేక కధనం

Madala Ranga Rao Special Story
2018-05-27 12:08:25

మాదాల రంగారావు.. మనతరానికి పెద్దగా తెలియని వ్యక్తి. అయినా కొన్ని తరాలను ప్రభావితం చేసిన సినిమాలు చేసిన హీరో ఆయన. చాలాకాలంగా గుండె సంబంధిత జబ్బుతో బాధపడుతోన్న ఆ రెడ్ స్టార్ ఇవాళ ఉదయం 4.41గంటలకు కన్నుమూశారు. ఆయన వయసు 70యేళ్లు. దాదాపు 70సినిమాల్లో నటించిన ఆయన నిర్మాతగా 15కుపైగా సినిమాలు నిర్మించారు. ఈ తరానికి తెలియని ఆ తరం రెడ్ స్టార్ కు సంబంధించిన వివరాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.. 

 

వెండితెరపై విప్లవశంఖం పూరించిన తొలి కథానాయకుడు మాదాల రంగారావు.. ఒకప్పుడీ పేరు ఎరుపు సినిమాలకు మెరుపు కిరణంలా కనిపించేది. నాటి వివాదాస్పద ప్రజానాట్యమండలి నుంచి వెండితెరకు వచ్చిన నటుడు, నాయకుడు మాదాల రంగారావు.. తొలి సినిమా తర్వాత సొంతంగా నవతరం పిక్చర్స్ బ్యానర్ స్థాపించి వెండితెరపై విప్లవ శంఖం పూరించాడు.. నవరక్త సినిమాలు తెరకెక్కించారు. స్వరాజ్య స్థాపన కోసం ప్రజాశక్తితో ఎర్రపావురాలను ఎగురవేసిన నటుడు మాదాల రంగారావు.

 

1979లో వచ్చిన చైర్మన్ చలమయ్య మాదాల రంగారావు తొలి చిత్రం. ఆ సినిమా వచ్చిన యేడాదే తనే స్వయంగా నిర్మాతగా మారాడు. నవతరం పిక్చర్స్ బ్యానర్ ను స్థాపించి.. తనదైన శైలిలో సినిమాలకు శ్రీకారం చుట్టాడు. ఆ బ్యానర్ లో రూపొందించిన తొలి సినిమా యువతరం కదిలింది. ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే తనే అందించాడు. ధవళసత్యం దర్శకుడు. పూర్తిగా సోషలిస్ట్ భావజాలంతోనే నిర్మించిన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. యువతరం కదిలింది చిత్రానికి ఉత్తమ చిత్రంగా బంగారు నంది పురస్కారం వచ్చింది. ఓ ప్రధాన పాత్రలో నటించిన ప్రభాకర్ రెడ్డికి ఉత్తమ నటుడిగానూ నంది వచ్చింది. ఇక ఈ సినిమా టైమ్ లోనే తన క్లాస్ మేట్స్, తన భావజాలానికి దగ్గరగా ఉండే టి.కృష్ణ, పోకూరి బాబూరావు.. రంగారావుకు సన్నిహితులుగా మారిపోయారు. ముగ్గురూ కలిసి ఆ సినిమా నుంచే అభ్యుదయ ప్రయాణం ప్రారంభించారు..

 

సినిమా హిట్ కావడం చాలామందికి వ్యాపార విజయం.. కానీ మాదాల రంగారావు వంటి వారికి వ్యాపారంతో పాటు తమ భావజాలానికి ప్రజలు కట్టిన పట్టంగా మారుతంది. అందుకే సమసమాజ స్థాపన, సోషలిజం, అంటూనే అప్పుడప్పుడూ అతివాద కమ్యూనిజపు భావజాలంతో వరుసగా సినిమాలు నిర్మిస్తూ వెళ్లాడు మాదాల రంగారావు. మాదాల రంగారావు నిర్మించిన చాలా సినిమాల టైటిల్స్ లోనే ఎరుపు ఉండేది. ఎర్రసూర్యుడు, ఎర్రమట్టి, ఎర్రపావురాలు, ఎర్రమల్లెలు ఇలా.. కానీ ఈ సినిమాలన్నీ మంచి విజయాలే సాధించడం విశేషం. ముఖ్యంగా ఎర్రమల్లెలు సినిమాకు ఇప్పటికీ ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆర్టిస్టుల పరంగా ఎందరిని తీసుకున్నా.. తానూ ఓ ప్రధాన పాత్రగా కనిపించేవారు మాదాల రంగారావు.. అలాగే..  చిత్రీకరణ పరంగా విజయవాడ, మంగళగిరి, ఒంగోలు పరిసర ప్రాంతాలనే ఎంచుకునేవాడు. అక్కడి చుట్టుపక్కల గ్రామాల్లోని ప్రజలు, స్థానిక కమ్యూనిస్టు నాయకుల సహకారంతో సినిమాలు పూర్తి చేసేవాడు. ఇప్పుడు ఆ ప్రాంతాలన్నీ గుర్తుపట్టలేనంతగా మారిపోయినా.. నాటి ప్రజలకు మాత్రం స్పష్టంగా అర్థమౌతుంది. 

 

సమాజాన్నే కథగా.. అందులోని పాత్రధారులే తన పాత్రలుగా మలచుకుని.. ప్రతి మనిషి సమానత్వంతో జీవించాలని చెప్పడమే అంతిమంగా మాదాల రంగారావు చిత్రాల సందేశం. అంటే సమసమాజం అన్నమాట. కొన్నిసార్లు అప్పుడు సమాజంలో జరిగిన అక్రమాలు, అవినీతి, రౌడీఇజం వంటి అంశాలనూ తన సినిమాల్లో కథాంశాలుగానో.. పాత్రలుగానో మలచారు. ఆ క్రమంలో ఆ కేసులు.. గొప్పోళ్ల ధనబలం వల్ల నీరుగారిపోయిన విషయాన్ని కూడా చూపించారు. దీంతో చాలాసార్లు ఆయన సినిమాలకు సెన్సార్ బోర్డ్ నుంచి అభ్యంతరాలు వచ్చేవి. ఇప్పటి వరకూ ఇండియాలో చాలా సినిమాలు సెన్సార్ బోర్డ్ నిషేధానికి గురయ్యాయి.. అయితే సెన్సార్ నుంచి మాదాల రంగారావు సినిమాలు ఎదుర్కొన్నంత నిషేధం, నిర్బంధం మరే నిర్మాతా ఫేస్ చేసి ఉండడు. ఓ దశలో ఆయన తీసిన ప్రతి సినిమాకు సెన్సార్ నుంచి అభ్యంతరాలు వచ్చేవి. దీంతో తను సెన్సార్ బోర్డ్ తో కూడా పోరాటం చేసి విజయం సాధించేవాడు. ఆ తర్వాత అవి బాక్సాఫీస్ వద్దా సక్సెస్ అవుతుండేవి..  

 

కార్మికులు, కర్షకులు.. పెట్టుదారీ వర్గాలు, భూ స్వామ్య పెత్తందార్లు.. దోపిడీ అనగానే గుర్తొచ్చే మొత్తం వర్గాలుగా వీరినే చెబుతాం. దోపిడీకి వ్యతిరేకంగా తీసే సినిమాల్లో కూడా ఈ వర్గాలే ఉంటాయి.. ఉన్నాయి. అయితే ఎంచుకునే కథ, కథనం నాటి సామాజిక స్థితికీ, సమకాలీన పరిస్థితికీ అద్దంపట్టేలా ఉండటమే కమర్షియల్ గానూ సక్సెస్ కావడానికి కారణంగా చెప్పొచ్చు. మరోవైపు రాజ్యానికి వ్యతిరేకంగానూ ఈ కథాంశాలుంటాయి. అలాంటి కథాంశాలు ఎంచుకున్నాడు కాబట్టే మాదాల రంగారావు సినిమాలకు సెన్సార్ బోర్డ్ నుంచి తీవ్రమైన వ్యతిరేకతలు వచ్చాయని చెబుతారు. పీడన పెరిగితే పోరాటం అనివార్యమవుతుంది. ఇదే సూత్రం మాదాల రంగారావు తన సినిమాలకు అప్లై చేసిన సూత్రం. మాగ్జిమం ఆయన చేసిన సినిమాలన్నీ ప్రజాశక్తితో ప్రజల వద్దే పరిష్కార మార్గం చూపించే విధంగా ఉంటాయి. చాలా తక్కువ సార్లు మాత్రమే మాదాల రంగారావు సినిమాల్లో తుపాకీ వచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే నారాయణమూర్తిలాగా తుపాకీయే అన్ని సమస్యలకు అంతిమ పరిష్కారం అని చెప్పిన సందర్భాలు చాలా తక్కువ. 

 

మాదాల రంగారావు అంటే ఎనభైవ దశకంలో వెండితెర అరుణకిరణంగా చెప్పుకున్నారు. కారణం ఇదీ అని ఖచ్చితంగా చెప్పలేం కానీ.. తొలినాళ్లలో తోడుగా ఉన్న క్లాస్ మేట్స్ టి.కృష్ణ, పోకూరి బాబూరావు ఆయన్నుంచి విడిపోయారు. అయినా తనే సొంతంగా సినిమాలు నిర్మిస్తూ నటిస్తూ వెళ్లారు మాదాల రంగారావు. కానీ తర్వాతి కాలంలో టి. కృష్ణ కూడా అభ్యుదయ చిత్రాలు తీయడానికి, ఆ తర్వాత ఆర్. నారాయణ మూర్తి ఆ పంథాలోనే సాగడానికి ఫస్ట్ అండ్ బెస్ట్ ఇన్సిస్పిరేషన్ మాత్రం ఈయనే. కొన్ని సినిమాలు ఫ్లాప్ అవుతున్నా... పంథా వీడకుండా తను నమ్మిన సిద్ధాంతాన్నే వెండితెరపై ఆవిష్కరించారు మాదాల రంగారావు.. ఈ విషయంలో ఆర్.నారాయణమూర్తి ఆయన్నే ఆదర్శంగా తీసుకున్నట్టు కనిపిస్తుంది. అలాగే టి. కృష్ణ కూడా. కాకపోతే మాదాల రంగారావు వద్ద శిష్యరికం చేసిన టి. కృష్ణ ఆ తర్వాత చేసిన సినిమాలు ఈయనకంటే బలమైన ముద్ర వేయడం కొంత ఆశ్చర్యం కలిగిస్తుంది. అయినా ఈ ఇద్దరూ సమాజహితం కోసమే సినిమా అని నమ్మారు ఆచరించారు. ఇక మాదాల రంగారావు సినిమాల్లో కంటిన్యూస్ గా కొందరు ఆర్టిస్టులు కనిపించేవారు.. వాళ్లలో కొందరు ప్రజానాట్యమండలి వారున్నారు.. సినిమా వాళ్లూ ఉన్నారు. వీరితోనే ఎక్కువ కంఫర్ట్ ఫీలయ్యారో.. వీళ్లే తన బడ్జెట్ లో ఉన్నారో కానీ.. మొత్తంగా కొందరు నటులు మాత్రం మొనాటనస్ గా అనిపిస్తారాయన సినిమాల్లో.. 

 

ఏదేమైనా చాలాకాలం క్రితమే సినిమాకు, మీడియాకూ పూర్తిగా దూరమయ్యాడు మాదాల రంగారావు. ప్రస్తుతం ఆయన చెన్నైలో ఉంటున్నారు. మీడియాకు అస్సలు దగ్గరగా కూడా రావడం లేదు. ఆయన తనయుడు మాదాల రవి డాక్టర్ చదువుకున్నా సినిమాల్లోనూ ట్రై చేసి రెండుమూడు సినిమాల్లో కనిపించాడు. కానీ ఎందుకనో ఆయన పెద్దగా సక్సెస్ కాలేకపోయారు. అయితే రవి చిన్నతనంలో తండ్రి నిర్మించిన ఎర్రమల్లెలు సినిమాలో నాంపల్లి టేశను కాడారాజాలింగో అనే పాటలో కనిపించడం విశేషం. నమ్మిన సిద్ధాంతాన్ని అమ్ముకుంటున్న రోజుల్లో కూడా.. కమర్షియాలిటీకి కన్నతల్లులతో కూడా కుప్పిగంతులు వేయించే సినిమా రంగంలో ఆ సిద్ధాంతాన్ని ఆచరించి.. ఆవిష్కరించిన కమ్యూనిస్ట్ మాదాల రంగారావు. అయితే ఆశ్చర్యంగా ఆయన సినిమాలకే కాదు.. పార్టీ కార్యకలాపాల్లోనూ కనిపించడం లేదు. ఏదేమైనా ఇలాంటి కమిటెడ్ కమ్యూనిస్టు కళాకారులు మనకు చాలా అరుదుగా కనిపిస్తారనే చెప్పాలి. అలాంటి అరుదైన రకానికి చెందిన నటులు దూరం కావడం నిజంగా నిజమైన కళకు తీరని లోటనే చెప్పాలి. 

More Related Stories