English   

మ‌హాన‌టి రివ్యూ

Mahanati_review
2018-05-09 13:32:27

సావిత్రి జీవితం అంటే ఒక్క‌రి సొత్తు కాదు. అది అంద‌రి ఆస్తి. ఆమె జీవితం గురించి తెలుసుకోవాల‌ని క‌ల‌లు క‌న‌ని తెలుగు వాడు ఉండ‌డు. ఇక త‌మిళనాడు ఆమె మెట్టినిల్లు కాబ‌ట్టి అక్క‌డ కూడా మ‌హాన‌టిపై అంచ‌నాలు మామూలుగా లేవు. ఇప్పుడు ఈ చిత్రం విడుద‌లైంది. మ‌రి నిజంగానే మ‌హాన‌టి అంచ‌నాలు అందుకుందా..? 

క‌థ‌:  మ‌ధుర‌వాణి(స‌మంత) ప్ర‌జావాణిలో పాత్రికేయురాలిగా ప‌ని చేస్తుంటుంది. ఏదైనా అద్భుత‌మైన క‌థ రాయాల‌నేది ఆమె కోరిక‌. అలాంటి స‌మ‌యంలో సినీన‌టి సావిత్రి(కీర్తిసురేష్) కోమాలోకి వెళ్తుంద‌నే వార్త బ‌య‌టికి వ‌స్తుంది. దాంతో ఆమె గురించి తెలుసుకోవాల‌ని బ‌య‌ల్దేరుతుంది మ‌ధుర‌వాణి. ఆ క్ర‌మంలోనే సావిత్రితో పాటు జెమినీ గ‌ణేష‌న్(దుల్క‌ర్ స‌ల్మాన్) గురించి తెలుసుకుంటుంది. సావిత్రి ఎక్క‌డ పుట్టింది.. ఆమెను పెంచిన ఆ పెద‌నాన్న కేవీ చౌద‌రి (రాజేంద్ర‌ప్ర‌సాద్) ఎవ‌రు..? ఇవ‌న్నీ తెలుసుకోవ‌డం మొద‌లు పెడుతుంది. ఆమె తొలిసారి మ‌ద్రాస్ వ‌చ్చిన క్ష‌ణం.. జెమినీతో ప‌రిచ‌యం.. ఎల్వీ ప్ర‌సాద్ (అవ‌స‌రాల శ్రీ‌నివాస్) సంసారం సినిమాలో అవ‌కాశం.. ఆ త‌ర్వాత అంచెలంచెలుగా ఎదిగిన వైనం.. ఇదంతా మిగిలిన క‌థ‌. కానీ అస‌లు తెర‌వెన‌క ఇంకో క‌థ ఉంటుంది.. అదేంటి అనేది తెర‌పై చూడాల్సిందే.. 

క‌థ‌నం: మ‌హాన‌టి అంటే సావిత్రి త‌ప్ప మ‌రో పేరు గుర్తు రాదు.. మ‌రో పేరును కూడా త‌లుచుకోవ‌డం సాధ్యం కాదు. ఎందుకంటే ఎంత‌మంది న‌టీమ‌ణులు ఉన్నా.. మ‌హాన‌టి మాత్రం సావిత్రి గారే. త‌రాలు మారినా ఈమెపై ఉన్న అభిమానం మాత్రం ఇప్ప‌టికీ అలాగే ఉంది. ఈ త‌రానికి కూడా సావిత్రి గురించి తెలుసుకోవాల‌నే ఆస‌క్తి క‌నిపిస్తుంది. సావిత్రి అంటే అంద‌రికీ న‌టిగానే ప‌రిచ‌యం.. కానీ ఆమెలో తెలియ‌ని కోణాన్ని ఈ చిత్రంతో ప‌రిచ‌యం చేసాడు ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్. ఆమె పుట్టిన ద‌గ్గ‌ర్నుంచీ పెరిగిన వైనం.. సినిమాల్లోకి వ‌చ్చిన గ‌మ‌నం.. ఇవ‌న్నీ ప‌క్కాగా చూపించాడు నాగ్. మ‌రీ ముఖ్యంగా తొలి సీన్ లోనే సావిత్రి జీవితపు ముగింపును చూపించాడు ఈ ద‌ర్శ‌కుడు. త‌న స్క్రీన్ ప్లేతోనే ప‌రుగులు పెట్టించాడు. ఓ వైపు మ‌ధుర వాణి పాత్ర‌తో క‌థ చెప్పిస్తూనే.. మ‌రోవైపు మ‌ధ్య మ‌ధ్య‌లో వేరే పాత్ర‌లు వ‌చ్చి క‌థ‌ను న‌డిపిస్తాయి. అదే ఆస‌క్తి పుట్టించే అంశం కూడా. సావిత్రి జీవితం సుఖాల‌కే కాదు క‌ష్టాల‌కు కూడా పుట్టిల్లే. సినిమాల్లో ఆమె చేసిన ఎన్నో క‌న్నీటి పాత్ర‌లే ఆమె జీవితంలోనూ క‌నిపించాయి. ముఖ్యంగా జెమినీ గ‌ణేష‌న్ తో ఆమె ప్రేమ‌లో ప‌డ‌టం.. ఆ త‌ర్వాత పెద్ద‌ల‌ను కాద‌ని పెళ్లి చేసుకోవ‌డం.. అత‌డి క‌లిసి బ‌త‌క‌డం ఇవ‌న్నీ అప్ప‌ట్లో సావిత్రి ఎలా చేసిందో.. ఇప్పుడు అచ్చంగా అలాగే చూపించాడు ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్. ఇక అత‌డితో విభేధాలు.. విడిపోవ‌డం.. చివ‌ర్లో మందుకు బానిస కావ‌డం ఇవ‌న్నీ చూస్తుంటే మ‌నం దేవ‌త‌గా చూసే మ‌నిషేనా పాపం ఇన్ని క‌ష్టాలు ప‌డింది అంటూ మ‌న‌సు బ‌రువెక్క‌డం ఖాయం. ఇక ఆమెలోని వ్య‌క్తిత్వాన్ని.. అమ్మ లాంటి దాతృత్వాన్ని కూడా అలాగే చూపించాడు ద‌ర్శ‌కుడు. చివ‌రికి ఆమె సాయం చేసిన వాళ్లు కూడా ప‌ట్టించుకోక‌పోవ‌డం నిజంగా శోచ‌నీయం. ఆమె కూడా ఆత్మ‌గౌర‌వాన్ని నింపుకుని సాయం కోసం వేచి చూడ‌కుండా అలాగే చ‌నిపోవ‌డం ఆమె గొప్ప‌తనానికి నిద‌ర్శ‌నం. 

న‌టీన‌టులు: సావిత్రి లాంటి మ‌హాన‌టి బ‌యోపిక్ తీయాల‌ని ఆలోచ‌న వ‌చ్చిన‌పుడు.. ఆమె పాత్ర‌లో ఎవ‌రు న‌టిస్తారు.. అంత గొప్ప న‌టి ఎవ‌రున్నారు అనే అనుమానం అంద‌రికీ వ‌స్తుంది. దానికి నేనున్నానంటూ పూర్తిస్థాయి న్యాయం చేసింది కీర్తిసురేష్. సావిత్రి అంత గొప్ప‌గా న‌టించ‌లేదేమో కానీ.. ఆమె హావ‌భావాల‌ను మాత్రం అచ్చంగా దించేసింది. నిజంగా సావిత్రి ఇలాగే న‌టించేదేమో అనేంత‌గా మారిపోయింది. ఇక జెమినీ గ‌ణేష‌న్ పాత్ర‌లో దుల్క‌ర్ స‌ల్మాన్ కూడా ఒదిగిపోయాడు. ఆయ‌న పాత్ర‌లో చాలా వేరియేషన్స్ ఉన్నాయి. హీరో ఛాయ‌లు ఉన్న విల‌న్ అత‌డు. ప్రేమ ఓకే.. పెళ్లి కాదు అనే భావ‌జాలం ఉన్న పాత్ర అది. అందులో చ‌క్క‌గా న‌టించాడు దుల్క‌ర్. స‌మంత జ‌ర్న‌లిస్ట్ పాత్ర‌లో మెప్పించింది. క్లైమాక్స్ లో ఆమె న‌ట‌న అద్భుతం. విజయ్ దేవ‌రకొండ బాగా చేసాడు. ప్ర‌కాశ్ రాజ్.. క్రిష్.. త‌రుణ్ భాస్క‌ర్.. సందీప్ రెడ్డి వంగా.. నాగ‌చైత‌న్య‌.. మోహ‌న్ బాబు.. రాజేంద్ర ప్ర‌సాద్.. ఇలా ఒక్క‌రేంటి సినిమాలో ప్ర‌తీ ఒక్క‌రూ త‌మ పాత్ర‌ల‌కు ప్రాణం పోసారు. 

టెక్నిక‌ల్ టీం: మ‌హాన‌టికి అతిపెద్ద ప్ల‌స్ మిక్కీ జే మేయ‌ర్ సంగీతం. పాట‌లే కాదు.. ఆర్ఆర్ కూడా అద్భుతంగా ఇచ్చాడు మిక్కీ. ఇక డాని సినిమాటోగ్ర‌ఫీ కూడా చాలా బాగుంది. ముఖ్యంగా విజువ‌ల్స్ బాగా కుదిరాయి. సాయిమాధ‌వ్ బుర్రా మాట‌లు అద్భుతంగా కుదిరాయి. ఆడ‌వాళ్ళ ఏడుపు ప్ర‌పంచ‌మంతా చూస్తుంది.. మ‌గాళ్ల ఏడుపు మాత్రం మందు గ్లాసు మాత్ర‌మే చూస్తుంది అనే ఛ‌లోక్తులు కూడా బాగా రాసాడు బుర్రా. ఇక నాగ్ అశ్విన్ గురించి ఎంత చెప్పినా త‌క్కువేనేమో..! 30 ఏళ్లు కూడా స‌రిగ్గా లేని ఈ కుర్రాడు సావిత్రిని ఇంత బాగా ఎలా అర్థం చేసుకున్నాడ‌బ్బా అనిపిస్తుంది సినిమా చూసిన త‌ర్వాత‌. అంత అద్భుతంగా తెర‌కెక్కించాడు. 

చివ‌ర‌గా:  మ‌హాన‌టి.. మ‌న‌సు గెలిచే మ‌ధుర జ్ఞాప‌కం..

రేటింగ్: 3.5/5

More Related Stories