English   

18 ఏళ్ల మురారి...స్పెషల్ స్టోరీ !

Mahesh Babu Murari Movie Special story
2019-02-18 08:11:32

1999లో కె.రాఘవేంద్రరావు బీఏ దర్శకత్వంలో రాజకుమారుడు సినిమా ద్వారా హీరోగా పరిచయమైన కృష్ణ నట వారసుడు మహేష్ బాబు, హీరోయిన్లని సైతం పక్కు నెట్టే అందంతో అందరినీ ఆకట్టుకుని ఆరంభంలోనే ఓ మంచి మార్కులు కొట్టేశాడు. రెండో సినిమా యువరాజులో అయితే ఏకంగా ఓ బాబుకి తండ్రిగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. అయితే ఆ తరువాత నమ్రతతో జత కట్టిన మహేష్ వంశీ గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా కూడా ఆశించిన ఫలితం ఇవ్వలేదు. ఆపై వచ్చిన మురారి తన కెరీర్‌కి కీలకమైన మలుపు. మహేష్ బాబు అంటే కేవలం అందగాడు మాత్రమే కాదని, నవరసాలు పలికించగల నటుడని ఈ సినిమా ద్వారానే జనానికి తెలిసిందన్న మాట. అప్పటి వరకూ రెగ్యులర్‌ కమర్షియల్‌ సినిమాల్లో నటిస్తున్న మహేష్‌ బాబులోని నటుడు అనే కోణాన్ని వెలికి తీసిన చిత్రం మురారి. కుటంబ కథ నేపథ్యంతో వచ్చిన ఆ సినిమా ఆ సమయంలో సూపర్‌ హిట్‌గా నిలిచింది. ముఖ్యంగా ఆ సినిమాలోని ‘అలనాటి రామచంద్రుడి’ పాట ఈనాటికి కూడా ప్రతి పెళ్లి వేడుకలోనూ వినిపిస్తుందంటే ఆ క్రేజ్ అర్ధం చేసుకోవచ్చు.  అలా మురారీ మహేష్‌ కెరీర్‌ లో ప్రత్యేకంగా నిలిచి ఒకమెట్టు పైకి ఎక్కించి ఫ్యామిలీ ఆడియన్స్‌కు మరింత దగ్గరచేసింది. అలాంటి మురారి సినిమా విడుదలయి నేటికి 18 సంవత్సరాలు అయిన సందర్భంగా ఆ సినిమా మీద ఒక స్పెషల్ స్టోరీ.
మహేష్ బాబు అయితే 104 డిగ్రీల జ్వరంలో కూడా గోదావరి ఒడ్డున “డుం డుం డుం నటరాజు ఆడాలి” పాట, వాటర్ ఫైట్ చేశాడట. వీటికి సినిమాలో ఎటువంటి స్పందన లభించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అనుకుంటా !.
అలాగే అకేలా క్రేన్ అనే స్పెషల్ పరికరాన్ని వాడిన రెండో తెలుగు సినిమా ఇది. ఈ పాటను కొవ్వూరులోని గోదావరి ఒడ్డున తీశారు. అక్కడ జరిగిన వాటర్ ఫైట్ కు కూడా ఇదే క్రేన్ ను ఉపయోగించి చిత్రీకరించారు.
సినిమాలో చాలా కీలమయినవి అందులోని గుడిలో సీన్లు మూడు తరాల నేపథ్యానికి సంబంధించిన సీన్స్ అక్కడే తీయాలి. అంటే చాలా పురాతనమైంది కావాలి. ఇప్పట్లో లాగా అప్పుడు ఇంటర్నెట్ అందుబాటులో లేవు కాబట్టి, చాలా ఎంక్వైరీలు చేసి శంషాబాద్ శ్రీ రామ చంద్ర స్వామి గుడికి ఫిక్సయ్యారు. అక్కడ కావాల్సిన ఏనుగుని కేరళ నుంచి తెప్పించారు.
నేటి స్టార్ ఫైట్ మాస్టర్ గా ఉన్న పీటర్ హెయిన్స్ కు ఇదే మొదటి సినిమా, సముద్రం సినిమాకు కనల్ కణ్ణన్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేస్తున్నప్పుడు అతని పనితనం నచ్చిన కృష్ణవంశీ ఈ సినిమా ఆఫరిచ్చారు.
హస్యనటుడు చిత్తజల్లు లక్ష్మిపతికి ఇదే తొలిచిత్రం. ఆయన సోదరుడు శోభన్ ఈ సినిమాకు సహాయ దర్శకుడు కావడంతో అన్నాను సినిమాలో భాగం చేశాడు. ఈ సినిమాలో ఆయన నటనకి చాలా మంచి పేరు వచ్చింది.
క్లైమాక్స్ లో ఒక కీలక రోల్ కోసం ఎవరైనా సీనియర్ నటుడుంటే బాగుంటుందనుకున్నారు కృష్ణ వంశీ. దానవీరశూరకర్ణలో శకునిగా చేసి ఆ తర్వాత సినిమాలకి దూరం అయ్యారన్న ధూళిపాళ గారి దగ్గరకు కృష్ణవంశీ వెళ్లి ఒప్పించారు. ఆ ప్రీక్లైమాక్స్ ఎపిసోడ్ అంత అద్భుతంగా పండిందంటే అందులో ఈయన వంతు కూడా ఉంది.

More Related Stories