English   

మరోసారి శ్రీమంతుడు మ్యాజిక్...వర్కౌట్ అవుతుందా

 Mahesh
2019-12-14 13:07:23

ఈ ఏడాది వేసవిలో మహర్షి సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు మరో సారి సక్సెస్ మీద కన్నేసి హిట్స్ తప్ప ఫ్లాప్స్ అనేవే లేని అనిల్ రావిపూడి దర్శకత్వంలో "సరిలేరు నీకెవ్వరు" సినిమా చేస్తున్నాడు. దాదాపు షూటింగ్ అంతా పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ చేసుకుంటోంది. ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ కానుండగా సినిమా మీద అంచనాలు భారీగా నెలకొన్నాయి. ఇటీవల విడుదలైన సాంగ్స్ కి కూడా పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చాయి. అయితే ఈ సినిమా తర్వాత మహేష్ చేయబోయే సినిమా అంటూ చాలా సినిమాల మీద ప్రచారం జరిగింది. పరశురామ్ అని ఒకసారి, లేదు సందీప్ రెడ్డి అని ఒక సారి ఇలా రకరకాల ప్రచారాలు కూడా జరిగాయి. అయితే తాజా ప్రచారం ప్రకారం తన తర్వాతి సినిమా మహేష్ తోనే సినిమా అంటూ వంశీ పైడిపల్లి అఫీషియల్ ఎనౌన్స్మెంట్ ఇవ్వడంతో ఇక క్లారిటీ వచ్చేసినట్టయింది. ఇకపోతే ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కకముందే మరో ప్రచారం మొదలయ్యింది. ఈ సినిమాలో మహేష్‌ సరసన శ్రుతిహాసన్‌ను ఫైనల్ చేసిందట సినిమా యూనిట్. వీరిద్దరూ గతంలో శ్రీమంతుడు సినిమాలో నటించగా ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది. అందుకే మళ్లీ ఈ జంట తెరపైకి తెచ్చారని అంటున్నారు. శ్రుతి కొన్నాళ్లగా సినిమాల నుండి బ్రేక్ తీసుకుని మళ్లీ ఇప్పుడు తెరపై మెరిసేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం ఆమె తమిళ్‌లో ‘లాబం’తో పాటు తెలుగులో రవితేజతో ‘క్రాక్‌’ సినిమాలో నటిస్తోంది. ఈ విషయం మీద స్పష్టత రావాలంటే మాత్రం అధికారిక ప్రకటన వచ్చే వరకూ వేచి చూడక తప్పదు.

More Related Stories