English   

రికార్డులకు గ్యాంగ్ లీడ‌ర్.. అవార్డులకు అన్న‌య్య‌..

Megastar Chiranjeevi King of Telugu Film Industry
2018-08-22 06:44:50

తెలుగు సినిమా చ‌రిత్ర‌లో ఆయ‌నో సంచ‌ల‌నం. ఏ అండ లేకుండా వ‌చ్చి.. ఎన్నో కోట్ల మందికి ఆద‌ర్శంగా మారిన సుప్రీమ్ హీరో అత‌డు. ఒక‌ప్పుడు ఆయ‌న కోట్ల‌లో ఒక్క‌డు.. అత‌డి స్వ‌యంకృషే చేసింది కోటికి ఒక్క‌డు. న‌ట‌న‌లో మ‌గ‌ధీరుడు.. అందుకే ప్రేక్ష‌కుల గుండెల్లో ఖైదీ అయ్యాడు. అభిమానుల‌తో అన్న‌య్య అని పిలిపించుకున్నా.. మాస్ ఇమేజ్ లో గ్యాంగ్ లీడ‌ర్ అనిపించుకోవాల‌న్నా.. తెలుగు సినిమాను పాతికేళ్ల పాటు శాసించిన హిట్ల‌ర్ అయినా.. టాలీవుడ్ కు కొత్త లెక్క‌లు నేర్పించిన మాస్ట‌ర్ అయినా.. అభిన‌యంతో కంట‌త‌డి పెట్టించిన విజేత అయినా.. అన్నీ ఆయ‌నే.. హీరోలెంద‌రు ఉన్నా.. అగ్ర‌పీఠంపై కూర్చున్న ఇంద్రుడు ఆయ‌నే. ప‌దేళ్లు గ్యాప్ ఇచ్చి వ‌చ్చినా.. రికార్డులు ఆప‌ని ఎవ‌ర్ గ్రీన్ మెగాస్టార్. తెలుగు ఇండ‌స్ట్రీ చిరంజీవికి ముందు.. త‌ర్వాత అనేంత‌గా మార్చేసాడు మెగాస్టార్.

ఎన్టీఆర్.. ఏఎన్నార్.. శోభ‌న్ బాబు.. కృష్ణ లాంటి హేమాహేమీల మ‌ధ్య‌లో అనామ‌కుడిగా వ‌చ్చి.. అసామాన్యుడిగా ఎదిగాడు మెగాస్టార్. ఒక్కో ఇటుక పేర్చి ఇళ్లు క‌ట్టిన‌ట్లు.. ఒక్కో సినిమాతో అభిమాన గ‌ణాన్ని పెంచుకున్నాడు. అభిమానుల గుండెల్లో త‌న‌కంటూ ఓ క‌లల సౌధాన్ని నిర్మించుకున్నాడు చిరంజీవి. తొలి నాళ్ల‌లో పునాది రాళ్లు.. ఇంట్లో రామ‌య్యా వీధిలో కృష్ణ‌య్యా.. న్యాయం కావాలి లాంటి హిట్ సినిమాలు చేసిన చిరు.. ఖైదీతో స్టార్ అయ్యాడు. ఆ త‌ర్వాత ఏడాదికో ఇండ‌స్ట్రీ హిట్ ఇస్తూ సుప్రీమ్ హీరో అయ్యాడు. ప‌సివాడి ప్రాణంతో తొలిసారి తెలుగు ఇండ‌స్ట్రీకి 5 కోట్ల మార్క్ చూపించాడు చిరంజీవి. ఆ త‌ర్వాత య‌ముడికి మొగుడు.. అత్త‌కు య‌ముడు అమ్మాయికి మొగుడు సినిమాలు కూడా కొత్త రికార్డులు  సృష్టించాయి.

ఇక 90ల్లో జ‌గ‌దేక‌వీరుడు అతిలోక‌సుంద‌రి.. గ్యాంగ్ లీడ‌ర్.. ఘ‌రానామొగుడు.. రౌడీఅల్లుడు.. హిట్ల‌ర్.. మాస్ట‌ర్.. బావ‌గారు బాగున్నారా.. స్నేహం కోసం.. ఇలా ఎన్న‌ని చెప్పాలి..? ఇక మిలీనియం మొద‌ట్లోనే అన్న‌య్య లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ ఇచ్చాడు మెగాస్టార్. ఆ త‌ర్వాత ఇంద్ర‌.. ఠాగూర్.. శంక‌ర్ దాదా ఎంబిబిఎస్ లాంటి వ‌ర‌స విజ‌యాలు అందించాడు. శంక‌ర్ దాదా జిందాబాద్ త‌ర్వాత రాజ‌కీయాల్లోకి వెళ్లి.. అక్క‌డ ఆశించిన విజ‌యాన్ని అందుకోలేక‌పోయాడు చిరంజీవి. మ‌ళ్లీ ప‌దేళ్ళ త‌ర్వాత ఖైదీ నెం.150తో రీ ఎంట్రీ ఇచ్చి.. త‌న ఛ‌రిష్మా ఏం త‌గ్గ‌లేద‌ని నిరూపించుకున్నాడు మెగాస్టార్. తాను సినిమాల్లో ఎప్ప‌టికీ కింగ్ అని ప్రూవ్ చేసుకున్నాడు. బాహుబ‌లి కాకుండా 100 కోట్లు షేర్ సాధించిన తొలి హీరోగా చ‌రిత్ర సృష్టించాడు. ఇక ఇప్పుడు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి జీవిత‌క‌థతో తెలుగుతో పాటు త‌మిళ‌, హిందీ ఇండ‌స్ట్రీల‌ను కూడా ప‌ల‌క‌రించ‌బోతున్నాడు మెగాస్టార్. ఈయ‌న ప్ర‌య‌త్నం విజ‌యవంతం కావాల‌ని.. చిరు మ‌రెన్నో పుట్టిన‌రోజులు ఇలాగే జ‌రుపుకోవాల‌ని ఆశిస్తూ.. హ్యాపీ బ‌ర్త్ డే టూ మెగాస్టార్ చిరంజీవి.

More Related Stories