English   

 మెహ‌బూబా రివ్యూ

Mehbooba-Review
2018-05-11 13:20:57

పూరీ జ‌గ‌న్నాథ్ అంటే తెలుగులో ఓ ఇమేజ్ ఉంది. ఆయ‌న సినిమాల‌కు క్రేజ్ ఉంది. ఒక‌ప్పుడు ట్రెండ్ సెట్టింగ్ సినిమాలు చేసిన ద‌ర్శ‌కుడు పూరీ. కానీ ఇప్పుడు ఆయ‌న‌కు టైమ్ బాలేదు. ఇలాంటి స‌మ‌యంలో కొడుకును హీరోగా లాంఛ్ చేస్తూ మెహ‌బూబా చేసాడు. మ‌రి ఈ చిత్రం నిజంగానే పూరీ ఈజ్ బ్యాక్ అనిపించిందా..? 

క‌థ‌: రోష‌న్ (ఆకాశ్) కు దేశం అంటే పిచ్చి. ఎప్ప‌టికైనా ఆర్మీలో చేరాల‌నేది అత‌డి క‌ల‌. అలాగే త‌న క‌ల‌లో ప్ర‌తీరోజు వ‌స్తున్న ఓ అమ్మాయిని ఎప్ప‌టికైనా క‌లుసుకోవాల‌ని ఆశ ప‌డుతుంటాడు. అచ్చంగా ఇలాగే పాకిస్థాన్ లో ఆఫ్రీన్ (నేహాశెట్టి) బాధ ప‌డుతుంటుంది. చిన్న‌ప్ప‌ట్నుంచీ ఈ ఇద్ద‌రికి ఒకే ర‌క‌మైన క‌ల‌లు వ‌స్తుంటాయి. అదే టైమ్ లో ఆఫ్రీన్ హైద‌రాబాద్ కు చ‌దుకోడానికి వ‌స్తుంది. ఆమెను ఓ ప్ర‌మాదం నుంచి కాపాడ‌తాడు రోష‌న్. కానీ కాపాడింది త‌ను వెతుకుతున్న అమ్మాయినే అని తెలుసుకోలేక‌పోతాడు. త‌ర్వాత ఓ సారి హిమాల‌యాల‌కు స్నేహితుల‌తో క‌లిసి ట్రెక్కింగ్ కు వెళ్లిన‌పుడు అక్క‌డ ఓ అమ్మాయి శ‌వం చూస్తాడు రోష‌న్. అది త‌ను కాపాడిన ఆఫ్రీన్ ది కావ‌డంతో షాక్ అవుతాడు. కానీ దాని వెన‌క గ‌త జ‌న్మ ర‌హ‌స్యం ఉంటుంది. అదేంట‌నేది అస‌లు క‌థ‌.. 

క‌థ‌నం: మాఫియా.. పోలీసులు.. డాన్ లు.. వీటికి దూరంగా కొడుకును ఇండ‌స్ట్రీకి తీసుకురావాల‌ని ముందే అనుకున్న‌ట్లున్నాడు పూరీ. అందుకే కొడుకు కోసం కొత్త‌గా ట్రై చేసాడు. ఎప్పుడో ప్రేమ‌క‌థ‌లు రాయ‌డం మానేసిన పూరీ.. చాలా రోజుల త‌ర్వాత అటు వైపు అడుగేసాడు. కానీ అది అంతా స‌క్సెస్ ఫుల్ గా అనిపించ‌లేదేమో అనిపించింది. ఫ‌స్టాఫ్ లో లవ్ సీన్స్ ఎక్క‌డా రాసుకోలేదు పూరీ. కానీ అటు అమ్మాయి.. ఇటు అబ్బాయి ఎప్పుడెప్పుడు క‌లుస్తారా అనే ఆస‌క్తి మాత్రం పెంచేసాడు. చూసుకునేంత వ‌ర‌కు ఆస‌క్తి పుట్టించినా.. చూసుకున్న త‌ర్వాత ఆ టెంపో మాత్రం మిస్ అయింది. గ‌త‌జ‌న్మ అంటే ఏదో మ‌గ‌ధీర రేంజ్ లో ఊహించుకుంటే పొర‌పాటే. ఇది పూరీ జ‌గ‌న్నాథ్ సినిమా క‌దా.. ఇక్క‌డ ఉండేవ‌న్నీ గ‌న్నులు.. గుళ్లే. 1971 ఇండో పాక్ వార్ సీన్స్ కూడా అల‌రించ‌లేక‌పోయాయి. ప్రేమ స‌న్నివేశాలు అక్క‌డ క‌నిపించినా.. చూపించేంత స్కోప్ మాత్రం లేదు. శివ‌మ‌ణి స్క్రీన్ ప్లే ఇక్క‌డ కూడా వాడుకున్నాడు ద‌ర్శ‌కుడు. ప్రేమికులు క‌లుసుకోవాల‌నే త‌ప‌న ఇందులోనూ ఉంటుంది. అక్క‌డ బాటిల్ రాసిన ప్రేమ‌క‌థ అయితే.. ఇక్క‌డ శవాన్ని చూపించి ఆస‌క్తి పెంచేస్తాడు. సెకండాఫ్ లో యుద్ధం జ‌రిగేట‌ప్పుడు కానీ.. ఆ త‌ర్వాత కానీ క‌థ‌నంలో వేగం ఉండ‌దు. క్లైమాక్స్ లో కూడా వేగం పెర‌గ‌లేదు స‌రిక‌దా.. తాను తీసిందే సినిమా అన్న‌ట్లుగా ఉంది. 

న‌టీన‌టులు: ఆకాశ్ పూరీ బాగా న‌టించాడు. చిన్న‌ప్ప‌ట్నుంచీ న‌టించ‌డం వ‌ల్లో ఏమో కానీ కెమెరా అంటే భ‌యం, బెరుకు రెండూ క‌నిపించ‌లేదు. బెస్ట్ ప‌ర్ఫార్మెన్స్ ఇచ్చాడు. సైనికుడిగా.. ప్రేమికుడిగా. కానీ క‌థ ఈయ‌న‌కు స‌హ‌క‌రించ‌లేదు. నేహాశెట్టి స‌ర్ ప్రైజ్ ప్యాకేజ్. చాలా బాగుంది.. అభిన‌యంతో స‌హా. ఇక హీరో తండ్రిగా సాయాజీ షిండే.. హీరోయిన్ తండ్రి పాకిస్థానీగా ముర‌ళీ శ‌ర్మ ప‌ర్లేదు. మిగిలిన వాళ్లంతా కొత్త మొహాలే. అంతా క‌థ‌లో అప్పుడ‌ప్పుడూ వ‌చ్చి వెళ్లే కారెక్ట‌ర్స్. 

టెక్నిక‌ల్ టీం: సందీప్ చౌతా చాలా రోజుల త‌ర్వాత తెలుగు ఇండ‌స్ట్రీకి వ‌చ్చాడు. రెండు పాట‌లు బాగున్నాయి. విజువ‌ల్ గా కూడా బాగా చిత్రీక‌రించాడు ద‌ర్శ‌కుడు పూరీ. జునైద్ సిద్ధిఖీ ఎడిటింగ్ ప‌ర్లేదు. సెకండాఫ్ లో చాలా సీన్లు బోర్ కొట్టించాయి. ఇక విష్ణు శ‌ర్మ సినిమాటోగ్ర‌ఫీ బాగుంది. రిచ్ గా ఉంది ప్ర‌తీ విజువ‌ల్ కూడా. పూరీ క‌నెక్ట్స్ నిర్మాణ విలువ‌లు కూడా బాగున్నాయి. కొడుకే క‌దా అని బాగా ఖ‌ర్చు చేసాడు పూరీ జ‌గ‌న్నాథ్. ఇక ద‌ర్శ‌కుడిగా ఆయ‌న మ‌రోసారి ఫెయిల్ అయ్యాడు. అయితే ర‌చ‌యిత‌గా మాత్రం అక్క‌డ‌క్క‌డా త‌న మార్క్ పంచులు చూపించాడు. ముఖ్యంగా ఫ‌స్టాఫ్ లో వ‌చ్చే కొన్ని డైలాగ్స్ వింటేజ్ పూరీని చూపించాయి. ఓవ‌రాల్ గా డిఫెరెంట్ సినిమా చేసాడు కానీ క‌మ‌ర్షియ‌ల్ సినిమా మాత్రం కాదు.

చివ‌ర‌గా: మెహ‌బూబా.. పూరీకి మ‌ళ్లీ దెబ్బ‌న‌బ్బా..!

రేటింగ్: 3/5

More Related Stories