English   

మహానటిలో ఎస్వీ రంగారావును చూశారా..?

mohanbabu-SVR
2018-05-06 18:23:25

మహానటి మాయ మొదలైంది. మెల్లగా ఒక్కో పాత్రా బయటకు వస్తోంది. మహానటి పాత్రలో ఇప్పటికే కీర్తి సురేష్ ఒదిగిపోయింది. ఆమె భర్తగా దుల్కర్ పర్ఫెక్ట్ గా సూట్ అయ్యాడు. మరి ఈ నెల 9న విడుదల కాబోతోన్న మహానటి మరింత మాయలు చేయబోతోంది. అలనాటి మేటి నటులు, టెక్నీషియన్స్ ను మరోసారి మనకు సజీవంగా చూపించబోతోంది.  మహానటికి పర్యాయపదం సావిత్రి. తన అసమాన నటనతో పరిశ్రమతో పాటు ప్రేక్షకుల చేతా మహానటి అనిపించుకున్న ఆ పదానికున్న గౌరవాన్ని పదింతలు పెంచిన మేటి నటి. ఆమె జీవితంలో ఎన్నో మలుపులున్నాయి. వెండితెరపై కంటే ఎక్కువగా కన్నీళ్లున్నాయి. అంతకు మించిన ఆనందాలూ ఉన్నాయి. ఇప్పుడు రాబోతోన్న మహానటిలో ఆమె ఆనందాల్నే ఎక్కువగా చూపించబోతున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో నటించే ఇతర పాత్రల విషయంలో ఇప్పటి వరకూ కొందరి పేర్లు తెలుసు. మరి వారి పరిచయం ఎలా ఉంటుందా అనుకున్న వారికి ఇదుగో ఇలా నాని వాయిస్ ఓవర్ లో మన కెవి రెడ్డిగారిని పరిచయం చేశారు. మరి ఆ కెవిరెడ్డి పాత్రలో కనిపిస్తున్నది ఎవరో తెలుసా. దర్శకుడు క్రిష్. అచ్చంగా అదే మేకోవర్ తో కనిపిస్తోన్న క్రిష్ భలే ఉన్నాడు. 
 
అలాగే సావిత్రిని హీరోయిన్ గా పరిచయం చేసి.. మిస్సమ్మ వంటి అపురూప చిత్రంలో నటింప చేసిన దర్శకుడు ఎల్వీ ప్రసాద్ పాత్రలో ఎవరు కనిపిస్తున్నారో తెలుసా.. అవసరాల శ్రీనివాస్. యస్.. ఎల్వీ ప్రసాద్ గా అవసరాల కూడా అద్భుతంగా కుదిరిపోయాడు. అయితే సావిత్రికి స్టార్డమ్ ను డబుల్ చేసిన సినిమా మాయా బజార్. ఈ సినిమాలో అప్పటికే మేటి నటుడుగా పేరు తెచ్చుకున్న ఎస్వీ రంగారావును అభినయిస్తూ తను చేసిన నటన మరపురానిది. అలాంటి ఎస్వీ రంగారావుగా మోహన్ బాబు నటిస్తున్నాడని అందరికీ తెలుసు. కానీ ఆయనెలా ఉంటాడా అనుకున్నవారికి ఇదుగో ఇలా అంటూ మోహన్ బాబు, సారీ ఎస్వీఆర్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసింది టీమ్. ఎస్వీఆర్ గా మోహన్ బాబు అతికినట్టు సరిపోయాడంటే నమ్మండి. 

ఇక మరో దర్శకుడు సింగీతం శ్రీనివాసరావుగా పెళ్లి చూపులు దర్శకుడు తరుణ్ భాస్కర్ నటిస్తున్నాడు.  ఇంకా ప్రకాష్ రాజ్ కూడా ఉన్నాడు. సమంత, విజయ్ దేవరకొండ ముందు నుంచీ కనిపిస్తున్నారు. నాగేశ్వరరావుగా నాగ చైతన్య నటించాడు. మరి ఎన్టీఆర్..? ఇదే ఇప్పుడు అందరినీ తొలుస్తోన్న ప్రశ్న. నిజానికి ఎన్టీఆర్ క్యారెక్టర్ ను కావాలనే దాచారు అని చెబుతున్నారు. కానీ ఆ పాత్ర పోషించింది మన నేచురల్ స్టార్ అని అని ఆ మధ్య ఆడియో ఫంక్షన్ లోనే హింట్ ఇచ్చారు. సో.. నటరత్న పాత్రలో నేచురల్ స్టార్ ఎలా ఉంటాడా అనే క్యూరియాసిటీ ఇప్పుడు అందర్లోనూ పెరిగిపోయింది. 
ఏదేమైనా అలనాటి ఆరాధ్య నటులంతా మహానటి పుణ్యమా అని మరోసారి కనిపించబోతున్నారు. ఆ జ్ఞాపకాల్లోకి తీసుకువెళ్లబోతున్నారు. అన్నీ కుదిరితే మాత్రం ఖచ్చితంగా ఇది కూడా చరిత్రలో ఓ క్లాసిక్ గా నిలిచేలానే ఉంది. 

More Related Stories