మోసగాళ్లు రివ్యూ

నటీనటులు : మంచు విష్ణు, కాజల్, సునీల్ శెట్టి, నవదీప్, నవీన్ చంద్ర, రాజా రవీంద్ర తదితరులు
నిర్మాణ సంస్థ : ఏవీఏ ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ
కథ, నిర్మాత : మంచు విష్ణు
దర్శకత్వం : జెఫ్రీ గీ చిన్
సంగీతం : సామ్ సి.ఎస్
సినిమాటోగ్రఫీ : షెల్డన్ చావ్
ఎడిటర్ : గౌతమ్ రాజు
కథ: అను (కాజల్), అర్జున్ వర్మ (మంచు విష్ణు) అక్కా తమ్ముళ్లు కటిక పేదరికం మధ్య పెరుగుతారు. తండ్రి (తనికెళ్ల భరణి) అతి నిజాయతీ వల్లే తమకీ దుస్థితి అని నమ్మి, ఉన్నవాడిని మోసం చేసైనా పైకి ఎదగాలనుకుంటారు.ఈ క్రమంలోనే విజయ్ (నవదీప్)తో కలిసి ఒక కాల్ సెంటర్ ను ఏర్పాటు చేసి.. ఓ నయా మోసానికి తెర లేపుతాడు అర్జున్. ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్ పేరుతో అమెరికన్లకు ఫోన్ చేసి దాదాపు రూ.2,600 కోట్లు కొట్టేస్తారు.భారీ మోసాన్ని ఆలస్యంగా తెలుసుకున్న ఫెడరల్ ట్రేడ్ కమిషన్, భారత ప్రభుత్వం విచారణ కోసం ఎసీపీ కుమార్ (సునీల్ శెట్టి) నియమిస్తుంది. ఈ మోసగాళ్లను పట్టుకోవడానికి డీసీపీ కుమార్ భాటియా (సునీల్ శెట్టి) ఎలాంటి ఎత్తులు వేశారు? ఆయన నుంచి తప్పించుకోవడానికి అక్కా తమ్ముళ్లు ఎలాంటి పైఎత్తులు వేశారన్నది మిగతా చిత్ర కథ.
కథనం: మంచు విష్ణు ఎంచుకున్న ఈ పాయింట్లోనే ఓ కొత్తదనం ఉంది. హైదరాబాద్‌లోని ఓ చిన్న బస్తీలో ఉండే ఒక అక్కా తమ్ముడు కలిసి వేల మంది అమెరికన్లను ఎలా బురిడీ కొట్టించారు.. ఇందుకోసం వాళ్లు టెక్నాలజీని ఎలా వాడుకున్నారు.. తమ తెలివి తేటలతో అందరినీ విస్మయ పరస్తూ వేల కోట్ల సొమ్ము ఎలా దోచుకున్నారు.. ఇలా కథలో థ్రిల్ చేసే అంశాలు చాలా ఉన్నాయి. కానీ, దాన్ని తెరపై ఎలా థ్రిల్లింగ్ చూపించారు అనేదే ముఖ్యం. దానిపైనే సినిమా విజయం ఆధారపడుతుంది. ఈ విషయంలో చిత్ర దర్శకుడు కాస్త తడబడినట్టు అనిపిస్తోంది. మధ్య మధ్యలో కొన్ని రొమాంటిక్ సీన్స్.. మరికొన్ని ఫ్యామిలీ సెంటిమెంట్ ఎపిసోడ్లతో కథ.. దూకుడుకు కళ్లెం వేశాయి. మరోవైపు ఈ గ్యాంగ్ ఆటలు కట్టించేందుకు డీఎస్పీ కుమార్ వేసే ఎత్తులు కూడా రొటీన్‌గానే ఉంటాయి. అయితే క్లైమాక్స్‌లో సునీల్ శెట్టి, మంచు విష్ణులకి మధ్య వచ్చే యాక్షన్ ఎపిసోడ్ బాగుంటుంది.. ప్రీ ఇంటర్వెల్ సీన్స్, క్లైమాక్స్ హైలైట్.
నటీనటులు: అర్జున్ పాత్రలో మంచు విష్ణు ఒదిగిపోయాడు. తెరపై ఇంతవరకూ చూడని విష్ణుని ఈ సినిమాలో చూడొచ్చు.సునీల్ శెట్టి నటన బాగున్నా.. ఆయనలోని నటుడికి సవాల్ విసిరే ఒక్క సన్నివేశమూ కనిపించదు. అను పాత్రలో కాజల్ కనిపించిన విధానం బాగుంది. ఇక నవీన్ చంద్ర, నవదీప్, వైవా హర్ష పాత్రలు పరిధి మేర ఆకట్టుకుంటాయి.
టెక్నికల్ టీం: ఈ సినిమాకు ప్రధాన బలం సామ్ సి.ఎస్ నేపథ్య సంగీతం. కొన్ని సన్నివేశాలకు తన బీజీఎంతో ప్రాణం పోశాడు. రొటీన్ కథలకు బిన్నంగా ఉన్న ఈ మూవీలో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కాస్త థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. సినిమాటోగ్రఫి, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.
చివరగా: మోసగాళ్ల మోసాలకి థ్రిల్లింగ్ మిస్సయింది..!!
రేటింగ్: 2.5/5.