English   

సినిమా థియేటర్స్ బంద్ తప్పదా..?

movie theaters bandh
2018-02-23 17:21:52

ఇప్పుడు ఏ నోట విన్నా ఇదే మాట.. సినిమా పరిశ్రమ చేస్తోన్న బంద్ జరుగుతుందా లేదా..? అని. గత కొన్నాళ్లుగా డిజిటల్ సిస్టమ్ పై దక్షిణభారత సినిమా పరిశ్రమలో గొడవలు నడుస్తున్నాయి. ప్రపంచంలో ఎక్కడా లేని రేట్ సౌత్ సినిమా వారి నుంచి డిజిటల్ సినిమా సిస్టమ్ ను శాసిస్తోన్న క్యూబ్, యూఎఫ్ఓ డిజిటల్ వారు వసూలు చేస్తున్నారు. ఈ విషయంపై రేట్లు తగ్గించాలని చాలాసార్లు వారిని అడిగారు. వినలేదు సరికదా యేటికేడు రేట్లు పెంచుకుంటూనే పోతున్నారు. ఒకప్పుడున్న విధానంతో పోలిస్తే డిజిటల్ సిస్టమ్ వల్ల ఖర్చు తగ్గుతుందని అన్ని థియేటర్స్ ఈ వైపుకు వస్తే.. వీళ్లు దాన్ని ఆసరగా చేసుకుని ఏకంగా వేలాది కోట్లు సంపాదిస్తున్నారు. దీంతో చిన్న సినిమాలు విపరీతంగా పెద్ద సినిమాలు ఓ మోస్తరుగా నష్టపోతున్నాయి. అసలే అంతంత మాత్రంగా ఉన్న సక్సెస్ రేట్ కు ఈ సిస్టమ్ తో మరిన్ని ఇబ్బందులు వస్తున్నాయి. దీంతో ఈ విధానాన్ని పునస్సమీక్షించాలని చాలా రోజులుగా సౌత్ సినిమా పెద్దలు కోరుతూ వస్తున్నా వారు వినడం లేదు. ఈ నేపథ్యంలో సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఎగ్జిబిటర్స్ అంతా కలిసి జాయింట్ యాక్షన్ కమిటీగా మారి.. మార్చి నుంచి థియేటర్స్ బంద్ కు పిలుపునిచ్చారు.

ఇక ఈ బంద్ విషయంలో పరిశ్రమలన్నీ సీరియస్ గా ఉండటంతో ఇవాళ బెంగళూరులో చర్చలకు వేదిక నిర్ణయించారు. కానీ ఈ చర్చలు కూడా ఫలితాన్నిచ్చేలా లేవు. జేయేసి చెబుతోన్న డిమాండ్స్ కు డిజిటల్ ప్రొవైడర్స్ గా ఉన్న క్యూబ్, యూఎఫ్ఓ అంగీకరించడం లేదు. దీంతో ఇకపై ఏ సినిమా వారు కూడా డిజిటల్ వారికి కంటెంట్ ఇవ్వకూడదని నిర్ణయించుకున్నాయి. దీంతో మార్చి 2 నుంచి అనుకున్న ప్రకారం అన్ని సినిమాల ప్రదర్శనలు నిలిపివేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ మేరకు జేఏసి తీసుకున్న నిర్ణయాలు, అక్కడ జరిగిన చర్చల వివరాలను ఫిల్మ్ చాంబర్ ప్రెసిడెంట్ మరికాసేపట్లో అనౌన్స్ చేస్తారు.. మరి మార్చి 2 ఎంతో దూరం లేదు కాబట్టి.. ఈ సమస్యకు వీలైనంత త్వరగా ఎవరూ నష్టపోకుండా ఒక సరైన నిర్ణయం తీసుకుంటే మంచిది. లేదంటే చాలా కుటుంబాలు వీధిన పడతాయి.. 

More Related Stories