English   

నా పేరు సూర్య రివ్యూ 

Naa-Peru-Surya-Review
2018-05-04 05:02:14

పాతికేళ్ల కింద ఇండ‌స్ట్రీకి వ‌చ్చి.. ఇన్నాళ్ల‌కు ద‌ర్శ‌కుడిగా మారాడు వ‌క్కంతం వంశీ. పైగా చాలా సినిమాల‌కు స‌క్సెస్ ఫుల్ క‌థ‌లు ఇచ్చాడు. త‌న సొంత సినిమా అంటే ఇంకెంత అనుభ‌వంతో రాసుకుని ఉంటాడు. ఆయ‌నే ఇప్పుడు త‌న క‌ల అయిన‌ నా పేరు సూర్య‌ను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చాడు. మ‌రి ఈయ‌న క‌ల నెర‌వేరిందా..? ప‌్రేక్ష‌కుల‌కు కూడా ఈయ‌న కల న‌చ్చిందా..? 

క‌థ‌: సూర్య‌(అల్లుఅర్జున్) ఆర్మీలో సైనికుడు. ఆయ‌న‌కు కోపం ఎక్కువ‌గా ఉంటుంది. ఓ టెర్ర‌రిస్ట్ ను ఆర్డ‌ర్స్ లేకుండా షూట్ చేస్తాడు. దాంతో ఆయ‌న్ని ఆర్మీ నుంచి స‌స్పెండ్ చేస్తాడు క‌ల్న‌ల్(బోమ‌న్ ఇరాని). కానీ అక్క‌డే ఉండి బోర్డ‌ర్ లో చ‌చ్చిపోవాల‌నేది సూర్య కోరిక‌. దాంతో అత‌డి గాడ్ ఫాద‌ర్ (రావు ర‌మేష్) వెళ్లి క‌ల్న‌ల్ తో మాట్లాడ‌తాడు. దానికి క‌న్విన్స్ అయిన క‌ల్న‌ల్ ఒక్క ష‌ర‌తుతో సూర్య‌కు అవ‌కాశం ఇస్తాడు. కానీ దానికి సైక్రియా ర్టిస్ట్ రామ‌కృష్ణంరాజు(అర్జున్) తో లింక్ ఉంటుంది. ఆ ప‌ని మీద వైజాగ్ వ‌చ్చిన సూర్య‌కు చ‌ల్లా(శ‌ర‌త్ కుమార్) తో గొడ‌వ మొద‌ల‌వుతుంది. మ‌రి ఈయ‌న ల‌క్ష్యం పూర్తి చేసాడు.. తిరిగి ఆర్మీలో చేరాడా.. అస‌లు ఈ రామ‌కృష్ణంరాజు ఎవ‌రు.. ఇవ‌న్నీ మిగిలిన క‌థ‌.. 

క‌థ‌నం: కెరీర్ లో ఎప్పుడూ ఏ సినిమా గురించి కూడా అంత గొప్ప‌గా చెప్పుకోని బ‌న్నీ.. తొలిసారి నా పేరు సూర్య గురించి చాలా గొప్ప‌గా చెప్పాడు. ఈ చిత్రం చేయ‌డం త‌న అదృష్టం అన్నాడు. ఇలాంటి క‌థ త‌న ద‌గ్గ‌రికి తీసుకొచ్చినందుకు వంశీకి కృత‌జ్ఞ‌త‌లు చెప్పాడు. కానీ వ‌క్కంతం మాత్రం త‌ను కూడా ఓ మామూలు ద‌ర్శ‌కున్నే అని చూపించాడు ఈ చిత్రంతో. బ‌న్నీ ఊహించినంత గొప్ప క‌థేం కాదు ఇది.. ఆయ‌న తెర‌కెక్కించిన తీరు కూడా అంత గొప్ప‌గా అనిపించ‌లేదు. స్క్రీన్ ప్లే బాగుండుంటే నిజంగానే బ‌న్నీ అన్న‌ట్లు గొప్ప సినిమా అయ్యుండేదేమో..? ఇప్పుడు అయితే కాదు. కానీ హానెస్ట్ అటెంప్ట్ అయింది. దానికి కూడా పూర్తి స్థాయి న్యాయం చేయ‌లేదు ద‌ర్శ‌కుడు. హానెస్ట్ అంటూనే మ‌ధ్య‌లో క‌మ‌ర్షియ‌ల్ దారులు తొక్కాడు వంశీ. దాంతో క‌న్ఫ్యూజ‌న్ మొద‌లైపోయింది క‌థ‌లో. తొలి 20 నిమిషాలు సినిమాను హై రేంజ్ లో మొద‌లుపెట్టాడు ద‌ర్శ‌కుడు. ఇదే స్పీడ్ కానీ ఇంకాసేపు ఉండుంటే సూర్య‌పై ఒపీనియ‌న్ మ‌రోలా ఉండేది. కానీ కాసేప‌టికే క‌థ‌లో వేగం త‌గ్గి.. కామెడీతో పాటు చిరాకు పుట్టించే రొమాన్స్ ఒక‌టి వ‌స్తుంది. ఫ‌స్టాఫ్ లో హీరో ల‌వ్ ట్రాక్ అంతా సిల్లీగా అనిపిస్తుంది. అవ‌స‌ర‌మైన‌పుడ‌ల్లా ఓ ఫైట్ వ‌చ్చింది. మ‌ధ్య‌లో అవ‌స‌రం లేక‌పోయినా పాట‌లు వ‌చ్చాయి. అదిరిపోయిందిరా అనుకునే సీన్స్ చాలా త‌క్కువ‌గా వ‌చ్చాయి. సెకండాఫ్ లో సాయికుమార్ సీక్వెన్స్ ను ఇంకా హై రేంజ్ లో ఊహిస్తాం కానీ దాన్ని తెర‌కెక్కించిన తీరు ఆక‌ట్టుకోలేదు. క్లైమాక్స్ ను దేశ‌భ‌క్తితో ముగించి త‌న క‌థ‌ను జ‌స్టిఫై చేసాడు ద‌ర్శ‌కుడు. 

న‌టీన‌టులు:  అల్లుఅర్జున్ ద‌ర్శ‌కున్ని బాగా న‌మ్మాడు. ఆయ‌న ఏం చెబితే అది చేసాడు. అందుకోస‌మే లుక్ తో పాటు బాడీలోకి సైనికుడిని కూడా బాగానే ఎక్కించుకున్నాడు. పూర్తిగా కొత్త‌గా క‌నిపించాడు. కానీ ఎందుకో అక్క‌డ‌క్క‌డా బ‌న్నీ ఈ పాత్ర‌కు స‌రిపోలేదేమో అనిపిస్తుంది. అన్ ఈజీగా మూవ్ అయ్యాడు ఇందులో. ఇక అను ఎమ్మాన్యువ‌ల్ కు చెప్పుకోడానికి ఏమీ లేదు పాట‌లు త‌ప్ప‌. అర్జున్ డిఫెరెంట్ గా ట్రై చేసాడు. ఆయ‌న పాత్ర కొత్త‌గా ఉంది. శ‌ర‌త్ కుమార్ విల‌న్ గా పెద్ద‌గా ఆక‌ట్టుకోలేదు. న‌దియా, రావు ర‌మేష్, పోసాని పాత్ర‌లు అలా వ‌చ్చెళ్ళిపోతాయంతే. 

టెక్నిక‌ల్ టీం: విశాల్ శేఖ‌ర్ మ్యూజిక్ కొత్త‌గా ఏం అనిపించ‌లేదు. కానీ బ్యాగ్రౌండ్ స్కోర్ బాగుంది. సైనికా పాట విజువ‌ల్ గా అదిరిపోయింది. దేశం కోసం సైనికులు ప‌డే క‌ష్టం ఎలా ఉంటుంద‌నేది క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లు చూపించాడు ద‌ర్శ‌కుడు. ఇక సినిమాటోగ్ర‌ఫీ బాగుంది. విజువ‌ల్స్ రిచ్ గా ఉన్నాయి. ఎడిటివ్ వీక్ గా అనిపించింది. చాలా సీన్లు బోర్ కొట్టించాయి. ఇక ద‌ర్శ‌కుడిగా వ‌క్కంతం అనుకున్న ముద్ర వేయ‌లేక‌పోయాడు. కానీ ర‌చ‌యిత‌గా మాత్రం ఆక‌ట్టుకున్నాడు. కొన్ని మాట‌లు అద్భుతంగా రాసాడు. ఓవ‌రాల్ గా నా పేరు సూర్య ఈయ‌న‌కు డ్రీమ్ డెబ్యూ అయితే కాదు. 

చివ‌ర‌గా: నా పేరు సూర్య‌.. దేశ‌భ‌క్తి ఉంది.. కానీ.. కానీ.. కానీ..!

రేటింగ్: 2.75/5

More Related Stories